న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకుని సాధారణ రవాణా సాధనాల దాకా దాదాపు అన్నీ స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రయాణాలపరంగా కాస్త వెసులుబాటు లభించినప్పటికీ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రైవేట్ విమానాలకు డిమాండ్ భారీగా నెలకొంది. దీంతో వాటి చార్జీలకు కూడా బాగా రెక్కలొచ్చాయి. కరోనా వ్యాప్తి భయాల కారణంగా బడా పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐ) దేశీయంగానైనా, విదేశాలకైనా సాధారణ ఫ్లయిట్లలో ప్రయాణించేందుకు ఇష్టపడకపోతుండటం, ప్రైవేట్ జెట్‌లవైపు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం. దీంతో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ జెట్ కంపెనీలతో పాటు కొన్ని షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీసుల పోర్టల్ .. మేక్‌మైట్రిప్ కూడా తాజాగా బరిలోకి దిగింది. ప్రయాణాలపై ఆంక్షలు తొలగడంతో వివిధ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఫ్లయిట్‌లను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇతరత్రా రవాణా సాధనాలపైనా దృష్టి పెడుతున్నారని మేక్‌మైట్రిప్ సీవోవో (ఫ్లయిట్స్ వ్యాపార విభాగం) సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.
సురక్షితం, సౌకర్యవంతం..
భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉండటంతో పాటు సురక్షితంగా, తమకు కావాల్సిన విధంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్ విమానాలు ఉపయోగకరంగా ఉంటున్నాయని సౌజన్య తెలిపారు. దీంతో వీటిని అద్దెకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. మరోవైపు, కరోనా వైరస్ రాక మునుపు రోజుకు 30–40 చార్టర్ రిక్వెస్ట్‌లు వచ్చేవని ప్రస్తుతం డిమాండ్ తొమ్మిది రెట్లు పెరిగిందని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనికా టేక్రివాల్ తెలిపారు.
అయితే, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రాత్రికి రాత్రి ప్రయాణ నిబంధనలు మారిపోతుండటంతో కేవలం 50–60 శాతం మాత్రమే సర్వీసులు అందించగలుగుతున్నామని వివరించారు. మేక్‌మైట్రిప్ ప్రధానంగా కార్పొరేట్లు, హెచ్‌ఎన్‌ఐలు, సంపన్న ప్రయాణికులు లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న జెట్‌సెట్‌గో క్లయింట్ల సంఖ్య చాలా విస్తృతంగానే ఉంది. ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు మొదలుకుని, సినిమా నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడాకారులు, హెచ్‌ఎన్‌ఐఏలు మొదలైన వారు క్లయింట్లుగా ఉన్నారు. ఇక 2016 నుంచి ఎయిర్ చార్టర్ వ్యాపారంలో ఉన్న జెట్‌స్మార్ట్ (ఇండ్‌జెట్స్ ఇండియా) సంస్థకు ప్రముఖ లాయర్లు, వ్యాపారవేత్తలు మొదలైనవారు క్లయింట్లుగా ఉన్నారు.
ఖరీదైన వ్యవహారమే...
ప్రైవేట్ విమానాలను సాధారణంగా మెట్రో నగరాల మధ్య, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రథమ శ్రేణి పట్టణాలకు ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఎంచుకుంటున్నారు. ఇదేమంత చౌకైన వ్యవహారం మాత్రం కాదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ జెట్ అద్దె చార్జీలు గంటకు రూ. 85,000 నుంచి రూ. 4 లక్షల దాకా ఉంటోందని జెట్‌స్మార్ట్ సీఈవో అనూప్ సెహాన్ తెలిపారు. దీనికి జీఎస్‌టీ, ఎయిర్‌పోర్ట్ చార్జీలు మొదలైనవి అదనం. ఒకవేళ వన్–వే ట్రిప్ అయిన పక్షంలో సదరు విమానం తిరిగి వెళ్లేందుకు అయ్యే చార్జీలను కూడా కట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment