ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మేక్‌మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.
పార్ట్ పేమెంట్ ఆప్షన్‌ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్‌లను సవరించుకోవచ్చని మేక్‌మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.
కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు.
ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్‌లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్‌లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.
ఇలా పని చేస్తుందంటే..
కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్‌లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్‌లను సవరించవచ్చు.
ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్‌లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్‌మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment