MakeMyTrip Platform
-
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్‌లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్‌లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్‌లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
ఈ యాప్‌లలో ట్రైన్ టికెట్ బుక్ చేస్తే.. కన్ఫర్మ్ అవ్వాల్సిందే!
మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే.. భారతీయ రైల్వే అత్యంత చౌకైన.. ఉత్తమ మార్గం. రోజూ లక్షలమంది రైలు ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే మనం కొన్ని సార్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు.. ముందుగానే బుక్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉంటుంది. గతంలో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలంటే.. తప్పకుండా రైల్వే స్టేషన్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఇంట్లో కూర్చునే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఉత్తమైన యాప్స్ గురించి తెలుసుకుందాం.ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect)ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్.. అనేది ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ వంటివి చేసుకోవచ్చు, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నెంబర్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.ఐఆర్సీటీసీ యూటీఎస్ (IRCTC UTS)ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ టికెట్స్, మంత్లీ సీజనల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రైన్లలో ప్రయాణించేవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కన్ఫర్మ్ టికెట్ (Confirmtkt)ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ 'కన్ఫర్మ్ టికెట్' యాప్ ఓ మంచి ఎంపిక. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, చెల్లింపులు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఇందులో తత్కాల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.ఇక్సిగో (Ixigo)ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్స్ మాత్రమే కాకుండా.. విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ ట్రాకింగ్, లైవ్ అప్డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ట్రైన్ రియల్ స్టేటస్ తీసుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిమేక్మైట్రిప్ (Makemytrip)ప్రస్తుతం మేక్మైట్రిప్ అనేది చాలా పాపులర్ యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉండటం వల్ల.. కన్ఫర్మ్గా టికెట్ బుక్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ అయితే మీ డబ్బుతో పాటు.. ఇతర ఉపయోగకరం కూపన్లు వంటివి కూడా లభిస్తాయి. ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ యాప్ అనే చెప్పాలి. -
మనోళ్లు విదేశాలను చుట్టేస్తున్నారు..!
న్యూఢిల్లీ: సానుకూల స్థూలఆర్థిక పరిస్థితుల దన్నుతో విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా రెండుసార్లు లేదా అంతకు మించి పర్యటిస్తున్న వారి సంఖ్య 32 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రయాణాలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్‌లు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. 2023 జూన్ నుంచి 2024 మే మధ్య కాలానికి సంబంధించి ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫాం మేక్మైట్రిప్ రూపొందించిన ’హౌ ఇండియా ట్రావెల్స్ ఎబ్రాడ్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం విదేశాలకు వెళ్లే భారతీయులకు యూఏఈ, థాయ్‌లాండ్, అమెరికా టాప్ గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే కజకిస్తాన్, అజర్బైజాన్, భూటాన్‌లపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ‘చేతిలో కొంత మిగిలే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ సంస్కృతుల గురించి మరింతగా తెలుస్తుండటం, ప్రయాణాలు సులభతరం కావడం తదితర అంశాల కారణంగా విహారయాత్రలు లేదా వ్యాపార అవసరాల రీత్యా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా పర్యాటకం ప్రోత్సాహకరంగానే ఉండగా మా తాజా విశ్లేషణ ప్రకారం స్థూలఆర్థిక అంశాల ఊతంతో భారతీయుల్లో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ధోరణులు గణనీయంగా పెరుగుతున్నాయి‘ అని మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ మెగో తెలిపారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ⇒ టాప్ 10 వర్ధమాన గమ్యస్థానాలకు సంబంధించి సెర్చ్ చేయడం 70 శాతం పెరిగింది. అజర్‌బైజాన్‌లోని అల్మటీ, బకూ కోసం సెర్చ్‌లు వరుసగా 527 శాతం, 395 శాతం పెరిగాయి. ⇒ విలాసవంతమైన ప్రయాణాలపై కూడా భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో బిజినెస్ తరగతి ఫ్లయిట్స్ కోసం చేసే సెర్చ్‌లు 10 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. ⇒ సెర్చ్‌లలో 131 శాతం వృద్ధితో హాంకాంగ్ టాప్‌లో ఉంది. శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేíÙయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒ ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్‌లో దాదాపు సగం బుకింగ్స్ టారిఫ్ రోజుకు రూ. 7,000 పైనే ఉంటున్నాయి. హోటళ్ల విషయంలో న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఈ విషయంలో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే టాప్ గమ్యస్థానాల జాబితాలో దక్షిణాసియాలోని పోఖారా, పట్టాయా, కౌలాలంపూర్ మొదలైనవి ఉన్నాయి. ⇒ సీజన్లతో పనిలేకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి సెర్చ్‌ల పరిమాణం అన్ని కాలాల్లోనూ స్థిరంగా ఉంటోంది. డిసెంబర్లో మాత్రం అత్యధికంగా సెర్చ్‌లు నమోదవుతున్నాయి. -
మైక్రోసాఫ్ట్, మేక్మైట్రిప్ జట్టు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) ద్వారా భారతీయ భాషల్లో వాయిస్ ఆధారిత బుకింగ్ సర్వీసులు అందించే దిశగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో సందర్భం, బడ్జెట్, కాల వ్యవధి, యాక్టి విటీలు మొదలైన వివరాలను ప్రయాణికులు తెలియజేస్తే .. వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను ఆఫర్ చేసేందుకు వీలవుతుందని కంపెనీ తెలిపింది. పోర్టల్‌లో ఈ సాంకేతికతను పొందుపర్చారు. ప్రస్తుతం ఫ్లయి ట్లు, హాలిడేస్ కస్టమర్ల కోసం ఇంగ్లీష్, హిందీ భాషల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మాగో తెలిపారు. మేక్మైట్రిప్ అనుభవం, తమ ఏఐ సామర్థ్యాలతో దేశీయంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ఈడీ సంగీతా బవి వివరించారు. -
పండగ వేళ ఓయో, మేక్‌మై ట్రిప్‌లకు సీసీఐ భారీ షాక్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్‌మై ట్రిప్, గోఐబిబో, ఓయోలకు భారీ షాక్ తగిలింది. యాంటీ కాంపిటీటివ్, అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ బుధవారం సీసీఐ ప్రకటించిన నిర్ణయం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. (జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు) హోటల్ విభాగంలో అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు మేక్ మై ట్రిప్-గోఇబిబో. రూ. 223.48 కోట్లు, ఓయోకు రూ. 168.88 కోట్ల నగదు జరిమానాలు విధించింది. ఈ మేరకు సీసీఐ 131 పేజీల ఆర్డర్‌ను జారిచేసింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీల అక్రమ ఒప్పందాలు మార్కెట్లో పోటీని దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి వినియోదారుల హక్కుల్ని దెబ్బతీయడం తోపాటు, గుత్తాధిపత్యానికి తెర తీస్తుందని సీసీఐ చురకలేసింది. అంతేకాదు తమ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువకు ఇతరులకు గదులను కేటాయించకుండా ఆంక్షలు విధించడంపై మండిపడింది. తక్షణమే దీన్ని సవరించుకోవాలని, ముఖ్యంగా, ధర, గది లభ్యతపై హోటళ్లు/గొలుసు హోటళ్లతో ఉన్న ఒప్పందాలను రద్ద చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇదే తొలిసారి. (ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు) నాస్డాక్-లిస్టెడ్ ఎంఎంటీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తేలిందని సీసీఐ ఆరోపించింది. ఇది ఇతర సంస్థ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఓయో, మేక్‌మైట్రిప్‌ల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, దీని కారణంగానే వారు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా విమర్శించింది. కాగా మేక్‌మై ట్రిప్‌ను 2000 సంవత్సరంలో దీప్ కల్రా స్థాపించారు. 2017లో, ఎంఎటీ ఐబిబో గ్రూప్ హోల్డింగ్‌ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి మేక్ మై ట్రిప్ బ్రాండ్ పేరుతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. -
ప్రైవేట్ జెట్స్‌కు ‘కరోనా’ రెక్కలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకుని సాధారణ రవాణా సాధనాల దాకా దాదాపు అన్నీ స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రయాణాలపరంగా కాస్త వెసులుబాటు లభించినప్పటికీ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రైవేట్ విమానాలకు డిమాండ్ భారీగా నెలకొంది. దీంతో వాటి చార్జీలకు కూడా బాగా రెక్కలొచ్చాయి. కరోనా వ్యాప్తి భయాల కారణంగా బడా పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐ) దేశీయంగానైనా, విదేశాలకైనా సాధారణ ఫ్లయిట్లలో ప్రయాణించేందుకు ఇష్టపడకపోతుండటం, ప్రైవేట్ జెట్లవైపు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం. దీంతో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ జెట్ కంపెనీలతో పాటు కొన్ని షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ సర్వీసుల పోర్టల్ .. మేక్మైట్రిప్ కూడా తాజాగా బరిలోకి దిగింది. ప్రయాణాలపై ఆంక్షలు తొలగడంతో వివిధ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఫ్లయిట్లను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇతరత్రా రవాణా సాధనాలపైనా దృష్టి పెడుతున్నారని మేక్మైట్రిప్ సీవోవో (ఫ్లయిట్స్ వ్యాపార విభాగం) సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. సురక్షితం, సౌకర్యవంతం.. భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉండటంతో పాటు సురక్షితంగా, తమకు కావాల్సిన విధంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్ విమానాలు ఉపయోగకరంగా ఉంటున్నాయని సౌజన్య తెలిపారు. దీంతో వీటిని అద్దెకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. మరోవైపు, కరోనా వైరస్ రాక మునుపు రోజుకు 30–40 చార్టర్ రిక్వెస్ట్‌లు వచ్చేవని ప్రస్తుతం డిమాండ్ తొమ్మిది రెట్లు పెరిగిందని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనికా టేక్రివాల్ తెలిపారు. అయితే, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రాత్రికి రాత్రి ప్రయాణ నిబంధనలు మారిపోతుండటంతో కేవలం 50–60 శాతం మాత్రమే సర్వీసులు అందించగలుగుతున్నామని వివరించారు. మేక్మైట్రిప్ ప్రధానంగా కార్పొరేట్లు, హెచ్ఎన్ఐలు, సంపన్న ప్రయాణికులు లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న జెట్‌సెట్‌గో క్లయింట్ల సంఖ్య చాలా విస్తృతంగానే ఉంది. ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు మొదలుకుని, సినిమా నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడాకారులు, హెచ్‌ఎన్‌ఐఏలు మొదలైన వారు క్లయింట్లుగా ఉన్నారు. ఇక 2016 నుంచి ఎయిర్ చార్టర్ వ్యాపారంలో ఉన్న జెట్‌స్మార్ట్ (ఇండ్‌జెట్స్ ఇండియా) సంస్థకు ప్రముఖ లాయర్లు, వ్యాపారవేత్తలు మొదలైనవారు క్లయింట్లుగా ఉన్నారు. ఖరీదైన వ్యవహారమే... ప్రైవేట్ విమానాలను సాధారణంగా మెట్రో నగరాల మధ్య, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రథమ శ్రేణి పట్టణాలకు ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఎంచుకుంటున్నారు. ఇదేమంత చౌకైన వ్యవహారం మాత్రం కాదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ జెట్ అద్దె చార్జీలు గంటకు రూ. 85,000 నుంచి రూ. 4 లక్షల దాకా ఉంటోందని జెట్‌స్మార్ట్ సీఈవో అనూప్ సెహాన్ తెలిపారు. దీనికి జీఎస్టీ, ఎయిర్పోర్ట్ చార్జీలు మొదలైనవి అదనం. ఒకవేళ వన్–వే ట్రిప్ అయిన పక్షంలో సదరు విమానం తిరిగి వెళ్లేందుకు అయ్యే చార్జీలను కూడా కట్టాల్సి ఉంటుంది. -
సైబర్ మోసాలపై టెకీల పోరు
బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి. ఎస్బీఐకు లేఖ.. గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్టెల్ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాలు ఇలా.. ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్ పోర్టల్ వంటి పోర్టల్స్ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. -
మేక్ మై ట్రిప్‌లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ‘మేక్ మై ట్రిప్’ బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణీకుల సౌలభ్యం కోసం వినూత్న ఆఫర్‌ను శుక్రవారం ప్రకటించింది. ప్రయాణీకుల చెల్లింపులకు సంబంధించి 'పే లేటర్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ అవకాశాన్ని ఇంకా విస్తరించే వ్యూహంలో భాగంగా వివిధ వ్యాపార సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడించింది. గోఐబిబో, రెడ్‌బస్ లాంటి అన్ని ఫ్లాట్‌ఫాంలలో పే లేటర్ ఫీచర్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నామని మేక్‌మై ట్రిప్ ఒక ప్రకటనలో తెలిపింది. 'పే లేటర్' ఫీచర్‌తో తమకు అత్యంత విలువైన వినియోగదారుల కోసం ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ అనుభవంలో సౌలభ్యాన్ని విశ్వాసాన్ని, పటిష్టం చేయడంతో పాటు క్రెడిట్ యాక్సెస్ అవసరాన్ని నెరవేర్చడమే లక్ష్యమని మేక్ పై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఇండియా రాజేష్ మాగో అన్నారు. దేశీయ అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్కంపెనీగా తాము అడ్వాన్స్స్డ్ మెషీన లెర్నింగ్ ద్వారా టార్గెట్ సెగ్మెంట్స్‌ను గుర్తించే సామర్ధ్యాన్ని, కస్టమర్ల కొనుగోలు శైలిని గమనించే ఇంటర్నల్ డేటాను కలిగి ఉన్నామని పేర్కొన్నారు. పలు విమానయాన సంస్థల విమాన టికెట్ బుకింగ్‌లో విశిష్ట సేవలను అందిస్తున్న మేక్ మై ట్రిప్ ..దేశవ్యాప్తంగా 45వేల హోటళ్ళు, 13,500 ప్రత్యామ్నాయ వసతి గృహాలతోపాటు, 5లక్షలకు పైగా విదేశీ హోటళ్ళ బుకింగ్ సదుపాయం, ఇంకా ఇతర సేవలను అందిస్తుంది. -
సమ్మర్ సీజన్.. చలో టూర్..
♦ 39 శాతం పెరిగిన ట్రావెల్ బుకింగ్స్ ♦ మేక్మైట్రిప్ నివేదిక ముంబై: ఎండలు కాస్త ఎక్కువైతే చాలు మనం బయట తిరగడం తగ్గించేస్తాం. అలాంటిది ఒకవైపు భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తోన్న కూడా ఈ సమ్మర్ సీజన్‌కి (ఏప్రిల్–జూన్) సంబంధించి ట్రావెల్ బుకింగ్స్ 39 శాతం మేర పెరిగాయి. ఈ విషయం మేక్మైట్రిప్ ‘సమ్మర్ ట్రావెల్ ట్రెం డ్స్’ నివేదికలో వెల్లడయ్యింది. ‘సమ్మర్ సీజన్లో ప్రయాణాలపై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్యలో ఇప్పుడు దాదాపు 39 శాతం వృద్ధి నమోదయ్యింది. వీరందరూ ఈ వేసవిలో వివిధ ప్రాంతాలను చుట్టిరావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు’ అని మేక్మైట్రిప్ సీఈవో (హోటల్స్ అండ్ హాలిడేస్) మోహిత్ గుప్తా తెలి పారు. మేక్మైట్రిప్ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 28 వరకు జరిగిన బుకింగ్స్ వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని చెప్పారు. యాప్ లావాదేవీలు 49 శాతం అప్ స్మార్ట్‌ఫోన్స్ ద్వారా జరిగే బుకింగ్స్‌లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందని మోహిత్ గుప్తా తెలిపారు. దీనికి స్మార్ట్‌ఫోన్స్ వినియోగం, యువ పర్యాటకుల సంఖ్య పెరుగుదల వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతేడాది సమ్మర్ సీజన్ నుంచి చేస్తే మొబైల్ యాప్ లావాదేవీలు 49 శాతం పెరిగాయని తెలిపారు. ఈ సమ్మర్లో ప్రయాణించే వారిలో 18–24 ఏళ్ల వయసున్న వారు 12 శాతంగా ఉన్నారని, వీరి సంఖ్య గతేడాది 9 శాతంగా ఉందని వివరించారు. అలాగే ఒంటరిగా ప్రయాణించేవారి సంఖ్య కూడా 32 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందని తెలిపారు. గోవానే టాప్ దేశీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారిలో చాలా మంది గోవా, మనాలీ (హిమాచల్ ప్రదేశ్), ఊటీ (తమిళనాడు), గ్యాంగ్‌టక్ (సిక్కిం) ప్రదేశాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ ప్రదేశాలు చూడటానికి వెళ్లే వారిలో చాలా మంది కౌలాలంపూర్, దుబాయ్, థాయ్‌లాండ్, సింగపూర్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే సుదూర ప్రయాణాలు చేసేవారికి లండన్, పారిస్, మసాయి మారా సఫారీ (కెన్యా) ప్రాంతాలు గమ్యస్థానాలుగా ఉన్నాయి. కార్డు ద్వారా జరిగే బుకింగ్సే ఎక్కువ ముంబై: డీమోనిటైజేషన్ తర్వాత దాదాపు 90 శాతానికిపైగా భారతీయ పర్యాటకులు వారి టూర్ల బుకింగ్స్‌కి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. యాత్రా.కామ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టూర్ ప్రణాళికలపై నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 80 శాతానికి పైగా భారతీయులు వారి ట్రావెల్ డేస్‌ను తగ్గించుకుంటున్నారని, అలాగే వసతి విషయాల్లో రాజీపడుతున్నారని యాత్రా.కామ్ ప్రెసిడెంట్ శరత్ ఢాల్ తెలిపారు. టూర్ ప్లానింగ్ సమయంలో 50 శాతానికిపైగా భారతీయ పర్యాటకులు ఆన్లైన్ రివ్యూలను చదువుతున్నారని, 30 శాతం మంది స్నేహితుల సూచనలు తీసుకుంటున్నారని వివరించారు. ఇండిగో సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ న్యూఢిల్లీ: దిగ్గజ విమానయాన కంపెనీ ‘ఇండిగో’ తాజాగా సమ్మర్ స్పెషల్ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్లో భాగంగా విమాన టికెట్లను రూ.999ల ప్రారంభ ధరతో ప్రయాణికులు అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే వర్తించే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఏప్రిల్ 12 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు మే 1 నుంచి జూన్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఒకసారి టికెట్‌ను బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్లీ రిఫండ్ అంటూ ఏమీ ఉండదని పేర్కొంది.