Sports Hub
-
దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్-2024 ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్, ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడింది. క్రీడల్లో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా ఉండేది. తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇది బాధ కలిగిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను.నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియాకు బాక్సింగ్‌లో తలమానికంగా మారారు. జరీన్‌ను డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు కూడా డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాము. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్-17 పుట్ బాల్ నేషనల్ టీంను తెలంగాణ దత్తత తీసుకుంటోంది.చిన్న దేశం దక్షిణ కొరియా ఒలంపిక్స్‌లో 36 పతకాలు సాధించింది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. దక్షిణ కొరియా కోచ్‌లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం. మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే. ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను పెంపొందించే అవకాశం ఉంటుంది. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి. రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేద్దాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు అవసరమైన బ్రాండ్ పాలసీని రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. దీనికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంట్’ప్రాథమిక నివేదికను 15 రోజుల్లోగా తయారు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో క్రీడల అభివృద్ధిపై గ్రాంట్ థర్టన్ ఇండియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో క్రీడలు, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంకటేశం, పర్యాటక శాఖ కమిషనర్ సునితా ఎం.భగవత్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా 5, 6 క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు, హైదరాబాద్ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియంలు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో నిర్వహించబోయే చాంపియన్ షిప్స్, 2023లో వరల్డ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడల ఈవెంట్లు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. -
అసలు కంటే కొసరు మిన్న!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వ పెద్దలు స్వార్థమే పరమావధిగా సాగిస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజధానిలో బహుళ ప్రయోజన క్రీడా కేంద్రం(స్పోర్ట్స్ హబ్) నిర్మాణానికి గాను ప్రైవేట్ సంస్థలపై భారీగా రాయితీల వర్షం కురిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాజెక్టుల విధానం ప్రకారం.. పెట్టుబడి వ్యయంలో రాయితీలు 20 శాతానికి మించకూడదు. క్రీడా కేంద్రం నిర్మాణం విషయంలో ఈ నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పెట్టుబడికి రెట్టింపు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి పలుమార్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని, అందువల్లే నిర్మాణ సంస్థలను ఆకర్శించడానికి ఎక్కువ రాయితీలను ఇవ్వాల్సి వస్తోందంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) సాకులు చెబుతోంది. ప్రైవేట్ డెవలపర్లకు విచ్చలవిడిగా రాయితీలు ఇవ్వడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మౌలిక వసతులు లేకుండానే క్రీడా ప్రాంగణమా? రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండానే అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజన క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని, అందువల్లే నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలుత కనీస మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అయితే, రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజన క్రీడా మైదానాన్ని ఇప్పుడే నిర్మించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ డెవలపర్ పెట్టే పెట్టుబడికి రెట్టింపు రాయితీ ఇచ్చేందుకు సైతం సిద్ధపడింది. డెవలపర్ రూ.242 కోట్లు పెట్టుబడిగా పెడితే, రాయితీల రూపంలో ప్రభుత్వం రూ.484 కోట్లు ఇవ్వనుంది. ఈ క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల సమీపంలోనే 20 ఎకరాలను కేటాయించనుంది. ఇందులో 11 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తారు. మిగిలిన 9 ఎకరాలను స్థిరాస్తి వ్యాపారం చేసుకోవడానికి డెవలపర్‌కు కేటాయిస్తారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో స్పోర్ట్ హబ్ నిర్మిస్తారు. ఈ క్రీడా కేంద్రం నిర్మాణానికి రూ.175 కోట్ల వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు భారీగా రాయితీలను ప్రతిపాదించిన తరువాత నిర్మాణ వ్యయాన్ని రూ.242 కోట్లకు పెంచేశారు. ఎస్‌జీఎస్టీతోపాటు విద్యుత్ తదితర రంగాల్లో 35 ఏళ్లపాటు రాయితీల రూపంలో ప్రభుత్వం రూ.484 కోట్లు ఇవ్వనుంది. క్రీడా కేంద్రాన్ని వినియోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. ప్రైవేట్ డెవలపర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు స్వీకరించడానికి నోటీసులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. -
స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్: వీవీఎస్
హైదరాబాద్: మన హైదరాబాద్ నగరం స్పోర్ట్స్ హబ్‌గా మారుతోందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. పీవీ సింధు, సైనా, సానియాలాంటి మేటి క్రీడాకారులను తయారు చేసిన ఘనత మన నగరానిదేనని ఆయన అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ఎయిర్టెల్ మారథాన్ కౌంట్‌డౌన్ కార్యక్రమం బుధవారం బేగంపేట్‌లోని తాజ్ వివంతా హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీవీఎస్ మీడియాతో మాట్లాడుతూ నేటితరం పిల్లలు ఐపాడ్, కంప్యూటర్ కీబోర్డులకు అతుక్కుపోతున్నారని, వాటి నుంచి దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పారు. శారీరక, మానసిక వికాసానికి క్రీడలను అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తగా మారథాన్ ఈవెంట్‌ను నిర్వహించనుండటం అభినందనీయమని లక్ష్మణ్ తెలిపారు. స్వామి వివేకానంద మాటలే స్ఫూర్తిగా యువత మేల్కోవాలని, ఆరోగ్యాన్నిచ్చే ఆటల్లో పాలుపంచుకోవాలని సూచించారు. రెండ్రోజుల ఈవెంట్లో 27న హైటెక్స్‌లో 5కె రన్, 28న పీపుల్స్ ప్లాజా నుంచి 10కె రన్, హాఫ్ మారథాన్ (21 కి.మీ.), ఫుల్ మారథాన్ (42 కి.మీ.) నిర్వహిస్తారు. పరుగు సాగే రహదారి వెంబడి ప్రతి రెండు కిలోమీటర్లకు వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. కౌంట్‌డౌన్ కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు ఏపీ, తెలంగాణ రీజి యన్ ఎయిర్టెల్ సీఈఓ వెంకటేశ్ విజయరాఘవన్, మారథాన్ రేస్ డెరైక్టర్ మురళీ నన్నపనేని, రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు రాజేశ్ వెత్సా, కార్యదర్శి వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా హబ్‌గా ఆంధ్రప్రదేశ్
మంత్రి అచ్చెన్నాయుడు రామగిరి : రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో రూ.2.10 కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఇండోర్ స్టేడియాన్ని ఆదివారం జిల్లా మంత్రులు పరి టాల సునీత, పల్లె రఘనాథరెడ్డి, శాప్ చై ర్మన్ మోహన్, ఆర్డీటీ సంస్థ చైర్మన్ మంచో ఫైతో కలిసి ప్రారంభించారు. క్రికెట్ ఆడి ఆటల పోటీలు ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పదేళ్లలో క్రీడల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడా మైదానా లు అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌కు అవగాహన లేదన్నారు. పోలవ రం ముంపులోనున్న ఏడు మండలాల ను ఆంధ్రాలోకి కలుపుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మం త్రులు పల్లె రఘనాథరెడ్డి, సునీత ప్రసంగించారు. మంత్రుల చేతుల మీదుగా కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. జేసీ లక్ష్మికాంతం, ఏజేసీ ఖాజామొహీద్దీన్, మేయర్ స్వరూప పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్
వరంగల్హన్మకొండ చౌరస్తా :జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ విజేతలకు ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయించినట్టు చెప్పారు. జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, జాతీయ కోచ్ నాగపురి రమేష్, అసోసియేషన్ బాధ్యుడు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పక్షాన ఎమ్మెల్యే, కోచ్‌లను శాలువాతో సత్కరించారు. బెస్ట్ అథ్లెటిక్స్ : బాలురు ఓవరాల్ బెస్ట్ అథ్లెటిక్స్ గా అండర్-14 విభాగరంలో అరవింద్(మహబూబ్‌నగర్), అండర్-16లో ఈశ్వర్దత్మెయితా(హైదరాబాద్), అండర్-18లో సుధాకర్(ఖమ్మం), అండర్-20 విభాగంలో అగస్టీన్ ఏసుదాస్(రంగారెడ్డి) బెస్ట్ అథ్లెటిక్స్‌గా ఎంపికయ్యారు. బాలికలు.. అండర్-14 బాలికల విభాగంలో కవిత(కరీంనగర్), అండర్-16లో నిత్య(హైదరాబాద్), అండర్-18లో సుజాత(ఆదిలాబాద్), అండర్-20 విభాగంలో శ్రీలేఖ(వరంగల్) ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో.. బాలురు లాంగ్‌జంప్ అండర్-14 బాలుర విభాగంలో పాండునాయక్ (మహబూబ్‌నగర్), డిస్కస్ త్రో లో అండర్-16లో సాహిల్(హైదరాబాద్), హార్డిల్స్ అండర్-18లో కిరణ్‌కుమార్(ఖమ్మం), షాట్‌పుట్ అండర్-20 విభాగంలో అంకిత్‌కుమార్(హైదరాబాద్), 1500 మీటర్ల పరుగుపందెం అండర్-20 విభాగంలోకృష్ణయ్య (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు. బాలికలు.. బాలికల విభాగంలో డిస్కస్ త్రో అండర్-16లో సాయిప్రియాంక(కరీంనగర్), 200 మీటర్ల పరుగుపందెం అండర్-18లో విశాలాక్షి (రంగారెడ్డి), 1500 మీటర్ల రన్నింగ్ అండర్-20 విభాగంలో వి.నవ్య(నల్లగొండ) బెస్ట్ అథ్లెటిక్స్‌గా ఎంపికయ్యారు. వీరికి స్పోర్ట్స్ హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేశారు.