basanth nagar
-
విమానంలో వేములవాడ, కొండగట్టు వెళ్దామా!
సాక్షి, కరీంనగర్: ఉత్తర తెలంగాణ పర్యాటకం ఇకపై పరుగులు పెట్టనుంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలిపే ఉడాన్ పథకం కింద పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్‌లోని మామూనూరు ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 27న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా బసంత్‌నగర్, మామూనూరు విమానాశ్రయాలను ఉడాన్ 5.0 తుదిజాబితాలో చేర్చింది. ఈ విమానాశ్రయాల సేవలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, మేడారం జాతరలకు దేశంలోని నలుమూలల నుంచి సందర్శకులు ఇక విమానాల్లోనూ రావచ్చు. ఏంటీ ఉడాన్ పథకం! ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, ఢిల్లీతో కలిపేందుకు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టులను ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం 2016 ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మామూనూరు, బసంత్నగర్ల్లో విమాన సేవలు అందుబాటులోకి వస్తే, ఉత్తర తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు పునః ప్రారంభమైతే.. దీనికి 40–50 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న రామగిరి ఖిల్లా, వేములవాడ, రామగుండం, సింగరేణి గనులు, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ వన్యప్రాణి ప్రాంతాలు, నిజామాబాద్‌లోని ప్రాజెక్టుల సందర్శన సులభతరం కానుంది. వాస్తవానికి ఈ రెండు విమానాశ్రయాలు రెండు దశాబ్దాల క్రితం వరకు సేవలందించాయి. మామూనూరు విమానాశ్రయం 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్థానిక ఖాజీపేట పేపర్ పరిశ్రమ, ఆజాంమిల్స్ ఉత్పత్తులను షోలాపూర్‌తోపాటు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు, పారిశ్రామిక కనెక్టివిటీ పెంచే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 1981 వరకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది. 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తన రాకపోకలకు అనువుగా బసంత్‌నగర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే ఇక్కడికి రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబర్‌లో ఈ ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్‌పోర్టుతో 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని తయారు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. -
Peddapalli: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. ఇంతకాలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఉంటుందా? ఉండదా? అన్న ఊహాగానాలకు ఇకపై తెరపడనుంది. తాజాగా ఉడాన్ పథకం 5.0లో భాగంగా రాష్ట్రంలోని రెండు పాత విమానాశ్రయాలను గుర్తించగా.. అందులో మొదటిది వరంగల్ కాగా.. రెండోది బసంత్‌నగర్ విమానాశ్రయం కావడం విశేషం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన పథకం ఉడాన్. ఉడాన్ అంటే ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి బసంత్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులను పరిశీలించాలని రాష్ట్రం విన్నవించింది. అంతేకాకుండా పలుమార్లు ఇక్కడి సాధ్యాసాధ్యాలు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, ఆటంకాలు, అందుబాటులో ఉన్న రన్‌వే తదితరాలపై ప్రైవేటు కన్సెల్టెన్సీ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి పంపారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు, పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంత ప్రజలతోపాటు, ఉమ్మడి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఆవశ్యకత, తదితరాలను సైతం వివరించారు. దేశంలో 54 ఎయిర్‌స్ట్రిప్స్ గుర్తింపు పలుమార్లు రాష్ట్ర వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలిసారిగా ఈ విమానాశ్రయం విషయంలో సుముఖత వ్యక్తం చేసింది. ఉడాన్ పథకంలో భాగంగా దేశం మొత్తం మీద 54 పొటెన్షియల్ ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను గుర్తించింది. అందులో మన రాష్ట్రం నుంచి వరంగల్, బసంత్నగర్లను కూడా భవిష్యత్తులో మనగలిగే సామర్థ్యమున్న ఎయిర్స్ట్రిప్లుగా నోటిఫై చేసింది. అసలు దేశంలోని అటవీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ 54 ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను కేంద్రం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే బసంత్‌నగర్‌ను ‘పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల’ జాబితాలో చోటు కలించింది. అంటే దీని ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిసరాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దేశంలోని నలమూలల నుంచి వచ్చే యాత్రికులకు పరిచయం చేయనుంది. ఈ పరిణామం శుభసూచమకమని, దేశంలోని వివిధ నగరాలతో కనెక్టివిటీ పెంచే క్రమంలో ఇది తొలి అడుగు అవుతుందని ఉమ్మడి జిల్లా ప్రముఖులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పర్యాటకానికి పెద్దపీట..! తాజాగా కేంద్రం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకోవడం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి దోహదపడనుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో అభివృద్ధి చేయనున్న ఈ విమానశ్రయానికి కాళేశ్వరం, ధర్మపురి, రామగిరి ఖిల్లా, కొండగట్టు, వేములవాడతోపాటు పక్కనే ఉన్న గోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని టైగర్ రిజర్వ్, గిరిజన తదితర పర్యాటక ప్రాంతాలను పర్యాటకులకు చేరవవుతాయి. దీంతో యాత్రీకులకు ఆధ్మాత్మిక భావనను పంచడంతోపాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందిన ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఉపాధి లభించనుంది. (క్లిక్: RRRకు భూసేకరణ వేగవంతం) ఇదీ.. చరిత్ర..! 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తాను ఇక్కడికి వచ్చేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏరాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబరులో ఇదే ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్ పోర్టుగా 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా.. తరువాత అవి అటకెక్కాయి. తరువాత 2016లో ఉడాన్ పథకం రావడంతో 2020లో ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) ఈ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాను కూడా చేసిన పలు సాంకేతిక, భౌగోళిక సర్వేలను అధ్యయనం చేసింది. (క్లిక్: ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!) -
కరిగిపోతున్న ప్రకృతి సంపద: అప్పుడలా.. ఇప్పుడిలా!
సాక్షి, కరీనంగర్: ప్రకృతి సంపద కరిగిపోతోంది.. ఆహ్లాదం పంచే గుట్టలు కనుమరుగవుతున్నాయి.. గ్రానైట్, క్రషింగ్ తదితర చర్యలతో అంతరించిపోతోంది. సహజసిద్ధమైన గుట్టలపై ఉన్న చెట్ల సంపద కూడా తరిగిపోతుంది. గుట్టలు తవ్వి అక్రమార్కులు రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. పెద్ద మొత్తంలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. క్వారీలు, క్రషర్ల పేరుతో అలనాటి పచ్చదనం కాస్త కాంట్రాక్టర్లకు పసిడి తనంగా మారిపోతుంది. అక్రమార్కుల చేతిలో కొండలు, గుట్టలు రోజురో జుకూ కరిగిపోతున్నాయి. 2017 లో సగం వరకు ‘సాక్షి’ కెమెరాకు కనిపించిన బసంత్‌నగర్ సమీపంలోని అతిపెద్ద గుట్ట క్రషింగ్‌తో ఆగస్టు 2, 2021 వరకు ఇలా అడుగంటి అంతరించిపోతోంది.. మరో నాలుగేళ్లకు ఇక్కడ గుట్ట ఉండేదట అని చెప్పుకోవాల్సిన వస్తోందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు అనుకుంటున్నారు. క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పర్యావరణానికి తీరని నష్టం వాటిలుతున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు మాత్రం పట్టింపులేకుండా పోతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
మిస్ యూ ‘బాబు సాబ్’
సాక్షి, పాలకుర్తి(కరీంనగర్) : ‘బాబు సాబ్’ బసంత్‌నగర్ పరిసర ప్రాంతంలో ఈ పేరు అంటేనే ఒక గౌరవం. కేశోరాం గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన బసంత్‌కుమార్ బిర్లాను స్థానికంగా అందరూ పిలుచుకునే పేరు బాబు సాబ్. గురువారం అనారోగ్యంతో బాబుసాబ్ మృతి చెందాడన్న విషయం తెలిసి బసంత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను స్థాపించి దేశ వ్యాప్తంగా ఎన్నో వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు బాసటగా నిలిచిన గొప్ప వ్యక్తి బాబుసాబ్. పరిశ్రమను స్థాపించడమే కాకుండా కంపెనీ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు చాలా గ్రామాల్లో వందల సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు. మరో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలవబడే రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్రవేసి ఎంతో మంది పేదల గుండెల్లో దైవంగా కొలువబడ్డ మహోన్నత వ్యక్తి బసంత్‌కుమార్ బిర్లా. అలాంటి వ్యక్తి మరణించడంతో స్థానికంగా తమ కుటుంబసభ్యుల్ని కోల్పోయామనే విధంగా స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో పాటు కర్మాగారం ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న వారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ బాబుసాబ్ను మననం చేసుకుంటున్నారు. గురువారం కేశోరాం సూపర్‌బజార్ గల షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బాబుసాబ్ మృతికి సంతాపం ప్రకటించారు. దీంతో పాటు కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టాఫ్‌కాలనీలోని ఇండియా మిషన్ సెకండరీ పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆయన పేరు మీదనే. ప్రస్తుతం బసంత్నగర్గా పిలవబడుతున్న ప్రాంతం గతంలో ఈసాలతక్కళ్ళపల్లిగా పిలువబడేది. 1969లో స్థానికంగా బసంత్‌కుమార్ బిర్లా కేశోరాం కర్మాగారాన్ని స్థాపించడంతో ఈ ప్రాంతానికి ఆయన పేరును పెట్టి బసంత్నగర్గా మార్చారు. దీంతో పాటు బసంత్‌నగర్‌ను ఆనుకుని కన్నాల గ్రామపంచాయతీలో గల ఓ కాలనీకి తన తండ్రి ఘనశ్యాందాస్ బిర్లా పేరు మీద జీడీనగర్ అని పెట్టారు. ప్రస్తుతం జీడీనగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. దీంతో పాటు పాలకుర్తి గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామి పేర్లలోని అక్షరాలను కలిపి కేశోరాం అని కంపెనీకి పేరు పెట్టాడని, దీని ఆధారంగానే ఆయనకు దేవుడి మీద ఏ స్థాయిలో భక్తి ఉందో చెప్పవచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో బసంత్‌నగర్‌కు.. బసంత్‌కుమార్ బిర్లా ప్రతియేడు బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం పర్యవేక్షణకై ప్రత్యేక విమానంలో వచ్చేవారు. ఇందుకోసం బసంత్‌నగర్ గ్రామ శివారుతో పాటు, పెద్దపల్లి మండలం కురుమపల్లి గ్రామ శివారులోని దాదాపు వంద ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుని విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికొకసారి బిర్లా బాబు బసంత్‌నగర్ కర్మాగారానికి సందర్శించే వారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చేవారు. బసంత్‌నగర్ సందర్శనకు వచ్చినపుడు కర్మాగారంతో పాటు మైన్స్, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన బుగ్గ రామస్వామి ఆలయం, స్టాఫ్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వరాలయం, శివాలయం, కేశోరాం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డెయిరీ ఫాంను సందర్శించి అందులోని గోవులకు పూజలు చేసేవారు. కానీ గత ఏడేళ్లుగా వయోభారంతో పాటు ఆరోగ్యం సహకరించని కారణంగా బీకే బిర్లా బసంత్‌నగర్‌కు రాలేదు. కేశోరాం కర్మాగారం నిర్వహణ బాధ్యతలను కూడా తన మనుమరాలైన మంజుశ్రీకి అప్పగించారు. నేడు సంతాప సభ బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో శుక్రవారం బసంత్‌కుమార్ బిర్లా సంతాప సభ నిర్వహించనున్నారు. ఈమేరకు కంపెనీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కోల్‌కత్తాలో బీకే బిర్లా అంత్యక్రియలు ముగిసిన అనంతరం సంతాపసభ నిర్వహించనున్నారు. -
లోయలోపడ్డ కారు : ఇద్దరు మృతి
పెద్దపల్లి : బసంత్ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
పెద్దపల్లి: వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన షేక్ మహబూబ్(35) బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై అధికారుల కొరడా
13 ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ అధికారులు సహకరించిన స్థానికులు బసంత్‌నగర్ : రామగుండం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మైనింగ్, విజిలెన్స్ అధికారులు కొరడా∙ఝలిపించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 13 ట్రాక్టర్లను శుక్రవారం సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండల పరిధిలోని గోదావరి పరీవాహాక ప్రాంతమైన ముర్మూర్ గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్ల యజమానులు కొంతకాలంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మైనింగ్, విజిలెన్స్ టెక్నికల్ అసిస్టెంట్ పరమేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ ధనుంజయ్, వీఆర్ఏ శంకర్‌తో కూడిన బృందం కుక్కలగూడుర్ ఎస్సీకాలనీ శివారులో ఇసుక లోడుతో వెళుతున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే ఇసుక మాఫియా మాత్రం అధికారులతో వాగ్వాదానికి దిగి ట్రాక్టర్లను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన కుక్కలగూడుర్ గ్రామస్తులు వాహనాలకు అడ్డుకుని అధికారులకు మద్దతుగా నిలవడంతో ఇసుక మాఫియా నివ్వెరపోయింది. స్పందించిన అధికారులు ట్రాక్టర్లను దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారానికి దారి కొనుగోలు గోదావరినది పరివాహాక ప్రాంతాలైన ముర్మూర్, గోలివాడ, అంతర్గాం నుండి మద్దిర్యాల, కుక్కలగూడుర్ మీదుగా ధర్మారం, వెల్గటూర్ మండలాల పరిధిలోని గ్రామాలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కుక్కలగూడుర్ గ్రామ శివారు వరకు చేరుకోవడంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఇసుక రవాణాదారులు బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి గ్రామాల మీదుగా తమ దందాను కొనసాగించారు. అయితే ఇటీవల ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకున్న నేపథ్యంలో ఇసుక మాఫియా తిరిగి పాత రహదారి మార్గాన్నే ఎంచుకుంది. అయితే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఉన్న నేపథ్యంలో సమీపంలోని పంటపొలాల గుండా ప్రత్యామ్నయ రహదారిని ఎంచుకున్నారు. ఇందుకు ఇసుక మాఫియా సదరు భూమి యజమానులకు రూ.50 వేలు చెల్లించినట్లు తెలిసింది. -
‘బంగారుతల్లి’కి బాటలేసిన నరహరి
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంటే గుండెలపై కుంపటిలా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న సమాజం.. ఇవన్నీ చూసి చలించి పోయారాయన. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు పేదవర్గాలు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన ఆ అధికారి.. ప్రభుత్వ పరంగా ఆడబిడ్డల పెళ్లికి ఏ విధంగా సాయపడాలనే తపన పడ్డారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి జీవనస్థితిగతులను అధ్యయనం చేసి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకానికి రూపకల్పన చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలులోకి తేగా, మరో పది రాష్ట్రాలు ఆ పథకాన్ని అనుసరించాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకానికి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకమే ప్రేరణ. ఆ అధికారే పరికిపండ్ల నరహరి. 2001 బ్యాచ్‌కు చెందిన సివిల్ సర్వెంట్. రామగుండం మండలం బసంత్‌నగర్‌కు చెందిన నరహరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సిరిసిల్లలో ఆదివారం ‘పద్మ పీఠం ఆత్మీయ సత్కారం’ అందుకుంటున్నారు. సిరిసిల్ల: బసంత్‌నగర్‌లో టైలర్‌గా పని చేసే పరికిపండ్ల సత్యనారాయణ-సరోజన దంపతుల మూడో సంతానం నరహరి. 1992లో ఐఎంఎస్ఎస్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న నరహరి మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు పొంది కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. హైదరాబాద్ వాసవి కళాశాలలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు. 1998లో అడ్వాన్స్ రీసర్చ్ విభాగంలో సైంటిస్ట్‌గా పని చేస్తూ 1999లో సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినా నిరాశ చెందకుండా ఉద్యో గం చేస్తూనే గంటల తరబడి చదువుతూ సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 2001లో రెండో ప్రయత్నంలో 78 ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002మేలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలిపోస్టింగ్ పొందారు. 2003-04లో గ్వాలియర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా, 2004-05లో ఇండోర్ ఎస్డీవో(రెవెన్యూ), ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌గా 2006లో పనిచేశారు. అనంతరం ఐసీడీఎస్ రాష్ట్ర కమిషనర్ గా 2007 వరకు భోపాల్‌లో విధులు నిర్వహించారు. చింద్వారా జెడ్పీ సీఈవోగా పని చేసిన తర్వాత 2007లో సియోని కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2009-11లో సింగ్రాలి కలెక్టర్‌గా పని చేసిన ఆయన 2011లో గ్వాలియర్ కలెక్టర్‌గా విధుల్లో చేరి కొనసాగుతున్నారు. లాడ్లీ లక్ష్మీయోజనకు శ్రీకారం.. కలెక్టర్‌గా, ఐసీడీఎస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు పేదలు ఆడపిల్లల పెళ్లికి పడుతున్న కష్టాలను చూసి నరహరి చలించిపోయారు. కూతురు పెళ్లి కోసం ఒక కుటుంబం పడే ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన నరహరి పేదవర్గాలకు ప్రభుత్వ సాయం అందించాలనే లక్ష్యంతో లాడ్లీ లక్ష్మీయోజన పథకానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఆయనే రూపొందించారు. ఏడాది పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం మరో పది రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ఆడపిల్లల పెళ్లి కోసం ఆసరా ఉండే మంచి పథకాన్ని మన జిల్లా బిడ్డ రూపొందించడం గర్వకారణం. బంగారుతల్లి పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయడం విశేషం. రాష్ట్రపతి సత్కారం నరహరి పని చేసేచోట తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ గుర్తింపు సాధించారు. ఐఏఎస్ అధికారిగా ఆఫీసులో కూర్చొని ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పర్యటించి అధికార యంత్రాంగాన్ని కదిలించారు. గ్వాలియర్ కలెక్టర్‌గా వికలాంగులకు చేయూతనిచ్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ మన్ననలు పొందారు. పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతలు గుర్తు చేస్తూ యువతరాన్ని భాగస్వాములను చేస్తూ ‘మిగిలి ఉన్న పని’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నరహరి చేపట్టారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ డిసెంబర్ 3న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సులో అవార్డు బహూకరించారు. రాష్ట్రపతి ద్వారా సత్కారం పొందిన నరహరి అంతకుముందే వివిధ హోదాల్లో పని చేస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలోనూ నరహరికి అవార్డు లభించడం విశేషం. రచయితగా.. కలెక్టర్‌గా నిత్యం బిజీగా ఉండే నరహరి పుస్తకాలు చదవడం, క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడడం హాబీలు. లాడ్లీ లక్ష్మీయోజన పథకాన్ని ముప్పై పేజీల డాక్యుమెంటరీ రాసిన ఆయన సాహిత్యకారుడిగా మరో కోణంలో రచనలు చేస్తున్నారు. సమర్థుడి జీవయాత్ర పేరుతో తన ఆత్మకథను ఆవిష్కరిస్తున్నారు. సమర్థ అధికారిగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే కాకుండా రచయితగా నరహరి ముందుకు సాగుతున్నారు. 2002లో శ్రీభగవద్గీతను వివాహమాడిన నరహరికి పాప శ్రీగౌరీఆలయ, బాబు అక్షర్ ఉన్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో రాము, లక్ష్మణ్, మహేశ్, శ్రీనివాస్ నలుగురు రాష్ట్రంలో వివిధ చోట్ల ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. చెల్లెలు శ్రీదేవి హైదరాబాద్‌లో డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. భార్య శ్రీభగవత్గీత గ్వాలియర్లోనే ప్రొఫెసర్. జిల్లాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి చదువులో రాణిస్తూ అత్యున్నత ఐఏఎస్ సాధించి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం జిల్లాకే గర్వకారణం. నేడు సిరిసిల్లలో ఆత్మీయ సత్కారం పద్మపీఠం సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆదివారం నరహరిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. స్థానిక రాజరాజేశ్వర కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో పద్మపీఠం పురస్కారంతో నిర్వాహకులు కొక్కుల భాస్కర్, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఉపసంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ సన్మానిస్తున్నారు. నరహరితో పాటు ప్రముఖ చిత్రకారుడు తెలంగాణ రాజముద్ర సృష్టికర్త ఏలె లక్ష్మణ్, సాహిత్యకారుడు, హైదరాబాద్ స్పెషల్ జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, వస్త్ర పరిశ్రమ విశ్లేషకులు మచ్చ ఆనంద్, మగ్గంపై చిత్రాలు నేసే చేనేతశిల్పి కూరపాటి శ్రీనివాస్, అగ్గిపెట్టెలో చీర, ఉంగరంలో దూరె చీర సృష్టికర్త నల్ల విజయ్‌కుమార్‌లకు ఒకే వేదికపై పురస్కారాలు అందిస్తున్నారు. -
కబ్జాదారులకు మాజీ మంత్రి అండ
పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి బసంత్ నగర్, న్యూస్‌లైన్ : మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అండదండలతోనే జిల్లాలో భూకబ్జాదారుల ఆగడాలు ఎక్కువయ్యాయని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి ఆరోపించారు. కన్నాలలో భూకబ్జా చేశారనే కారణంతో ఆత్మహత్య చేసుకున్న గణపతి ప్రభాకర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పౌరహక్కుల సంఘం నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారుల వైఫల్యంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. ఇందుకు అధికారులతో పాటు స్థానిక ఫోర్‌లైన్ కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. కన్నాల బోడ గుట్టపై అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మృతుడి కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆక్రమణకు గురైన మృతుడి భూమిని పరిశీలించారు. ఆయన వెంట సంఘం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి అక్బర్, కార్యవర్గ సభ్యుడు రాజగోపాల్ ఉన్నారు.