రాజధాని నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ | Municipal Department to High Court on Capital structure | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ

Published Thu, Jun 9 2022 5:38 AM | Last Updated on Thu, Jun 9 2022 3:07 PM

Municipal Department to High Court on Capital structure - Sakshi

సాక్షి, అమరావతి: అభివృద్ధి చెందిన నగరాలు, రాజధానులు అన్నిరకాలుగా అభివృద్ధి సాధించి ఆ స్థాయికి రావడానికి కనీసం 40–50 సంవత్సరాలు పట్టిందని, రాజధాని నగర నిర్మాణం అన్నది ఎంతో సమయం తీసుకునే సుదీర్ఘ ప్రక్రియ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను తగిన మౌలిక వ సతులు కల్పించి అప్పగించడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వివరించింది.

అందువల్ల రాజధాని నగర నిర్మాణం విషయంలో నిర్దేశించిన కాల పరిమితులన్నింటినీ తొలగించడమో లేదా తీర్పులో విధించిన గడువు పెంచడమో చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. అంతేకాక రాజధాని నగరానికి మాత్రమే పరిమితమవుతూ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి, ఏపీ సీఆర్‌డీఏకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును మరోసారి కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

రాజధాని  వ్యవహారంలో ఇటీవల హైకోర్టు తీర్పునిస్తూ.. రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీ ఆర్‌డీఏను ఆదేశించిన విషయం తెలిసిందే.   రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆ దేశించింది. ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చిన య జమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాస యోగ్యమైన రీతిలో మూడు నెలల్లో అప్పగించాలని కూడా ఆదేశించింది.

రాజధాని అభివృద్ధికి సంబంధించిన పురోగతితో ఎప్పటికప్పుడు అఫిడవిట్‌లు వేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు  ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో ఇంకా ఏ విషయాలు పొందుపరిచారంటే..

దశల వారీగా ప్లాట్లు అప్పగిస్తాం
ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు 63,452 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 21,567 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు 41,885 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేశాం. భూసేకరణ వివా దం వల్ల 3,289 ప్లాట్లను కేటాయించడం గానీ, రిజి స్టర్‌ చేయడం గానీ చేయలేదు. 1.4.2022 నాటికి 17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు అర్హమైనవి. ఇందులో 709 ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశాం.

మిలిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ నిమిత్తం రైతులకు నోటీసులిచ్చాం. మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా ప్లాట్లను దశలవారీగా రైతులకు అప్పగిస్తాం. పనులను వేగవంతం చేసేందుకు సీఆర్‌డీఏ ఎప్పటికప్పుడు సంబంధిత సంస్థలు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటివరకు మూడు సమావేశాలు నిర్వహించాం. నిధుల సమీకరణ నిమిత్తం బ్యాంకర్లతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం.

రాజధాని అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు అవసరం కాబట్టి, అంత పెద్ద మొత్తాన్ని ఒక బ్యాంక్‌ ఇవ్వడం సాధ్యం కాదని, బ్యాంకుల కన్సార్టియం ఏర్పాటు అవసరం ఉందని బ్యాంకర్లు చెప్పారు. సవరించిన మోడల్‌తో రూ.3,500 కోట్లకు తాజాగా ప్రతిపాదనలు పంపాలని బ్యాంకర్లు కోరారు. తగిన సమయంలో బ్యాంకర్లతో తదుపరి సమావేశం ఉంటుంది

నిర్మాణాల గడువును పొడిగించాం
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ కోసం భూములను, ప్లాట్లను వేలం వేయడానికి సీఆర్‌డీఏ ప్రయత్నిస్తోంది. ఎస్టేట్‌ విభాగం ఖాళీ స్థలాలను గుర్తించే పనిలో ఉంది. నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో 331 ప్లాట్లను వేలం వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్లాట్ల వేలం ద్వారా రూ.330 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నాం.

రూ.33.51 కోట్లతో హైకోర్టు అదనపు భవనం నిర్మాణం జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్‌ ఇండియా సర్వీసు అధికారుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు ఎన్‌సీసీ సంస్థకు 30.11.2022 వరకు గడువును పొడిగించాం. 18 టవర్లలోని 432 అపార్ట్‌మెంట్‌ యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి.

రాజధాని నగర నిర్మాణంలో భాగంగా దొండపాడు సమీపంలోని 14.5 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్‌ నిర్మాణ పనులను ఎన్‌సీసీ మొదలు పెట్టింది. ఇప్పటివరకు రూ.175.87 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. మిగిలిన పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న కరకట్ట సింగిల్‌ రోడ్డును డబుల్‌ లైన్‌ రోడ్డుగా విస్తరిస్తున్నాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement