సాక్షి, తిరుపతి: పట్టణాలు, పల్లెలని తేడా లేకుండా వాడవాడలా సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు సోమవారం తిరుపతితో ఉద్యమ సారథులు సమావేశ మయ్యారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతిలో మానస అనాథాశ్రమం, సాయిశ్రీ స్కూలు విద్యార్థులు సమైక్యాంధ్ర జాతర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోల్చారు. దున్నపోతు ఆకారంలో తయారు చేసిన బొమ్మను కార్పొరేషన్ కార్యాలయం ముందు రోడ్డుపై నరికారు.
దున్నను నరికితే రక్తం వచ్చేలా బొమ్మను తీర్చిదిద్దారు. మున్సిపల్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు సుమారు వెయ్యి బైక్‌లతో ర్యాలీ చేశారు. ఏపీ ఎన్‌జీవోలు ఎన్టీఆర్ కూడలిలో వంటావార్పు నిర్వహించారు. ఆటోవాలాలు ర్యాలీ, బధిరుల సంఘం ఆధ్వర్యంలో విభజన పరులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెస్టారెంట్ల అసోసియేషన్ వారు బంద్ పాటించారు. హోటల్ యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షలు చేశారు.
కోర్టు సిబ్బంది విధుల బహిష్కరణ
జిల్లాలో కోర్టుల్లో పనిచేసే సిబ్బంది సోమవారం విధులు బహిష్కరించారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పీలేరు, పుత్తూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. న్యాయవాదులు సంఘీబావం ప్రకటించారు. చిత్తూరులో వైద్యఆరోగ్య శాఖ జేఏసీ ఆధ్వర్యంలో రాల్యీ నిర్వహించారు. తిరుపతి, చిత్తూరులో ఫొటో వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో షాపులు మూసివేసి నిరసన తెలిపారు. చిత్తూరులో పూలమార్కెట్‌లో కేసీఆర్‌కు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. ఐసీడీఎస్ ఉద్యోగులు, అంగన్‌వాడీలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీలేరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ, వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పశు సంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది నిరసన ర్యాలీ చేశారు.
గర్జించిన విద్యార్థులు
శ్రీకాళహస్తిలో సుమారు 10 వేల మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రామకుప్పంలో విద్యార్థుల ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, వీఆర్వో, వీఆర్‌ఏ, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా న్యాయవాదులు పాల్గొన్నారు. నడింపల్లి, చిన్నూరు గ్రామస్తులు సుమారు వెయ్యిమంది జేఏసీ వారికి మద్దతు తెలిపి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ అధికారులు విధులు బహిష్కిరించారు.
గంగవరం మండలంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శన చేశారు. వీకోటలో చికెన్ దుకాణ యజమానులు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మహిళలు పాల్గొన్నారు. మదనపల్లెలో న్యాయ, విద్య, వైద్య, మహిళా, మున్సిపల్ ఉద్యోగులు, సెరికల్చర్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ సంఘాలు, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సుమారు నాలుగు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీవెన్‌ససెల్‌ను అడ్డుకున్నారు. సత్యవేడులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు, ఎన్జీవోలు, విద్యార్థులు, కోర్టు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు.
జాతీయ రహదారుల దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు పలుచోట్ల జాతీయ రహదారులను దిగ్బంధించారు. చంద్రగిరిలో పొలిటికల్ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. కుప్పం వద్ద జాతీయ రహదారులను దిగ్బంధించారు. శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. వాల్మీకి సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు. పుత్తూరులో విద్యుత్‌శాఖ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరిలో ముస్లిం సోదరులు దీక్షలు చేశారు.
ఊరూవాడా సమైక్య సమరం
Published Tue, Aug 20 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement