-
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో అశోక్‌బాబు స్పష్టీకరణ
-
రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించడం లేదు
-
ఇది ఆరంభం మాత్రమే.. విభజనపై ముందుకు వెళ్తే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్
-
విభజన జరిగితే నష్టపోయేది విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే
-
అడ్డుకుంటామన్నా తెలంగాణవాదుల వ్యాఖ్యలే సభను విజయవంతం చేశాయి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజనను నాలుగైదు పార్టీలు కలిసి నిర్ణయించే పరిస్థితి వచ్చింది. అయినా రాజకీయ పార్టీలను, నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది ప్రజలను పాలించడానికి కానీ, విభజించడానికి కాదు. విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే దానిని ప్రజలు ఆమోదించి ఉండేవారు. అలాకాకుండా రాజకీయ లబ్ధి కోసం, అధికారమే పరమావధిగా తీసుకున్నందునే ప్రజలు అంగీకరించడం లేదు. ఈ రాష్ట్రం ఇలానే ఉంటుంది... ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్‌లో సమైక్యవాదాన్ని వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభ ప్రారంభం మాత్రమే. విభజనపై కేంద్రం ముందుకెళితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతాం.
ఇది బెదిరింపో.. ఇంకోటో కాదు.. మా గళం చెప్పుకునేందుకే.’’ అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు ప్రసంగిస్తూ.... ‘‘రాష్ట్రం విడిపోవాలా.. కలిసుండాలా అనేది మా చేతుల్లోనే ఉంది. రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ప్రజల నిర్ణయాలను కాదంటే ప్రపంచంలో ఏ పార్టీ మనుగడ సాగించలేదు. ప్రజల ఆమోదం లేనిదే విభజనపై కేంద్రం వెనక్కు వెళ్లలేకపోయినా.. ముందుకు మాత్రం వెళ్లలేదు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యంగా మూడువర్గాలు నష్టపోతాయి. విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. వారి కోసమే ఈ సభను నిర్వహించాం తప్ప ఎవరికో వ్యతిరేకంగా కాదు. రాజకీయ లబ్ధి కోసం కానే కాదు. మాకు రాజకీయ నిర్ణయం తీసుకునే శక్తి ఉంది.
అలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలు కిందామీదా అవుతాయి. రాజకీయ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే హైదరాబాద్ నడిగడ్డపై సభ నిర్వహించాం. ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు.. వేతనాలు లేవు. అయినా ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఈ సభకు హాజరయ్యారు. సభను అడ్డుకుంటాం... ఆపేస్తాం... తంతాం అని తెలంగాణవాదులు చేసిన వ్యాఖ్యలే ఈ సభ పెద్దయెత్తున విజయవంతం అవడానికి కారణమయ్యాయి. సమస్యను ఇరువర్గాలు కూర్చుని పరిష్కరించుకోవాలే తప్ప బెదిరిస్తే కుదరదు. ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఎప్పుడు ఆగిపోతుందో, ఎటు వెళుతుందనే దానిపై ఇప్పుడే చెప్పలేము. ఈనెల 16 తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో ఆరులక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. విడిపోయిన తర్వాత వారికి పింఛన్లు ఇచ్చే విషయంలో సరైన మార్గదర్శకాలు లేవు. విడిపోయిన రాష్ట్రాల్లో అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా అమల్లో ఉన్న జోనల్ వ్యవస్థను ఏం చేస్తారు? నీళ్లు, కరెంటు లాంటి అనేక సమస్యలు రాష్ట్ర విభజనతో వస్తాయి’’ అని పేర్కొన్నారు. సభ విజయవంతమైందని అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అశోక్‌బాబు చెప్పారు. సభను శాంతియుతంగా నిర్వహించి, తమ వాదన వినిపించడం ద్వారా లక్ష్యం నెరవేరిందన్నారు.
రాష్ట్ర ఏర్పాటు సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలను ఉటంకిస్తూ అశోక్‌బాబు చెప్పిన కథకు మంచి స్పందన వచ్చింది. ‘ గడుసు అబ్బాయికి, అమాయక అమ్మాయికి పెళ్లి చేస్తామని, ఏదైనా ఉపద్రవం వస్తే వీరు విడిపోవచ్చని నెహ్రూ ఆరోజు చెప్పిన మాట వాస్తవమే. ఆ దంపతులిద్దరూ 50 ఏళ్ల పాటు కాపురం చేశారు. వారికి హైదరాబాద్ మహానగరం అనే కొడుకు పుట్టాడు. అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లాంటి ఉద్యోగస్తుడు అయ్యాడు. ఇప్పుడు ఇద్దరికీ స్ఫర్థలొచ్చాయి. గతంలో ఇలాంటి స్ఫర్థలు వచ్చినప్పుడు అత్తగారు లాంటి ఇందిరాగాంధీ పిలిపించి కాపురం చేయాల్సిందేనని చెప్పారు. మీ హైదరాబాద్ అనే మంచి కొడుకు వృద్ధిలోనికి వస్తాడని చెప్పి పంపించారు. ఆ తర్వాత దంపతులిద్దరూ 1975 నుంచి 2003 వరకు హనీమూన్ చేసుకున్నారు.ఈరోజు తెలంగాణలో రాజకీయాలు ముదిరిన తర్వాత.. కాపురం చేయవద్దని చెపితే కేంద్రం కూడా ఆమోదించింది. ఇప్పుడు మీ కొడుకుని, ఆస్తులను తీసుకుని భార్యను వెళ్లిపొమ్మంటున్నారు. గతంలో కూడా విడిపోతాం అన్నారు కాబట్టి విడిపోవాలంటున్నారు. మరి ఇప్పుడు 50 ఏళ్లు కాపురం చేసిన తర్వాత అన్నీ తీసుకుని భార్య వెళ్లిపోతే ఆ ముసలి భర్త ఎక్కడికెళ్లాలి? దీనికి సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు.
పొట్టి శ్రీరాములు అవుతాం: మురళీకృష్ణ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అవసరమైతే ప్రతి ఉద్యోగి ఒక పొట్టి శ్రీరాములుగా మారుతారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ స్పష్టం చేశారు. సీమాంధ్రలోని పలు ప్రాంతాలు ఒకప్పుడు హైదరాబాద్‌లో భాగమేనని, నిజాం పాలన తర్వాత అవి వేరుపడ్డాయన్నారు. సచివాలయంలో సీమాంధ్రులు అధికంగా ఉన్నారని, ఉద్యోగాలన్నీ వారు తన్నుకుపోయారని ఆరోపిస్తున్నారని, అయితే సచివాలయం, డెరైక్టరేట్లలోని ఉద్యోగాలు ఆరు సూత్రాలు పథకం, 610 జీవో పరిధిలోకి రావన్న సంగతి తెలిసి కూడా తెలంగాణవాదులు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అవి రాష్ట్రవ్యాప్తంగా వచ్చే పోస్టులని, సీమాంధ్ర ప్రాంతంలోని వారు మొదటినుంచి విద్యాభివృద్దిలో ఉన్నారని, ఈ మధ్య తెలంగాణలోనూ విద్యావంతులు ఎక్కువయ్యారని వివరించారు. వెనుకబాటుతనం, ఉద్యోగాలు, అభివృద్ది, ఆత్మగౌరవం అన్ని నినాదాలు వదిలి ఇప్పుడు స్వయంపాలన అంటూ నినాదం ఎత్తుకున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికే ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని, రాష్ట్రం విడిపోతే ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్లుగా సాగుతోందని అబద్దం అడుతున్నారని 1968 సమయంలో ఐదేళ్లు, ఇప్పుడు 12 ఏళ్లు మాత్రమే ఉద్యమం నడిచిందన్నారు.
విభజిస్తే రాష్ట్రం అంధకారమే : శ్రీనివాసరావు
రాష్ట్ర విభజన దిశగా కేంద్రం ముందుకు వె ళ్తే రాష్ట్రం అంధకారమవుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 12 నుంచి తాము విధులకు హాజరుకాబోవడం లేదని, ఈ మేరకు ఇదివరకే నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి స్టేషన్‌లను ట్రిప్ చేయబోమని, విధులకు మాత్రం దూరంగా ఉంటామని చెప్పారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణకే ఇస్తున్నామని వివరించారు. 54 శాతం విద్యుత్ తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలో వినియోగిస్తున్నారని, వ్యవసాయానికి 80 శాతం ఉచిత విద్యుత్ తెలంగాణలోనే ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సమైక్య ప్రకటన వచ్చేదాకా సమ్మె: ప్రసాద్
ఆర్టీసీ కార్మికులు మొదటిసారి వ్యక్తిగత కారణాల కోసం కాకుండా రాష్ట్రాన్ని విభజించరాదన్న ఏకైక డిమాండుతో 13 జిల్లాల్లోని 123 డిపోల్లో పూర్తిస్థాయిలో సమ్మె చేస్తున్నారని ఎన్‌ఎంయూ నాయకుడు ప్రసాద్ తెలిపారు. వేతనాలు లేకపోయినా సరే.. రాష్ట్ర విభజన జరగదని ప్రకటన వచ్చే వరకు సమ్మెలో పాల్గొంటామని స్పష్టంచేశారు. విభజన జరిగితే పల్లెవెలుగులు మూతపడి ప్రైవేట్ యాజమాన్యాల దాష్టీకం పెరుగుతుందని వివరించారు. సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
రాజీనామాలు చేయని నేతలది ఏ జాతి: కృష్ణ
సాక్షి, హైదరాబాద్: తాము హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు రాళ్లు విసిరిన తెలంగాణ వారి మీద పోరాటం చేయడం లేదని, రాష్ట్రాన్ని చీలుస్తామంటున్న కేంద్రం మీదేనని విద్యార్థి నేత కృష్ణయాదవ్ చెప్పారు. 17 మంది ఎంపీలు డిమాండ్ చేస్తేనే తెలంగాణ వస్తుంటే, 25 మంది సీమాంధ్ర ఎంపీలు అడిగితే సమైక్య రాష్ట్రం కొనసాగదా? అని ప్రశ్నించారు. సమైక్య ఉద్యమంలో ఆడ, మగ, హిజ్రాలు పాల్గొంటున్నారని, మరి రాజీనామాలు చేయకుండా, ఉద్యమంలో పాల్గొనకుండా తప్పించుకుంటున్న రాజకీయ నాయకులది ఏ జాతి అని నిలదీశారు.