స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్: వీవీఎస్
హైదరాబాద్: మన హైదరాబాద్ నగరం స్పోర్ట్స్ హబ్‌గా మారుతోందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. పీవీ సింధు, సైనా, సానియాలాంటి మేటి క్రీడాకారులను తయారు చేసిన ఘనత మన నగరానిదేనని ఆయన అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ఎయిర్‌టెల్ మారథాన్ కౌంట్‌డౌన్ కార్యక్రమం బుధవారం బేగంపేట్‌లోని తాజ్ వివంతా హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీవీఎస్ మీడియాతో మాట్లాడుతూ నేటితరం పిల్లలు ఐపాడ్, కంప్యూటర్ కీబోర్డులకు అతుక్కుపోతున్నారని, వాటి నుంచి దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పారు.
శారీరక, మానసిక వికాసానికి క్రీడలను అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎయిర్‌టెల్ సంస్థలు సంయుక్తగా మారథాన్ ఈవెంట్‌ను నిర్వహించనుండటం అభినందనీయమని లక్ష్మణ్ తెలిపారు. స్వామి వివేకానంద మాటలే స్ఫూర్తిగా యువత మేల్కోవాలని, ఆరోగ్యాన్నిచ్చే ఆటల్లో పాలుపంచుకోవాలని సూచించారు. రెండ్రోజుల ఈవెంట్‌లో 27న హైటెక్స్‌లో 5కె రన్, 28న పీపుల్స్ ప్లాజా నుంచి 10కె రన్, హాఫ్ మారథాన్ (21 కి.మీ.), ఫుల్ మారథాన్ (42 కి.మీ.) నిర్వహిస్తారు. పరుగు సాగే రహదారి వెంబడి ప్రతి రెండు కిలోమీటర్లకు వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. కౌంట్‌డౌన్ కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు ఏపీ, తెలంగాణ రీజి యన్ ఎయిర్‌టెల్ సీఈఓ వెంకటేశ్ విజయరాఘవన్, మారథాన్ రేస్ డెరైక్టర్ మురళీ నన్నపనేని, రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు రాజేశ్ వెత్సా, కార్యదర్శి వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.