కడవరకూ పోరాడదాం
సాక్షి, కాకినాడ :
‘కడ వరకు పోరాడదాం... రాష్ర్ట సమైక్యతను కాపాడుకుందాం’ అంటూ ఏపీఎన్జీఓలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌తో సహా వీఆర్వో కార్యాలయం వరకు పరిపాలన పూర్తిగా స్తంభించింది. సమ్మె బాటపట్టిన ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. రెండో రోజు వీరి ఆందోళనలకు పలు చోట్ల ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు. విభజన బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితులు కన్పిస్తుండడంతో సోమవారం నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ట్రెజరీ, హౌసింగ్, సహకార శాఖ సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మె బాటపట్టనున్నారు. మరొక పక్క తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అర్ధరాత్రి నుంచే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పారిశుద్ద్య సిబ్బంది సమ్మె బాట పట్టనుండడంతో మిగిలిన ఉద్యోగులు సోమవారం నుంచి సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మెలోకి రావాలని ఏపీ ఎన్జీఓలు పిలుపునిచ్చారు.
వినూత్న నిరసనలు
ఏపీఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వే శారు. కలెక్టరేట్ రోడ్‌లో ఉన్న ఆర్డీఓ కార్యాలయం, జెడ్పీ, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాలను కూడా దగ్గరుండి మూయించి వేశారు. జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. జెడ్పీ ఉద్యోగిని తెలుగుతల్లి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై జరిగిన ప్రదర్శనలో ‘తెలుగుప్రజలందరం ఒక్కటిగా ఉందాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం అంటూ నినదించారు. విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో ఏపీ ఎన్జీఓలు, ఏయూ పూర్వవిద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీఓలు నిరసన ప్రదర్శన చేయగా, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ శిబిరాన్ని జేఏసీ నాయకులు అడ్డుకొని వారిని బయటకు పంపించారు.
10న కేంద్ర కార్యాలయాల ముట్టడి
10వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 12వ తేదీన రహదారులను దిగ్బంధించాలని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపు నిచ్చారు. 10వ తేదీన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట అధ్యక్షుడు పి. అశోక్‌బాబు ముఖ్యఅతిథిగా జరుగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అదే సంకల్పం..ఆగలేదు సమరం
Published Sat, Feb 8 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement