కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తాం
ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ వారికి తగిన స్థానం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా చూడడమే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు.
ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేకు కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలకు డిసెంబర్ ఒక అద్భుతమైన మాసం. ఇదే నెలలో ఏసుక్రీస్తు పుట్టారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఈ నెలలోనే వచ్చిoది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎంతో ఉత్సాహాన్నిచ్చే నెల కూడా ఇదే. ఎందుకంటే పార్టీ నేత సోనియాగాంధీ పుట్టిన రోజు కూడా ఈ నెలలో ఉంది. మా ప్రభుత్వం ఏర్పాటైంది కూడా డిసెంబర్‌లోనే’అని గుర్తుచేశారు.
క్రిష్టియన్ మిషనరీల సేవలు అద్భుతం
నిన్ను నువ్వు ప్రేమించుకో, పొరుగువారిని ప్రేమించు అన్న ఏసుక్రీస్తు బోధనలు అనుసరిస్తే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని సీఎం అన్నారు. మానవ సమాజానికి అత్యంత ప్రధానమైన విద్య, వైద్యం అందించటంలో క్రైస్తవ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడుతున్నాయని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ దళిత క్రైస్తవులకు అవకాశం కల్పిస్తామని, ఆసక్తి ఉన్నవాళ్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వివరాలు ఇవ్వాలని సూచించారు.
సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబి్ధదారులను ఎంపిక చేస్తామని, వారిలో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో వారి కోటా తప్పకుండా వారితోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, పొంగులేటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment