
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు అవసరమైన బ్రాండ్ పాలసీని రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. దీనికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంట్’ప్రాథమిక నివేదికను 15 రోజుల్లోగా తయారు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో క్రీడల అభివృద్ధిపై గ్రాంట్ థర్టన్ ఇండియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో క్రీడలు, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంకటేశం, పర్యాటక శాఖ కమిషనర్ సునితా ఎం.భగవత్, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా 5, 6 క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు, హైదరాబాద్ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియంలు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో నిర్వహించబోయే చాంపియన్ షిప్స్, 2023లో వరల్డ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడల ఈవెంట్లు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.