సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘సమైక్య శంఖారావం’ సభకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ జేఏసీల నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రచయితలు, రైతులు, ఎస్కేయూ, జేఎన్‌టీయూ సిబ్బంది...ఇలా అన్ని వర్గాల ప్రజలు వెల్లువలా తరలివెళ్లారు.
జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, పుట్టపర్తి, పెనుకొండ, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి వేలాది మంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు (ఎన్‌జీఓలు) రాజధానికి పయనమయ్యారు. సెలవు పెట్టి మరీ వెళుతున్నట్లు వారు చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు కూడా భారీగా తరలివెళ్లారు.
వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన వాహనాలు, ప్రత్యేక రైలులోనే కాకుండా..ప్రజలు, ఉద్యోగులు స్వచ్ఛందంగా వాహనాలను సమకూర్చుకుని వెళ్లడం గమనార్హం. ఆలస్యమైతే హైదరాబాద్‌లో వాహనాలకు పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయన్న ఉద్దేశంతో ఉదయం నుంచే జిల్లా నుంచి బయలుదేరారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో ఎక్కడ చూసినా సమైక్య శంఖారావానికి తరలివెళ్లే వాహనాలే కన్పించాయి. వాహనాలు సరిపోకపోవడంతో చాలా మంది రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో కూడా బయల్దేరి వెళ్లారు.
దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో రద్దీ కన్పించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వ్యంలో పార్టీ నాయకులు, ప్రజలు వాహనాల్లో తరలివెళుతూ దారి పొడవునా ‘జై జగన్’, ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలను మార్మోగించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు మాట్లాడుతూ తెలుగుతల్లి సౌ‘భాగ్య’నగరం హైదరాబాద్‌ను చేజార్చుకునేందుకు సీమాంధ్రులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమంలో తాము పాలుపంచుకుని..ఎందాకైనా వెళతామన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు, ఎందరో నాయకులు ఉన్నా.... ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు.
పదపదమని...
Published Sat, Oct 26 2013 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement