సమైక్య ఉద్యమమే విరుగుడు! | united movement is needed | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమమే విరుగుడు!

Published Tue, Mar 22 2016 12:24 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

సమైక్య ఉద్యమమే విరుగుడు! - Sakshi

సమైక్య ఉద్యమమే విరుగుడు!

అభిప్రాయం
 
శాసనసభలో రోజాను ఎదుర్కోవడం సాధ్యం కాక అప్రజాస్వామికంగా ఏడాది పాటు బహిష్కరించారు. ఒకవేళ రోజాను ఐదేళ్లూ సభకే రాకుండా మందబలంతో పాలకపక్షం శాసనసభలో తీర్మానం చేయగలిగినా ప్రజాకోర్టులో ఇప్పటికే వారు దోషులుగా నిలబడ్డారు.
 
ఏపీ ముఖ్యమంత్రిలో ఇంతటి అసహనం, ఆందోళన, అభద్రత ఎందుకు గూడు కట్టుకున్నాయి? ఆయన శైలిలో ఆత్మస్థుతి పరనింద అధికమయింది? ‘నేను నిప్పులా బ్రతికాను’ నాతెలివితేటలను చూసి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ‘అమరావతి’ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది’ అని స్వస్థుతికి పాల్పడుతున్నారు. శాసనసభలో తన పార్టీ.. ప్రభుత్వంలో కొనసాగేందుకు తగినంత సంఖ్యాబలం ఉండనే వుంది! చివరకు శాసనసభాపతితో సహా అందరూ చంద్రబాబుకు ‘జీ హుజూర్‌లే’! అయినా ఆయనలో ఎందుకంత చిరాకు, చికాకు చోటు చేసుకుంటున్నాయి? తన అనుయాయులైన ఎం.ఎల్.ఎ.లపై తగిన విశ్యాసం లేదా?

తెలుగుదేశాన్ని ‘జాతీయ పార్టీ’గా మార్చినట్లు ప్రకటించుకుని ముచ్చటగా మూడు నెలలకాకముందే, తెలంగాణాలో టీడీపీలో ముచ్చటగా ముగ్గురు శాసన సభ్యులు మిగిలారు! అందులో ఇద్దరు తన ఓటుకు కోట్లు కుంభకోణంలో ముద్దాయిలు! ఇప్పుదేదో టి.ఆర్.యస్. అధినేత కేసీఆర్‌తో కాస్త సంధి కుదిరింది. కానీ,ఓటుకు నోట్లు కుంభకోణాన్ని కె.సి.ఆర్. అవసరమైనప్పుడు చంద్రబాబుపై ప్రయోగించవచ్చని దాన్ని అలా ఉంచి ఉంటారు. దానితో అది చంద్రబాబుకు మెడపై వేళ్లాడే కత్తిగా ఉంది.
 వీటన్నింటికంటే తన పాలనపై ప్రజలలో నానాటికీ పెరుగుతున్న అవిశ్వాసం, అసంతృప్తి వ్యతిరేకతను గుర్తించలేనంత అమాయకుడు కాడు చంద్రబాబు. 2014లో అధికారం చేపట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అందుకోసం, అమలు చేయడం అసాధ్యమని తెలిసిప్పటికీ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. అవి ఇప్పుడు అనివార్యంగానే వమ్ము అవడంతో ప్రభుత్వం పట్ల భ్రమలు తొలిగిపోయాయి.

రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ప్రతివారికి ఉపాధి, నిరుద్యోగులకు 1000 నుండి 2000వరకు నిరుద్యోగభృతి, ఇలాంటివన్నీ నీటిమీద రాతలవలే, అబద్దాలని జనం గ్రహిస్తున్నారు. వీటికి తోడు ఒక సుడిగాలిలాగా- ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఉద్యమం ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఇదీ చంద్రబాబు ఎన్నికల వాగ్దానం భంగ వల్లనే జరిగింది! ఆపసోపాలుపడి, ఆ ఉద్యమాన్ని తాత్కలికంగా నిరోధించగలిగారు కానీ, చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత. ఆ ఉద్యమ సందర్భంగా జరిగిన విధ్యంసంతో బహిర్గతమైంది. ఒకవైపున కాపులకు బీ.సీలకూ మధ్యవైరుధ్యం సృష్టిస్తూ ‘కులాల కుమ్ములాటలవలన రాష్ట్రం నష్టపోతుంది’ అనీ ‘నా దృష్టిలో రెండే కులాలు. ఉన్నవారు లేనివారు.. రెండేరెండు కులాలు’ అంటూ అపర మార్క్సిస్టు వలే మాట్లాడారు చంద్రబాబు! అవును! తన కులంవారందరికీ తన పరిధిలో చేయగలిగినంత చేసిన తర్వాత ఈ కులవ్యతిరేక రూపమెత్తడం పాలకులకు సహజమే!

పైగా టీడీపీకి చెందిన నేతలు వారి తనయులు తమను ఎవరూ ఏమీ చెయ్యలేరన్న అధికార అహంకారంతో ప్రజలలో అప్రతిష్ట తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక దందాను నివారించే యత్నం చేస్తున్న ఒక ప్రభుత్వాదికారిపై చేయిచేసుకోవడం ‘నిర్భయచట్టం’ క్రింద ముద్దాయిలవడం, కాల్‌మనీ సెక్స్‌రాకె ట్ కుంభకోణం, వీరందరినీ కేసులనుండి తప్పించవలసి రావడం వీటన్నింటి వలన ప్రభుత్వపై ప్రజలలో ఏహ్యభావం ఏర్పడింది.

వీటన్నింటినీ చిన్నవి చేసే పెద్ద కుంభకోణం రాజధాని ప్రాంతంలో తమ పార్టీ వారి భూదందా! ప్రపంచ స్థాయి క్యాపిటల్ అంటూ అమాయక రైతులను, కౌలుదార్లను, దళితులను మోసగించి భూసేక రణ జరిపారు. తన అనుయాయులకు అతి చౌకగా రాజధాని ప్రాంతంలో అయిదారువేల ఎకరాలు కట్టబెట్ట్టి అసలే కోటీశ్వరులైనవారికి శత, సహస్త్ర కోటీశ్వరులను తె.దే. పార్టీ చేసిందన్న వార్త గుస గుసలుగా పాకి  మీడియాకు ప్రధానమైన అంశంగా మారింది. దానితో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ‘ఆ కొన్నారు కొంటే తప్పేంటి? మీ దగ్గర డబ్బుంటే మీరు కొనుక్కోండి’ అని పత్రికా సమావేశంలోనే ఆవేశంతో ఊగిపోయారు. పైగా ఇలాంటిరాతలు రాసినవారిని కూడా అరెస్టు చెయ్యలంటూ బెదిరించారు! విమర్శను తట్టుకొని సరైన సమాధానం యివ్వలేక చంద్రబాబు సంయమనం కోల్పోవడం ఇటీవల కాలంలో ప్రస్పుటంగా కన్పిస్తున్నది! దళితులకు కించపరుస్తూ, మహిళల మనోభావాలకు వ్యతిరేకంగా పనికి మాలిన పాత సామెతలు చెప్పారు.

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలో తను, తన పార్టీ, తన ప్రభుత్వం నానాటికీ ప్రజా వ్యతిరేకంగా మారిందనీ, అందుకే ఇక అన్ని ప్రజాస్వామిక పద్ధతులకూ తిలోదకాలిచ్చి, తిట్లకు, వ్యక్తిగత దాడులకు, దబాయింపులకు టీడీపీ సిద్ధపడిం దని ఇటీవలి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిరూపితమైంది. వైఎస్సార్‌సీపీలో బుగ్గిన రవీంద్రనాథ్, శ్రీకాంత్ రెడ్డి వంటి వారే కాకుండా, ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. గణాంకాలతో సహా సమర్థవంతమైన వాదనద్వారా ప్రభుత్వ వంచనను స్పష్టంగా సమావేశాల్లో బయటపెట్టారు. దీంతో గుక్క తిప్పుకోలేకపోయిన  పాలకపక్షం జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన తండ్రి దివంగతనేత వైఎస్‌పై అసెంబ్లీ అనికూడా మర్చిపోయి తిట్లపురాణం అందుకున్నారు.

మరొక ముఖ్య అంశం ఏదంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు బహిష్కరించడం. ఇది ప్రభుత్వాన్ని పూర్తిగా అప్రదిష్ట పాలు చేసింది. శాసనసభలో రోజాను ఎదుర్కోవడం సాధ్యం కాక, ఆమె అంటేనే భయపడుతున్నవారిలాగా, ఒక్క సంవత్సరం కాదు.. ఈ శాసనసభ పూర్తి కాలంపాటు బహిష్కరించాలని చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అంతగా ప్రభుత్వాన్ని రోజా గడగడలాడించారా అనిపించేవిధంగా స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే లు కలిసి శాసనసభ చరిత్రలోనే ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించారు. నేడు ఏం జరిగినా, ఒకవేళ రోజాను ఐదేళ్లూ శాసనసభకే రాకుండా మందబలంతో పాలకపక్షం శాసనసభలో తీర్మానం చేయగలిగినా ప్రజాకోర్టులో ఇప్పటికే వారు దోషులుగా నిలబడ్డారు.

ఈస్థితిలో చంద్రబాబు పాలనపై అయిదారు నిర్దిష్టమైన డిమాండ్లు ఆధారంగా సమైక్య ప్రజా ఉద్యమం అవసరం. ఇదే ఈ ప్రభుత్వ పతనాన్ని నిర్దేశిస్తుంది.ఇప్పుడు రాష్ట్రంలో వివిధ సమస్యలపై వైఎస్సార్సీపి, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఇతర సామాజిక న్యాయ పోరాట సంఘాలు, పౌర సమాజం ఎవరికి వారుగా పోరాటాలు చేస్తున్నారు. అలా కాకుండా  వీరందరూ, ఏ వేలికి ఆ వేలు వలే కాకుండా పిడికిళ్లు బిగించి ఐక్య పోరాటం నడపాలి. కాంగ్రెస్ సైతం రానున్న ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యాన్ని నిరూపించుకునేందుకు కొంత మేరకైనా కోలుకునేందుకు ఇలాంటి సమైక్య ఉద్యమమే మార్గం కావాలి. వైఎస్సార్సీపీకి అయితే ఈ సమైక్య ఉద్యమం టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉపయోగపడే మరొక మహత్తర ఆయుధం. ఇక కమ్యూనిస్టులు మట్టుకు ముందు తాము ఐక్యమై ఇలాంటి ఉద్యమానికి చొరవ చూపగలగాలి. మార్క్స్ చెప్పినట్లు వారికి పోయేదేమీ లేదు.. ప్రజల్లో వారిపై ఉన్న నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశా నిస్పృహలు తప్ప!
 
- డాక్టర్. ఏపీ విఠల్
వ్యాసకర్త  మార్క్సిస్టు విశ్లేషకులు  98480 69720

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement