సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్-2024 ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్, ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడింది. క్రీడల్లో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా ఉండేది. తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇది బాధ కలిగిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను.
నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియాకు బాక్సింగ్‌లో తలమానికంగా మారారు. జరీన్‌ను డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు కూడా డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాము. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్-17 పుట్ బాల్ నేషనల్ టీంను తెలంగాణ దత్తత తీసుకుంటోంది.
చిన్న దేశం దక్షిణ కొరియా ఒలంపిక్స్‌లో 36 పతకాలు సాధించింది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. దక్షిణ కొరియా కోచ్‌లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం. మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే. ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను పెంపొందించే అవకాశం ఉంటుంది. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి. రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment