సాక్షి, కడప : సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సమైక్య రాష్ట్రాన్ని పరిరక్షించేంతవరకూ పోరు ఆగదని ఉద్యోగులు, వ్యాపారులు, పలు సంఘాల వారు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఉద్యోగ, రాజకీయ వర్గాలు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతల ఆమరణ దీక్షలు ఉద్యమానికి ఊతమయ్యాయి. నానాటికీ ఉద్యమం బలోపేతం అయ్యేందుకు దీక్షలు దోహదం చేస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షను ఆదివారం రాత్రి భగ్నం చేసినప్పటికీ రిమ్స్‌లో దీక్షను కొనసాగించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం పలు దఫాలుగా చర్చలు జరిపి మధ్యాహ్న సమయంలో దీక్షను విరమింపజేశారు. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాష, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సోమవారం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కడప నగర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజు ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేదనాయకం, కలెక్టరేట్ ఏఓ గుణభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయుల జేఏసీ, న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్‌జీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళాజాత బృందం పాటలు సమైక్యవాదులను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జేఏసీ, వైవీయూలో విద్యార్థులు, ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు.
జమ్మలమడుగులో ఎన్జీఓలు, వైద్యుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. గూడెంచెరువు కాలనీ గ్రామస్తులు పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. పాలిటెక్నిక్ ఉద్యోగులు రహదారిని దిగ్బంధనం చేసి జమ్మలమడుగులో రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. చిలంకూరులో ఐసీఎల్ ఆధ్వర్యంలో చెక్కభజనతో భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీలో మహిళా ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సాగుతున్నాయి.
రాయచోటిలో ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ లక్ష్మిప్రసాద్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌బయారెడ్డి నేతృత్వం వహించారు. న్యాయవాదులు, జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సాగుతున్నాయి. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మాజీ ఎంపీపీ జీఎం రఫీ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ సాగింది. గాలివీడు, చిన్నమండెం, వీరబల్లిలో సమైక్య ఉద్యమం జోరుగా సాగింది.
రైల్వేకోడూరులో జేఏసీ ఆద్వర్యంలో ఐకేపీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు సంఘీభావం తెలిపారు. వీరి ఆధ్వర్యంలోనే వంటా వార్పు, ధర్నా చేపట్టడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ నేత వైఎస్ కొండారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే కొరమట్లు శ్రీనివాసులు అమరణ దీక్ష సోమవారంతో ఐదవ రోజు ముగిసింది.
రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి దీక్ష సోమవారంతో ఐదవ రోజు పూర్తయింది. వైద్యులు దీక్ష విరమించాలని సూచించినప్పటికీ ఆయన ససేమిరా అంటూ కొన సాగిస్తున్నారు. వీరబల్లి నుంచి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పాదయాత్రగా వచ్చి ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపారు. ఆకేపాటి దీక్షకు వైఎస్ కొండారెడ్డి తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
బద్వేలులో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. అరవింద విద్యాలయం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో వేలాది మంది విద్యార్థులు పిరమిడ్ ఆకృతిలో ఏర్పడి నిరసన తెలిపారు. లారీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిచి వంటా వార్పు చేపట్టారు.
పులివెందులలో జేఏసీ, ఉలిమెల గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. సరాయపల్లె, చిన్నరంగాపురం గ్రామస్తులు జెఎన్‌టీయూ వద్ద భారీ ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు.
ప్రొద్దుటూరులో ఎన్జీఓలు, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, ఆర్టీసీ, సహకారశాఖ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్‌లో సభ నిర్వహించారు. పట్టణంలోని వైద్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు.
కమలాపురంలో మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ చావిడి నుంచి క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
ఉద్యమమే ఊపిరి
Published Tue, Aug 20 2013 6:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement