‘నిషేధ’యానం!
ఇష్టానుసారం ప్రవర్తించే విమాన ప్రయాణికులపై ఆంక్షల కొరడా ఝళిపిస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెలువరించిన మార్గదర్శకాలుస్వాగ తించదగ్గవి. గతం సంగతేమోగానీ... వీఐపీలుగా వెలిగిపోతున్న నేతలు కొందరు ఈమధ్య కాలంలో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వైమానిక సిబ్బందితో దురుసుగా మాట్లాడటం, తోటి ప్రయాణికులను సైతం భయభ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మారింది.
సాధారణ ప్రయాణికుల ప్రవర్తన సరిగా లేదనుకున్న ప్పుడు కఠినంగా వ్యవహరించడానికి వెనకాడని సిబ్బంది ఈ ‘ధూర్త వీఐపీ’ల విషయంలో నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడా నికి తాత్కాలికంగా వారు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నా చివరకు సర్దుకు పోవాల్సి వస్తున్నది. అవమానాల్ని దిగమింగాల్సి వస్తున్నది. ఇప్పుడు రూపొందిం చిన మార్గదర్శకాలైనా వైమానిక సిబ్బందిని ఆ దుస్థితినుంచి తప్పించగలవని ఆశించాలి. ఎలాంటి ప్రవర్తన దుష్ప్రవర్తనగా పరిగణిస్తారో...అందులో రకా లెన్నో... అమలు చేసే చర్యలేమిటో ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
మాట లతో దూషించడం, వేధించడం, మద్యం సేవించి ఇబ్బందికరంగా ప్రవర్తించడం లాంటివి మొదటి రకం దుష్ప్రవర్తన కిందికొస్తాయి. ఇందుకు మూడు నెలలపాటు ఆ వ్యక్తి ఎయిరిండియాలో ప్రయాణించకుండా నిషేధం విధిస్తారు. రెండోది భౌతిక దాడి. కొట్టడం, నెట్టేయడం, అసభ్యంగా ప్రవర్తించడంలాంటివి ఇందులోకొస్తాయి. ఈ జాబితాలోనివారిపై ఆర్నెల్ల నిషేధం ఉంటుంది. చంపేస్తాననడం, లైంగిక వేధిం పులకు పాల్పడటం వంటివి మూడో రకం. ఇందుకు రెండేళ్లు మొదలుకొని జీవిత కాల నిషేధం వరకూ అమలు చేస్తారు. ఒకసారి నిషేధం తొలగాక తిరిగి అదే తప్పు చేస్తే అంతక్రితం విధించిన నిషేధాన్ని రెట్టింపు చేస్తారు.
ఆరోపణలొచ్చిన ప్రయా ణికుడు 60 రోజుల్లోగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్పిలేట్ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఆ నిర్ణయం సంతృప్తికరంగా లేదనుకుంటే హైకోర్టును ఆశ్ర యించే అవకాశం ఉంటుంది. దురుసు ప్రయాణికులపై ఫిర్యాదు ఇచ్చే అధికారం పైలట్‌కు ఇచ్చారు. ఫిర్యాదుపై 30 రోజుల్లో సంస్థ అంతర్గత కమిటీ విచారణ జరుపుతుంది. ఆ కమిటీలో రిటైరైన జిల్లా జడ్జీ, విమానయాన సంస్థ, ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు ఉంటారు. గడువులోగా విచారణ పూర్తికాకపోతే ప్రయా ణికుడు యథాతథంగా ఆ సంస్థ విమానాల్లో రాకపోకలు సాగించవచ్చు. ఇందులో కీలకమైనదేమంటే... దురుసు ప్రయాణికుడిపై ఇలాంటి నిషేధాలతోపాటు క్రిమి నల్ కేసు కూడా ఉంటుంది. అయితే ఇదంతా ఎయిరిండియాకు మాత్రమే పరి మితం. నిషేధిత ప్రయాణికుల జాబితాను నిర్వహించేది పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విభాగమే అయినా మిగిలిన సంస్థలు దీన్ని పాటించాలన్న నిబం ధన లేదు.
అయితే నిబంధనలంటూ రాసుకున్నాక వాటిని పాటించే సంస్కృతి పెంపొం దాలి. అందరికీ సమంగా వర్తించేలా చూడాలి. దుర్వినియోగానికి తావుండ కూడదు. ఇటీవలికాలంలో ప్రచారంలోకొచ్చిన వేర్వేరు ఉదంతాల్లో చివరకు కోపంతో బుసలుకొట్టి ఇష్టానుసారం ప్రవర్తించిన నేతలదే పైచేయి అయింది. మొన్న మార్చిలో ఎయిరిండియా ఉద్యోగిపై విమానంలో దౌర్జన్యం చేసి, దూషిం చిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియాతోపాటు ఇతర సంస్థలు కూడా నిషేధం విధించాయి.
తీరా ఆ కేసు ఒక కొలిక్కి రాకుండానే మధ్యలో ఆ నిషేధాన్ని తొలగించారు. తాను ఆ ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టానని కెమెరాల ముందు గైక్వాడ్ గర్వంగా చెప్పుకున్నారు. లోక్‌సభలో ఆయనకు మద్ద తుగా ఆ పార్టీ ఎంపీలు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఎయిరిండియాపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేసేంతవరకూ వెళ్లారు. తెలుగు దేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి చిందులు తొక్కిన ఘటనలో సైతం అంతా సద్దుమ ణిగిపోయింది. చిత్రంగా తిరుపతి విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్‌రెడ్డి వైమానిక సిబ్బందిపై దౌర్జన్యం చేశారంటూ అభాండం మోపి ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేశారు. సిబ్బందిపై ఆయన దౌర్జన్యం చేసిన దాఖలా లేదు. అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా లభించలేదు. అయినా ఇదంతా సాగిపోయింది. తమ పార్టీవారో, తమ కూట మిలోని పార్టీవారో అయితే ఒకలా... ప్రతిపక్షానికి చెందిన వారైతే మరోలా ప్రవర్తిం చేచోట ఇలాంటి మార్గదర్శకాలు ఎంతవరకూ అమల్లోకొస్తాయన్నది అనుమానమే.
తనపై నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయిం చినప్పుడు ధర్మాసనం అడిగిన ప్రశ్న గమనించదగ్గది. ఇలాంటి దౌర్జన్యమే మీ బస్సుల్లో ఎవరైనా చేస్తే మీరేం చేస్తారని న్యాయమూర్తి నిలదీశారు. అది బస్సు కావొచ్చు... రైలు కావొచ్చు... విమానం కావొచ్చు. సిబ్బందితో, తోటి ప్రయా ణికులతో దురుసుగా ప్రవర్తించేవారివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. విమా నాల్లో అయితే అది ప్రమాదాలకు కూడా దారితీయొచ్చు. అందువల్ల నిషేధం విధించడం తప్పనిసరి. అమెరికాలో 2001 సెప్టెంబర్‌లో ఉగ్రవాదులు జంట టవర్లను విమానాలతో కూల్చేసి పెను విధ్వంసం సృష్టించాక అనుమానితుల జాబితా రూపొందించి అలాంటివారిపై నిషే«ధం విధించారు.
ఆ తర్వాత మరికొన్ని దేశాలు సైతం ఆ పని చేశాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలతో ఒక ప్రమాదం ఉంది. ధూర్త వీఐపీల వల్ల సమస్యలెదుర్కొనే విమానయాన సిబ్బంది సాధారణ ప్రయాణికుల విషయంలో లెక్కలేనట్టు ప్రవర్తిస్తారు. దీన్ని నిలదీసే ప్రయాణికులపై ఇకనుంచి అకారణంగా చర్యలకు ఉపక్రమిస్తే వారికి దిక్కెవరు? ప్రయాణికులతో మర్యాదగా మెలిగే సంస్కృతిని సిబ్బందిలో పెంపొం దించడంతోపాటు అరుదైన సందర్భాల్లో మాత్రమే మార్గదర్శకాలు అమలయ్యేలా చూడకపోతే అవి దుర్వినియోగం కావడానికి ఎంతో కాలం పట్టదు. పౌర విమా నయాన మంత్రిత్వశాఖ దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన కట్టుదిట్టాలు చేయడం అవసరం.