రాజధానికి దండుగట్టారు
సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో మొట్టమొదటి సారి ‘సమైక్య సభ’ జరుగుతోంది. ‘సిర్ఫ్ హైదరాబాద్ హమారా’ అంటూ తెలంగాణవాదులు ఇంతకాలంగా రాజధాని నగరంలో సమైక్యవాదాన్ని వినిపించకుండా జాగ్రత్తపడినా.... రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన తమ పరిస్థితి ఏంటని సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగుల నుంచి పుట్టిన గళం నెల రోజులుగా వేళ్లునూకుని నేడు ‘సమైక్యాంధ్ర పరిరక్షణ’ వేదికగా హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరపుకునే వరకూ వచ్చింది.
తెలంగాణ గడ్డమీద తొలిసారిగా తమకు సమైక్యవాదాన్ని వినిపించేందుకు వచ్చిన అవకాశాన్ని సీమాంధ్ర ప్రజలు ప్రతిష్ఠాకరంగా తీసుకొని రాజధానికి దండుకట్టారు. సీమాంధ్ర జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు భాగ్య నగరానికి తరలి వచ్చారు. ఎల్బీ స్టేడియంతో పాటు స్టేడియం పరిసర ప్రాంతాలు జన సందోహమయ్యాయి. సమైక్య నినాదాలు మిన్నంటాయి. వేలాదిగా తరలి వచ్చిన ఏపీ ఎన్జోవోలతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.
శనివారం ఉదయం నుంచే ఉద్యోగులు తమ గళం విప్పేందుకు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. సభ ప్రారంభం అవటానికి ముందే గ్యాలరీలతో పాటు మైదానం కూడా కిక్కిరిసి పోయింది. మరోవైపు వేలాది మంది ఉద్యోగులు లోపలికి వెళ్లేందుకు ....స్టేడియం బయట వేచి ఉండే పరస్థితి నెలకొంది. దాంతో పోలీసులు ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలకి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలి వచ్చారు.
సమైక్య సభ జరగడానికి ముందు రోజే హైకోర్టులో తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదుల మధ్య జరిగిన శుక్రవారం జరిగిన ఘర్షణ మరింత వేడి పుట్టించింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతించవద్దని కొంతమంది తెలంగాణవాదులు చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించినా, ఫలితం లేకపోయింది. న్యాయస్థానం కూడా సభ జరుపుకోవడానికి అనుమతించడంతో తెలంగాణవాదుల ప్రయత్నం ఫలించలేదు.
దాంతో 24 గంటల బంద్కు పిలుపునిచ్చి రవాణా వ్యవస్థను స్తంభింప చేసినా అవేమీ..... సభకు తరలి వచ్చేవారిపై ప్రభావం చూపలేదు. అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఓ పక్క బంద్ .... మరో పక్క బచావ్... మధ్య ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ రాజధాని వాసుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో జరగనున్న సభను నిశితంగా గమనిస్తోంది.
తీవ్ర ఇరకాటంలో తెలంగాణవాదులు
ఇక హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తోన్న సమైక్య సభ తెలంగాణవాదులను తీవ్ర ఇరకాటంలో పడేసింది. తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో సమైక్యసభ విజయవంతమైతే తెలంగాణవాదానికి నష్టం జరుగుతుందని తెలంగాణవాదులు జంకుతున్నారు. అలాగనీ ఒకవేళ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇంతకాలంగా సీమాంధ్ర ప్రజలు తమకు హైదరాబాద్‌లో రక్షణలేదనే వాదన బలపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
సమైక్య సభ విజయవంతమైనా, విఫలమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏమైనా ప్రతిబంధకంగా మారుతుందా? అన్న భయోందోళనలు తెలంగాణవాదుల్లో నెలకొన్నాయి. ఏవిధంగా చూసినా హైదరాబాద్‌లో జరగబోయే సమైక్యసభ తెలంగాణవాదులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది.