Ministry of Civil Aviation
-
మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్లు కావాలి
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. డ్రోన్ టెక్నాలజీ దేశానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు డ్రోన్స్ వినియోగ నిబంధనలను సరళీకృతం చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. డ్రోన్స్ డిమాండ్‌కు తగినట్లు నైపుణ్య శిక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 48 డ్రోన్ శిక్షణ పాఠశాలలకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇంకా ఈ పాఠశాలల అనుమతికోసం పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంది. 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులు డ్రోన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 12 రాష్ట్రాల్లో 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఇప్పటికే అనుమతించింది. ఈ ఐటీఐలు డ్రోన్ సర్వీస్ టెక్నిíÙయన్, డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో సహా ఆరు స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అనుమతించింది. వ్యవసాయరంగంలో ప్రోత్సాహం ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. వ్యవసాయరంగంలో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా స్థానిక యువతకు డ్రోన్స్ వినియోగంలో అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐటీఐల్లో డ్రోన్స్‌పై నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా రాష్ట్రంలో 10 ఐటీఐల్లో డ్రోన్స్ రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణకు అనుమతి మంజూరు చేసింది. మరో పక్క కిసాన్ డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు వ్యక్తిగతంగాను లేదా ఎఫ్‌పీవోకు బ్యాంకులు అవసరమైన రుణాలను మంజూరు చేయాల్సిందిగా నాబార్డు సూచించింది. పది లీటర్ల సామర్థ్యం గల కిసాన్ డ్రోన్ యూనిట్ వ్యయం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలుగా ఖరారు చేసినట్లు నాబార్డు పేర్కొంది. ఆ మేరకు రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులకు నాబార్డు సూచించింది. డ్రోన్ల తయారీకి ప్రోత్సాహం డ్రోన్స్ ప్రాముఖ్యత నేపథ్యంలో దేశంలోనే వాటి తయారీ, విడి భాగాలు తయారీని ప్రోత్సహించడానికి మూడేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 120 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. డ్రోన్లు, విడిభాగాలు తయారీలో దేశం స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచంతో పోటీ పడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
విమానంలో వేములవాడ, కొండగట్టు వెళ్దామా!
సాక్షి, కరీంనగర్: ఉత్తర తెలంగాణ పర్యాటకం ఇకపై పరుగులు పెట్టనుంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలిపే ఉడాన్ పథకం కింద పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్‌లోని మామూనూరు ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 27న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా బసంత్‌నగర్, మామూనూరు విమానాశ్రయాలను ఉడాన్ 5.0 తుదిజాబితాలో చేర్చింది. ఈ విమానాశ్రయాల సేవలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, మేడారం జాతరలకు దేశంలోని నలుమూలల నుంచి సందర్శకులు ఇక విమానాల్లోనూ రావచ్చు. ఏంటీ ఉడాన్ పథకం! ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, ఢిల్లీతో కలిపేందుకు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టులను ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం 2016 ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మామూనూరు, బసంత్నగర్ల్లో విమాన సేవలు అందుబాటులోకి వస్తే, ఉత్తర తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు పునః ప్రారంభమైతే.. దీనికి 40–50 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న రామగిరి ఖిల్లా, వేములవాడ, రామగుండం, సింగరేణి గనులు, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ వన్యప్రాణి ప్రాంతాలు, నిజామాబాద్‌లోని ప్రాజెక్టుల సందర్శన సులభతరం కానుంది. వాస్తవానికి ఈ రెండు విమానాశ్రయాలు రెండు దశాబ్దాల క్రితం వరకు సేవలందించాయి. మామూనూరు విమానాశ్రయం 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్థానిక ఖాజీపేట పేపర్ పరిశ్రమ, ఆజాంమిల్స్ ఉత్పత్తులను షోలాపూర్‌తోపాటు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు, పారిశ్రామిక కనెక్టివిటీ పెంచే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 1981 వరకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది. 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తన రాకపోకలకు అనువుగా బసంత్‌నగర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే ఇక్కడికి రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబర్‌లో ఈ ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్‌పోర్టుతో 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని తయారు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. -
విమానయాన శాఖ ‘టైమింగ్ అదిరింది’..నవ్వులు పూయిస్తున్న రిప్లయ్!
యాపిల్ ప్రొడక్ట్ ధరలు భారీగా ఉన్నాయి. వాటి సంగతేందో చూడండి అంటూ ఓ యువకుడు కేంద్ర విమానయాన శాఖకు ట్వీట్లో విజ్ఞప్తి చేశాడు. ఆ ట్వీట్‌పై చమత్కారంగా..చాలా స్పాంటేనియస్‌గా స్పందించడం నెటిజన్లను తెగ నవ్వులు పూయిస్తుంది. అంకుర్ శర్మ అనే ట్విట్టర్ యూజర్ అమెజాన్ అన్ ఫెయిర్ బిజినెస్ చేస్తోంది. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినియోగదారు వ్యవహారాల శాఖ శాఖకు కాకుండా కేంద్ర విమానయాన సంస్థకు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అమెజాన్ పేజ్‌లో ఐపాడ్ ప్రో ప్రొడక్ట్ ప్రారంభ ధర రూ.1,76,900 ఉండగా ధరను భారీగా తగ్గిస్తూ రూ.67,390కే అందిస్తున్నట్లు పేర్కొందని తెలుపుతున్నట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. ‘‘నెటిజన్ అంకుర్ శర్మ..ఆ ధరని, డిస్కౌంట్‌ను హైలెట్ చేస్తూ యాపిల్ ఐపాడ్ ప్రో రీటైల్ ధర రూ.1,76,900గా ఉంది. అదే ప్రొడక్ట్‌పై 62శాతం డిస్కౌంట్ ఇస్తుందంట అమెజాన్. సాధ్యం కాదు. అంత తక్కువ ధరకే ఐఫాడ్ రాదు’’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. అంతేకాదు ఆ ట్వీట్‌ను జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు. అంతే ఆ ట్యాగ్‌పై విమానాయన శాఖ స్పాంటేనియస్‌గా రిప్లయి ఇచ్చింది. ‘‘తక్కువ ధరకే అందించాలని మాకు ఉంది. కానీ మేం ప్రయాణికులు అఫార్డబుల్ ప్రైస్‌కే ఇండియాకు వచ్చేలా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో బిజీగా ఉన్నాం’’ అని బదులిచ్చింది. We intend to help, but we are busy providing affordable air travel to India.#SabUdenSabJuden https://t.co/ogDImlINJe — MoCA_GoI (@MoCA_GoI) September 14, 2022 అదే ట్వీట్‌ను 8 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేయగా..700 మంది రీట్వీట్ చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హ్యూమరస్‌గా చేసిన ట్వీట్‌పై అమెజాన్ స్పందించింది. అంకుర్ శర్మ మీరు చేసిన ట్వీట్‌ను పరిగణలోకి తీసుకున్నాం. సంబంధిత విభాగానికి చెందిన ప్రతినిధులతో మాట్లాడుతున్నాం అని రిప్లయి ఇచ్చింది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
విమానయానం, టెలికం ప్రాజెక్టుల పూర్తి అవశ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికం శాఖ (డీఓటీ)ల్లో మూలధన వ్యయాల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వశాఖలను కోరారు. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ట్వీట్ ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మూలధన వ్యయ పురోగతి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై ఆర్థికమంత్రి సమీక్ష జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మూలధన కేటాయింపులను గణనీయంగా పెంచారు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగదల 34.5 శాతంగా ఉంది. విలువలో రూ.5.54 లక్షల కోట్లకు చేరింది. ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్ సేవల విస్తరణ వేగవంతం కావాలని కూడా టెలికంశాఖకు ఆర్థికమంత్రి సూచించారు. మానిటైజేషన్ ప్రణాళికపైనా సమీక్ష... సమావేశంలో ఆర్థికమంత్రి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ)కు సంబంధించిన ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలను సమీక్షించినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎంఎన్‌పీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయాలన్నది ఈ ప్రణాళిక ఉద్దేశం. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని కేంద్రం పేర్కొంది. -
2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆటో, డ్రోన్ రంగాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌పై సింధియా గురువారం మాట్లాడారు. డ్రోన్లను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశంగా భారతదేశం ఉండాలని తాము కోరుకుంటున్నామని వివరించారు. 2030 నాటికి భారత్ ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. డ్రోన్ల తయారీ రంగానికి రాబోయే మూడేళ్లలో సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. పీఎల్ఐ కారణంగా డ్రోన్ తయారీ రంగంలో ప్రత్యక్షంగా దాదాపు 10,000 మందికి, పరోక్షంగా డ్రోన్ సంబంధిత అన్ని రంగాల్లో కలిపి సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు డ్రోన్ రంగానికి చేయూతనిచ్చే ఈ నిర్ణయ పరోక్ష ప్రభావం దేశంలో డ్రోన్ సేవలపై కూడా ఉంటుందని సింధియా అన్నారు. దీంతో రాబోయే మూడేళ్లలో మొత్తం డ్రోన్ సేవల టర్నోవర్ దాదాపు రూ.3 0వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రోత్సాహక పథకం కవరేజీని విస్తృతం చేసేందుకు.. డ్రోన్ సంబంధిత ఐటి ఉత్పత్తుల డెవలపర్లను చేర్చడానికి ప్రభుత్వం అంగీకరించిందని కేంద్రమంత్రి వివరించారు. అంతేగాక ఎస్ఎస్ఎంఈ, స్టార్టప్‌లు పీఎల్ఐ పథకంలో భాగం అయ్యేందుకు డ్రోన్ల తయారీదారులకు రూ.2 కోట్లు, డ్రోన్ల విడిభాగాలు తయారుచేసే సంస్థలకు రూ. 50 లక్షలుగా వాటి వార్షిక టర్నోవర్‌ను అర్హతగా నిర్ధారించారు. దీనివల్ల లబి్ధదారుల సంఖ్య పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పీఎల్ఐ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలలో రూ.120 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వబోతున్నామని తెలిపారు. వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, ఎమర్జెన్సీ రెస్పాన్స్, రవాణా, జియో మ్యాపింగ్, రక్షణ వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం జరుగుతున్నందున ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు డ్రోన్లు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని సింధియా వ్యాఖ్యానించారు. డ్రోన్ల వినియోగం కారణంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకృత డ్రోన్ పాలసీని ప్రకటించిందని, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగానే డ్రోన్ రంగానికి కేంద్రప్రభుత్వం 21 రోజుల్లోనే పీఎల్‌ఐను ప్రకటించిందని సింధియా వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్రోన్ రంగానికి భారత్ నేతృత్వం వహించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఆవిష్కరణ, సమాచార సాంకేతికత, ఇంజనీరింగ్, భారీ దేశీయ డిమాండ్ కారణంగా 2030 నాటికి భారతదేశం ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించారు. -
విమానాలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
ప్రయాణీకులకు షాక్: విమాన ఛార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విమానయాన ధరలు జూన్ 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. సంస్థలు తమ ఛార్జీల పట్టికలో మార్పులు చేస్తున్నాయి. విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరుగుతున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు ఉండనుంది. 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు పెరగనుంది. కరోనా రెండో దశ విజృంభణతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్.. ఈ ఏడాది మార్చి నుంచి విమానయాన సేవలు అంతంత మాత్రమే కొనసాగాయి. అంతర్జాతీయంగా కూడా ప్రతికూల వాతావరణం ఉండడంతో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఛార్జీల పెంపు ఇలా.. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు 40 నిమిషాల ప్రయాణం: రూ.2,600కు పెంపు..అత్యధిక ధర రూ.7,800 60 నిమిషాల ప్రయాణం: రూ.3,300కు పెంపు... అత్యధిక ధర రూ.9,800 -
సురేశ్ ప్రభుకు విమానయాన శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
‘నిషేధ’యానం!
ఇష్టానుసారం ప్రవర్తించే విమాన ప్రయాణికులపై ఆంక్షల కొరడా ఝళిపిస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెలువరించిన మార్గదర్శకాలుస్వాగ తించదగ్గవి. గతం సంగతేమోగానీ... వీఐపీలుగా వెలిగిపోతున్న నేతలు కొందరు ఈమధ్య కాలంలో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వైమానిక సిబ్బందితో దురుసుగా మాట్లాడటం, తోటి ప్రయాణికులను సైతం భయభ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మారింది. సాధారణ ప్రయాణికుల ప్రవర్తన సరిగా లేదనుకున్న ప్పుడు కఠినంగా వ్యవహరించడానికి వెనకాడని సిబ్బంది ఈ ‘ధూర్త వీఐపీ’ల విషయంలో నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడా నికి తాత్కాలికంగా వారు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నా చివరకు సర్దుకు పోవాల్సి వస్తున్నది. అవమానాల్ని దిగమింగాల్సి వస్తున్నది. ఇప్పుడు రూపొందిం చిన మార్గదర్శకాలైనా వైమానిక సిబ్బందిని ఆ దుస్థితినుంచి తప్పించగలవని ఆశించాలి. ఎలాంటి ప్రవర్తన దుష్ప్రవర్తనగా పరిగణిస్తారో...అందులో రకా లెన్నో... అమలు చేసే చర్యలేమిటో ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. మాట లతో దూషించడం, వేధించడం, మద్యం సేవించి ఇబ్బందికరంగా ప్రవర్తించడం లాంటివి మొదటి రకం దుష్ప్రవర్తన కిందికొస్తాయి. ఇందుకు మూడు నెలలపాటు ఆ వ్యక్తి ఎయిరిండియాలో ప్రయాణించకుండా నిషేధం విధిస్తారు. రెండోది భౌతిక దాడి. కొట్టడం, నెట్టేయడం, అసభ్యంగా ప్రవర్తించడంలాంటివి ఇందులోకొస్తాయి. ఈ జాబితాలోనివారిపై ఆర్నెల్ల నిషేధం ఉంటుంది. చంపేస్తాననడం, లైంగిక వేధిం పులకు పాల్పడటం వంటివి మూడో రకం. ఇందుకు రెండేళ్లు మొదలుకొని జీవిత కాల నిషేధం వరకూ అమలు చేస్తారు. ఒకసారి నిషేధం తొలగాక తిరిగి అదే తప్పు చేస్తే అంతక్రితం విధించిన నిషేధాన్ని రెట్టింపు చేస్తారు. ఆరోపణలొచ్చిన ప్రయా ణికుడు 60 రోజుల్లోగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్పిలేట్ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఆ నిర్ణయం సంతృప్తికరంగా లేదనుకుంటే హైకోర్టును ఆశ్ర యించే అవకాశం ఉంటుంది. దురుసు ప్రయాణికులపై ఫిర్యాదు ఇచ్చే అధికారం పైలట్‌కు ఇచ్చారు. ఫిర్యాదుపై 30 రోజుల్లో సంస్థ అంతర్గత కమిటీ విచారణ జరుపుతుంది. ఆ కమిటీలో రిటైరైన జిల్లా జడ్జీ, విమానయాన సంస్థ, ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు ఉంటారు. గడువులోగా విచారణ పూర్తికాకపోతే ప్రయా ణికుడు యథాతథంగా ఆ సంస్థ విమానాల్లో రాకపోకలు సాగించవచ్చు. ఇందులో కీలకమైనదేమంటే... దురుసు ప్రయాణికుడిపై ఇలాంటి నిషేధాలతోపాటు క్రిమి నల్ కేసు కూడా ఉంటుంది. అయితే ఇదంతా ఎయిరిండియాకు మాత్రమే పరి మితం. నిషేధిత ప్రయాణికుల జాబితాను నిర్వహించేది పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విభాగమే అయినా మిగిలిన సంస్థలు దీన్ని పాటించాలన్న నిబం ధన లేదు. అయితే నిబంధనలంటూ రాసుకున్నాక వాటిని పాటించే సంస్కృతి పెంపొం దాలి. అందరికీ సమంగా వర్తించేలా చూడాలి. దుర్వినియోగానికి తావుండ కూడదు. ఇటీవలికాలంలో ప్రచారంలోకొచ్చిన వేర్వేరు ఉదంతాల్లో చివరకు కోపంతో బుసలుకొట్టి ఇష్టానుసారం ప్రవర్తించిన నేతలదే పైచేయి అయింది. మొన్న మార్చిలో ఎయిరిండియా ఉద్యోగిపై విమానంలో దౌర్జన్యం చేసి, దూషిం చిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియాతోపాటు ఇతర సంస్థలు కూడా నిషేధం విధించాయి. తీరా ఆ కేసు ఒక కొలిక్కి రాకుండానే మధ్యలో ఆ నిషేధాన్ని తొలగించారు. తాను ఆ ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టానని కెమెరాల ముందు గైక్వాడ్ గర్వంగా చెప్పుకున్నారు. లోక్‌సభలో ఆయనకు మద్ద తుగా ఆ పార్టీ ఎంపీలు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఎయిరిండియాపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేసేంతవరకూ వెళ్లారు. తెలుగు దేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి చిందులు తొక్కిన ఘటనలో సైతం అంతా సద్దుమ ణిగిపోయింది. చిత్రంగా తిరుపతి విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్‌రెడ్డి వైమానిక సిబ్బందిపై దౌర్జన్యం చేశారంటూ అభాండం మోపి ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేశారు. సిబ్బందిపై ఆయన దౌర్జన్యం చేసిన దాఖలా లేదు. అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా లభించలేదు. అయినా ఇదంతా సాగిపోయింది. తమ పార్టీవారో, తమ కూట మిలోని పార్టీవారో అయితే ఒకలా... ప్రతిపక్షానికి చెందిన వారైతే మరోలా ప్రవర్తిం చేచోట ఇలాంటి మార్గదర్శకాలు ఎంతవరకూ అమల్లోకొస్తాయన్నది అనుమానమే. తనపై నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయిం చినప్పుడు ధర్మాసనం అడిగిన ప్రశ్న గమనించదగ్గది. ఇలాంటి దౌర్జన్యమే మీ బస్సుల్లో ఎవరైనా చేస్తే మీరేం చేస్తారని న్యాయమూర్తి నిలదీశారు. అది బస్సు కావొచ్చు... రైలు కావొచ్చు... విమానం కావొచ్చు. సిబ్బందితో, తోటి ప్రయా ణికులతో దురుసుగా ప్రవర్తించేవారివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. విమా నాల్లో అయితే అది ప్రమాదాలకు కూడా దారితీయొచ్చు. అందువల్ల నిషేధం విధించడం తప్పనిసరి. అమెరికాలో 2001 సెప్టెంబర్‌లో ఉగ్రవాదులు జంట టవర్లను విమానాలతో కూల్చేసి పెను విధ్వంసం సృష్టించాక అనుమానితుల జాబితా రూపొందించి అలాంటివారిపై నిషే«ధం విధించారు. ఆ తర్వాత మరికొన్ని దేశాలు సైతం ఆ పని చేశాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలతో ఒక ప్రమాదం ఉంది. ధూర్త వీఐపీల వల్ల సమస్యలెదుర్కొనే విమానయాన సిబ్బంది సాధారణ ప్రయాణికుల విషయంలో లెక్కలేనట్టు ప్రవర్తిస్తారు. దీన్ని నిలదీసే ప్రయాణికులపై ఇకనుంచి అకారణంగా చర్యలకు ఉపక్రమిస్తే వారికి దిక్కెవరు? ప్రయాణికులతో మర్యాదగా మెలిగే సంస్కృతిని సిబ్బందిలో పెంపొం దించడంతోపాటు అరుదైన సందర్భాల్లో మాత్రమే మార్గదర్శకాలు అమలయ్యేలా చూడకపోతే అవి దుర్వినియోగం కావడానికి ఎంతో కాలం పట్టదు. పౌర విమా నయాన మంత్రిత్వశాఖ దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన కట్టుదిట్టాలు చేయడం అవసరం. -
విమానాశ్రయాల అనుమతిపై రేపు ఢిల్లీలో భేటీ
హైదరాబాద్: విమానాశ్రయాల అనుమతులపై పౌర విమానయాన మంత్రిత్వశాఖ సోమవారం ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర మౌలిక వసతుల కల్పనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ఈ సమావేశానికి హాజరవుతారు. భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనుమతులు మంజూరైన తర్వాత విమానాశ్రయాల పనులను వేగంతం చేస్తామని అజయ్‌జైన్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారని, కొత్త ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారని ఆయన తెలిపారు.