చెన్నైలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. మెరుగైన వేతనాలు, తమ యూనియన్‌కు గుర్తింపు కోసం దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సమ్మె ఆపాలని యాజమాన్యం ఎంత హెచ్చరించినా వెనక్కితగ్గడం లేదు. దీంతో కంపెనీ కొత్త ఎత్తు వేసింది.
శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్-సీఐటీయూ నేతృత్వంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో గృహోపకరణాల విక్రయానికి కీలకమైన పండుగ సీజన్‌కు ముందు ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. సమ్మె ఇప్పుడు నాల్గవ వారానికి చేరుకోవడంతో ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకుని సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వారి ఇళ్లకు ‘స్నాక్ కిట్’లను పంపుతోందని ఫ్రంట్‌లైన్ నివేదించింది.
తమిళనాడులోని శాంసంగ్ ప్లాంట్‌లో దాదాపు 1,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1,000 మందికి పైగా కార్మికులు సెప్టెంబర్ 9 నుండి సమ్మెలో ఉన్నారు. తమ యూనియన్‌ను గుర్తించాలని, మూడేళ్ల జీతం రూ.36,000 పెంచాలని, షిఫ్ట్ అలవెన్స్‌ను రూ.150 నుండి రూ.250కి పెంచాలని, పితృ సెలవులను మూడు నుండి ఏడు రోజులకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సమానమైన అర్హతలు, విధులు ఉన్న కార్మికులకు సమాన వేతనం అమలుచేయాలని కోరుతున్నారు.
2007లో ఇక్కడ ఏర్పాటైన శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గత 16 సంవత్సరాలుగా యూనియన్ లేకుండా పని చేస్తోంది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ మద్దతుతో గత సంవత్సరం ఏర్పడింది. అయితే దీనికి కంపెనీ నుండి అధికారిక గుర్తింపు లేదు.
కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నిరసనను కొనసాగిస్తే వేతనాలు ఆపేస్తామని, విధుల నుంచి తొలగిస్తామని గత నెలలో కంపెనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఇప్పుడు ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వారికి పండ్లు, చాక్లెట్‌లతో కూడిన స్నాక్ కిట్‌లను పంపుతోంది. అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా ఫ్రంట్‌లైన్ పేర్కొంది. అయితే ఈ వార్తలను శాంసంగ్ యాజమాన్యం ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment