
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లుంటాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుపైనే భారత్ పతకావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
తొలి రౌండ్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఎస్టెర్ వర్దోయో (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ఈ టోర్నీ చరిత్రలో సింధు రెండుసార్లు (2014, 2022) కాంస్య పతకాలు సాధించింది. భారత్‌కే చెందిన సైనా నెహా్వల్ అత్యధికంగా మూడు కాంస్య పతకాలు గెలిచింది. ఈసారీ సింధు కాంస్యం నెగ్గితే సైనా రికార్డును సమం చేస్తుంది.
63 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ చేరుకోలేకపోయారు. సింధుతోపాటు భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, అనుపమ, ఆకర్షి కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున లక్ష్య సేన్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జి బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం; మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు.