అసలు కంటే కొసరు మిన్న! | Government authorities Irregularities in the name of capital structure | Sakshi
Sakshi News home page

అసలు కంటే కొసరు మిన్న!

Published Thu, Oct 18 2018 3:10 AM | Last Updated on Thu, Oct 18 2018 3:10 AM

Government authorities Irregularities in the name of capital structure - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వ పెద్దలు స్వార్థమే పరమావధిగా సాగిస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజధానిలో బహుళ ప్రయోజన క్రీడా కేంద్రం(స్పోర్ట్స్‌ హబ్‌) నిర్మాణానికి గాను ప్రైవేట్‌ సంస్థలపై భారీగా రాయితీల వర్షం కురిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాజెక్టుల విధానం ప్రకారం.. పెట్టుబడి వ్యయంలో రాయితీలు 20 శాతానికి మించకూడదు. క్రీడా కేంద్రం నిర్మాణం విషయంలో ఈ నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పెట్టుబడికి రెట్టింపు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్‌ హబ్‌ నిర్మాణానికి పలుమార్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని, అందువల్లే నిర్మాణ సంస్థలను ఆకర్శించడానికి ఎక్కువ రాయితీలను ఇవ్వాల్సి వస్తోందంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) సాకులు చెబుతోంది. ప్రైవేట్‌ డెవలపర్లకు విచ్చలవిడిగా రాయితీలు ఇవ్వడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

మౌలిక వసతులు లేకుండానే క్రీడా ప్రాంగణమా? 
రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండానే అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజన క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని, అందువల్లే నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలుత కనీస మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అయితే, రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజన క్రీడా మైదానాన్ని ఇప్పుడే నిర్మించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్‌ డెవలపర్‌ పెట్టే పెట్టుబడికి రెట్టింపు రాయితీ ఇచ్చేందుకు సైతం సిద్ధపడింది. డెవలపర్‌ రూ.242 కోట్లు పెట్టుబడిగా పెడితే, రాయితీల రూపంలో ప్రభుత్వం రూ.484 కోట్లు ఇవ్వనుంది.

ఈ క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల సమీపంలోనే 20 ఎకరాలను కేటాయించనుంది. ఇందులో 11 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తారు. మిగిలిన 9 ఎకరాలను స్థిరాస్తి వ్యాపారం చేసుకోవడానికి డెవలపర్‌కు కేటాయిస్తారు. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో స్పోర్ట్‌ హబ్‌ నిర్మిస్తారు. ఈ క్రీడా కేంద్రం నిర్మాణానికి రూ.175 కోట్ల వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు భారీగా రాయితీలను ప్రతిపాదించిన తరువాత నిర్మాణ వ్యయాన్ని రూ.242 కోట్లకు పెంచేశారు. ఎస్‌జీఎస్టీతోపాటు విద్యుత్‌ తదితర రంగాల్లో 35 ఏళ్లపాటు రాయితీల రూపంలో ప్రభుత్వం రూ.484 కోట్లు ఇవ్వనుంది. క్రీడా కేంద్రాన్ని వినియోగించే వారి నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేస్తారు. ప్రైవేట్‌ డెవలపర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు స్వీకరించడానికి నోటీసులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement