అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచి... రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం కావడంతో జిల్లాలోని సమైక్యవాదుల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతోంది. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు.
అనంతపురం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ చేశారు.జేఎన్‌టీయూ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్ వద్ద మానవహారం నిర్మించారు. జూనియర్ కళాశాలల అధ్యాపకులు హెల్మెట్లుధరించి వినూత్న నిరసన ప్రదర్శన, టవర్‌క్లాక్ వద్ద మానవహారం చేపట్టారు. లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గొంతుకు ఉరి తాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ముదిగుబ్బలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వివిధ వేషధారణలతో ప్రదర్శన, ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహించారు.
సప్తగిరి కళాశాల అధ్యాపకులు కాళ్లు కట్టేసుకుని గెంతుతూ నిరసన తెలిపారు. లేపాక్షి బంద్ విజయవంతమైంది. లేపాక్షిలో ఈ నెల 12న తలపెట్టిన ‘లేపాక్షి బసవన్న రంకె’ లక్ష జనగర్జన సభ ఏర్పాట్లను స్థానిక తహశీల్దార్, సీఐ, జేఏసీ కమిటీ సభ్యులు పరిశీలించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర కదిరిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేత వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా నాయకులు హాజరయ్యారు. సమైక్య దళిత గర్జనతో కళ్యాణదుర్గం హోరెత్తింది. సీమాంధ్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ దిష్టిబొమ్మను ఎంఆర్‌పీఎస్ నాయకులు దహనం చేశారు.
సీమాంధ్రలో అడుగుపెడితే తరిమి కొడతామని మందకృష్ణను హెచ్చరించారు. పెనుకొండలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. రొద్దంలో వృద్ధులు రిలే దీక్షలు చేపట్టారు. గోరంట్లలో విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో జర్నలిస్టుల 48 గంటల దీక్ష కొనసాగుతోంది. ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. రాష్ట్ర విభజనతో తీవ్ర వేదనకు లోనైన ధర్మవరం పట్టణానికి చెందిన కల్లిటి శ్రీనివాసులు (49) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడని, నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారని స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపారు.
సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా భగ్గుమన్న ‘అనంత’ హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ శనివారం జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు, సమైక్యవాదులు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. గుంతకల్లులో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కసాపురం రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
గుత్తిలోని 44వ జాతీయ రహదారిపై సమైక్యవాదులు నల్లజెండాలతో రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదులు హిందూపురంలో రాస్తారోకో చేపట్టి, తెలంగాణ న్యాయవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో మానవహారం నిర్మించారు. కళ్యాణదుర్గంలో రాస్తారోకో చేసి... స్థానిక అక్కమాంబ కొండపై సమైక్యాంధ్ర బెలూన్‌ను ఏర్పాటు చేశారు. మడకశిరలో మౌన ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడిపత్రిలో సమైక్యవాదులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు.
విభజనాగ్రహం
Published Sun, Sep 8 2013 5:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement