సాక్షి, కరీంనగర్: ఉత్తర తెలంగాణ పర్యాటకం ఇకపై పరుగులు పెట్టనుంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలిపే ఉడాన్ పథకం కింద పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్‌లోని మామూనూరు ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 27న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా బసంత్‌నగర్, మామూనూరు విమానాశ్రయాలను ఉడాన్ 5.0 తుదిజాబితాలో చేర్చింది. ఈ విమానాశ్రయాల సేవలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, మేడారం జాతరలకు దేశంలోని నలుమూలల నుంచి సందర్శకులు ఇక విమానాల్లోనూ రావచ్చు.
ఏంటీ ఉడాన్ పథకం!
ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, ఢిల్లీతో కలిపేందుకు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టులను ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం 2016 ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మామూనూరు, బసంత్‌నగర్‌ల్లో విమాన సేవలు అందుబాటులోకి వస్తే, ఉత్తర తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు పునః ప్రారంభమైతే.. దీనికి 40–50 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న రామగిరి ఖిల్లా, వేములవాడ, రామగుండం, సింగరేణి గనులు, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ వన్యప్రాణి ప్రాంతాలు, నిజామాబాద్‌లోని ప్రాజెక్టుల సందర్శన సులభతరం కానుంది. వాస్తవానికి ఈ రెండు విమానాశ్రయాలు రెండు దశాబ్దాల క్రితం వరకు సేవలందించాయి.
మామూనూరు విమానాశ్రయం 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్థానిక ఖాజీపేట పేపర్ పరిశ్రమ, ఆజాంమిల్స్ ఉత్పత్తులను షోలాపూర్‌తోపాటు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు, పారిశ్రామిక కనెక్టివిటీ పెంచే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 1981 వరకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది.
1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తన రాకపోకలకు అనువుగా బసంత్‌నగర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే ఇక్కడికి రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబర్‌లో ఈ ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్‌పోర్టుతో 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని తయారు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment