సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం: అశోక్‌బాబు
సమ్మెలో కొనసాగుతూనే తుపాను ప్రాంతాల్లో సేవలందిస్తాం
17 నుంచి బ్యాంకుల మూసివేత.. కేంద్ర కార్యాలయాల దిగ్బంధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించేవరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెను తుపాన్ ముప్పు ఎదుర్కొంటున్న కోస్తాంధ్రలో తమ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే సేవలందిస్తున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 15వతేదీన మండల స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. 13వతేదీ నుంచి 15 వరకు చెన్నై వెళ్లి డీఎంకే, ఏఐడీఎంకె పార్టీల అధినేతలను కలసి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరతామన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి 19 వరకు బ్యాంకుల మూసివేత, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్భంధం చేస్తామన్నారు.
కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్తు ఉండదు
రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై కనీస అవగాహనలేని కేంద్ర మంత్రులతో కమిటీ వేయడం, వారు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడం తెలుగు ప్రజల దురదృష్టమని అశోక్‌బాబు పేర్కొన్నారు. మంత్రుల కమిటీ(జీవోఎం) లోపభూయిష్టంగా ఉందని, ఇరు ప్రాంతాల వారిని మోసగించేలా అది ఏర్పాటైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజలను ప్రభుత్వం మోసగిస్తుండడం ఇదే ప్రప్రథమమన్నారు. కోట్లాది మంది ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేనట్లేనని స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తు కోరుకునే పార్టీలు విభజన నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరేంద్రబాబు, సీవీ రమణ, రత్నకుమారి, జానకి తదితరులు పాల్గొన్నారు.