సమైక్యపోరుకు రాజకీయ జేఏసీ!
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ పార్టీలన్నీ కలిసి రాజకీయ జేఏసీ ఆవిర్భవించే అవకాశం ఉందని, రాజకీయ జేఏసీ ఆవిర్భావానికి శనివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం వేదిక కానుందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. శుక్రవారం ఏపీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో ఆయా పార్టీలన్నీ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక(ఎస్‌ఆర్‌పీవీ)కు అండగా నిలవాలని సమావేశంలో కోరనున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11గంటలకు ఏపీఎన్జీవో భవన్లో ప్రారంభం కానున్న అఖిలపక్ష భేటీకి పార్టీల వారీగా, ప్రాంతాలవారీగా సమైక్యవాదానికి కట్టుబడిన ప్రతినిధులు హాజరు కానున్నారని, విభజనవాదాన్ని వినిపిస్తున్న పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానించలేదని చెప్పారు. పార్టీలు తమ విభేదాలను పక్కనబెట్టి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ వేదికపై మాట్లాడేందుకు ఇష్టంలేని సమైక్య పార్టీలు వేరొక వేదికపైకి తమను ఆహ్వానించినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అఖిలపక్షానికి పార్టీల ప్రతినిధులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చిన ఎంపీలు హాజరుకానున్నట్లు అశోక్‌బాబు పేర్కొన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో సమైక్యవాదులకు ఇదే ఆఖరి పోరాటమన్నారు.
అశోక్‌బాబు, పయ్యావుల మంతనాలు
సమైక్య రాష్ట్రం కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నామంటున్న అశోక్‌బాబు, సమన్యాయం సిద్ధాంతంలో సమైక్య వాదం అంటున్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం రహస్యంగా మంతనాలు జరిపారు. అశోక్‌బాబు ప్రెస్‌మీట్ ముగుస్తుండగానే.. పయ్యావుల అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ కలయికకు కారణమేంటని విలేకరులు అడిగినా ఏమీ చెప్పకుండా అశోక్‌బాబుతో కలిసి ఓ గదిలో తలుపులు వేసుకొని అరగంటకుపైగా రహస్యంగా సంభాషించారు. అనంతరం అశోక్‌బాబుతో కలసి బయటకు వచ్చిన పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అలుపెర గని పోరాటం చేస్తున్న ఏపీఎన్జీవోలు రాజకీయ పక్షాలతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమన్నారు.
తమది సమైక్యవాదం అని చెప్పిన వైఎస్సార్‌సీపీ.. టీఆర్‌ఎస్‌తో డ్యూయెట్లు, కాంగ్రెస్‌తో కాపురం, బీజేపీతో సహజీవనం చేస్తోందని ఆరోపించారు. భేషజాలను పక్కనబెట్టి సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న అఖిలపక్ష భేటికి రావాలని వైఎస్ జగన్‌ను కోరుతున్నానని చెప్పారు. ‘‘సమైక్యవాదమే తమ పార్టీ స్టాండ్‌గా వైఎస్సార్ సీపీ ప్రకటిస్తుంటే.. చంద్రబాబు మాత్రం తనది ఏవాదమో ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నారని..’’ అక్కడే ఉన్న ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలవారూ కలసిరావాలని కోరుతున్న మీరు, మీ పార్టీ అధ్యక్షుడిని ఈ సమావేశానికి తీసుకురాగల రా?, కనీసం ఆయన నోటి వెంట ఒక్కసారైనా తనది సమైక్యవాదమని చెప్పించగలరా? అని అడిగిన ప్రశ్నలకు పయ్యావుల నుంచి సమాధానాలు కరువయ్యాయి.