దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డులు విస్తృతంగా పెరిగిపోయాయి. వీటికితోడు అనుకూలమైన, సురక్షితమైన చెల్లింపు ఎంపికగా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఉద్భవించాయి. సాంప్రదాయ భౌతిక క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా చోరీకి గురవ్వడం, పోగొట్టుకోవడం వంటి సమస్యలు వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లతో ఉండవు.
ఏమిటీ వర్చువల్ క్రెడిట్ కార్డ్?
వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది భౌతిక క్రెడిట్ కార్డుకు డిజిటల్ రూపం. 16-అంకెల కార్డ్ నంబర్, సీవీవీ (CVV), గడువు తేదీతో సహా భౌతిక కార్డుకు ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలూ దీనికీ ఉంటాయి. సాధారణంగా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక కార్డ్. ఇది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌కి యాడ్-ఆన్‌గా పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో లావాదేవీలను అనుమతిస్తుంది.
ఎలా పని చేస్తుంది?
వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. అయితే మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడు, వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ఉపయోగించండిలా..
» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం సూటిగా ఉంటుంది. ఫిజికల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.
» మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
» వర్చువల్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.
» మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీని నమోదు చేయండి.
» తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్‌కు ఓటీపీ వస్తుతంది. ఇది కొన్ని నిమిషాలే చెల్లుబాటు అవుతుంది.
» ఓటీపీని ఎంటర్ చేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేయండి.
వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు
» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను మీ ఫోన్ లేదా ఆన్‌లైన్ ఖాతాల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. భౌతిక కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.
» భౌతిక కార్డ్‌ని కోల్పోయే ప్రమాదం ఉండదు. మోసపూరిత లావాదేవీల నుండి వినియోగదారులను రక్షించడానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అంతర్నిర్మిత డిజిటల్ మోస నివారణ సాధనాలను కూడా అందిస్తాయి.
» వర్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం ఖర్చు పరిమితులు, గడువు తేదీలను సెట్ చేయవచ్చు. ఇది మెరుగైన ఆర్థిక నిర్వహణకు అధిక వ్యయం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వర్చువల్ క్రెడిట్ కార్డ్ పరిమితులు
» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను ప్రధానంగా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం రూపొందించారు. భౌతిక కార్డ్‌ల వంటి ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వీటిని ఉపయోగించలేరు.
» ఆన్‌లైన్ రిటైలర్‌లందరూ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించరు. దీంతో ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఇబ్బంది కలుగుతుంది.
» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా తాత్కాలిక చెల్లుబాటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 24 నుండి 48 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది జారీ చేసే సంస్థను బట్టి మారవచ్చు.
టాప్ ఫ్రీ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఇవే..
దేశంలో వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) అందిస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే కొన్ని టాప్ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌సేఫ్ వర్చువల్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఫ్రీఛార్జ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) నెట్ కార్డ్ (Netc@rd), హెచ్‌ఎస్‌బీసీ (HSBC) బ్యాంక్ అడ్వాంటేజ్ వర్చువల్ కార్డ్, ఎస్‌బీఐ (SBI) కార్పొరేట్ వర్చువల్ కార్డ్ పేరుతో వర్చువల్ కార్డులు అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment