
'రెండో రాజధాని అనే ఆలోచన లేదు'
కర్నూలు: రాష్ట్రానికి కర్నూలు రెండో రాజధాని అనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కర్నూలు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హమీల మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలపై కొన్ని పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని యనమల భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకోని... మంత్రిమండలి సమావేశంలో చర్చించి పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని యనమల తెలిపారు.