
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాసుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అమరావతి వ్యాజ్యాల్లో వారిని ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో నిర్మించతలపెట్టిన అతిథి గృహానికి సంబంధించిన ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో అతిథి గృహానికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్లాన్‌లను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని పరిశీలించి, ఆ తర్వాత తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఆ డ్రాఫ్ట్ ప్లాన్ల విషయంలో అభ్యంతరాలుంటే లేవనెత్తవచ్చునని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.ప్రణతికి ధర్మాసనం వెసులుబాటునిచ్చింది.
రాజధాని వ్యాజ్యాలపై మొదలైన తుది విచారణ
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం నుంచి తుది విచారణ మొదలు పెట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ తన వాదనలను వినిపించారు. ల్యాండ్ పూలింగ్ కింద మంచి పంటలు పండే భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారని, ఇప్పుడు రాజధానిని మార్చడం ద్వారా ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్టయిందని కోర్టుకు నివేదించారు. ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment