సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: అశోక్ బాబు
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించింది. ఆదివారం ఏపీఎన్జీవోలు సమావేశమై ఉద్యమం కార్యాచరణ గురించి చర్చించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కితీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రమంత్రులపై నమ్మకం పోయిందని సమావేశానంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని కేంద్రమంత్రులు వమ్ముచేశారని విమర్శించారు.
సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యేల నుంచి హామీ పత్రాలను తీసుకుంటామని తెలిపారు. 8,9 తేదీల్లో కేంద్ర కార్యాలయాలను దిగ్బంధిస్తామని చెప్పారు. ఉద్యోగులపై దాడి చేసిన ఎంపీ హర్షకుమార్ కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో రాజకీయ అరాచకం జరుగుతోందని విమర్శించారు. విభజనకు నిరసనగా దసరాను జరపడం లేదని అశోక్‌బాబు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో పిలుపు వస్తేనే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు.