బతికుంటే బలుసాకు తిని అయినా గడపొచ్చు అన్నంతగా భయపెట్టిన కరోనా.. ఎంతకాలం బతుకుతామోగానీ రాజాలా బతకాలనే ఆలోచనను కూడా తెచ్చిపెట్టింది. విలాసం ఉన్నదే నివాసం అన్న భావన కనిపిస్తోంది. అందుబాటు గృహాలకు డిమాండ్ ఎప్పుడూ ఉండేదే. కానీ ఆకాశాన్నంటే ధరల్లోని విశాలమైన, విలాసమైన గృహాలకూ ఫుల్ డిమాండ్ ఉండటం ఇప్పటి ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: కొంతకాలం నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. లగ్జరీ గృహాల కొనుగోళ్లకు ఎన్నారైలు, ధనవంతులు ఆసక్తి చూపుతుండటంతో హైదరాబాద్‌లో ఈ కేటగిరీకి చెందిన ఇళ్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కరోనా నేర్పిన పాఠాలతో ఇంద్ర భవనం లాంటి ఇళ్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం ఒక కారణమైతే.. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటం, యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో రాజకీయ, ఆర్థిక అస్థిరతలు మరో కారణంగా నిలుస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెంచింది.
ఫ్లోర్‌కో ఫ్లాట్..
కరోనా తర్వాత అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం పెరిగింది. కొనుగోలుదారులు పెద్ద సైజు నివాసాలను కోరుకుంటున్నారు. ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు, వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్థలం, అనారోగ్యం పాలైతే హోం ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా గది.. ఇలా పక్కా ప్లానింగ్‌తో ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. డెవలపర్లు కూడా ఆ తరహా ఇళ్లనే నిర్మిస్తున్నారు. కరోనా కంటే ముందు 2,500 చదరపు అడుగుల నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్నవాటిని లగ్జరీ ఫ్లాట్లుగా భావించేవారు. కరోనా తర్వాత వీటి ప్రారంభ విస్తీర్ణమే కనీసం 3 వేల చదరపు అడుగులకుపైగా ఉంటోంది. డీఎస్‌ఆర్, పౌలోమి వంటి కొన్ని నిర్మాణ సంస్థలైతే ఏకంగా అంతస్తుకు ఒకటే ఫ్లాట్ ఉండేలా నిర్మిస్తున్నాయి.
ఎన్నారైలు, హెచ్‌ఎన్‌ఐలదే జోరు..
లగ్జరీ గృహాల కొనుగోళ్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రవాసులు, హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ). డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వీరికి బాగా కలిసి వస్తోంది. బంగారం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులతో పోలిస్తే స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చేది రియల్ ఎస్టేటే కావటంతో.. ఇళ్ల కొనుగోలుకు ఎన్నారైలు, హెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిని కనబరుస్తున్నారని అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఇదే సమయంలో కరోనా కాలంలో విదేశాలలో ఎదురైన ఇబ్బందులు, అనిశ్చితిలను ప్రవాసులు మర్చిపోలేదని.. ప్రతికూల వాతావరణంలో విదేశాల్లో నివసించడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వారిలో ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కనీసం ఒక్క సొంతిల్లు అయినా ఏర్పర్చుకోవడం ఎన్నారైలకు ప్రాధాన్యతగా మారిపోయిందని వివరించారు. యూరప్, అమెరికా, చైనా, గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ, ఆరి్ధక అనిశ్చితి నేపథ్యంలో ఇండియాలో పెట్టుబడులే సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు. దీంతో ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని ప్రాపరీ్టలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.
► పుప్పాలగూడలో డీఎస్‌ఆర్ ఎస్‌ఎస్‌ఐ ట్విన్స్ ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్ 16 వేల చదరపు అడుగులు ఉంటుంది.
►కోకాపేటలో పౌలోమి ఎస్టేట్స్ పలాజో ప్రాజెక్ట్‌లో 6,225–8,100 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్లున్నాయి.
►ఖానామెట్‌లో మంజీరా కన్‌స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ట్రంప్ టవర్స్‌లో 3 వేలు– 6 వేల చదరపు అడుగుల మధ్య ఫ్లాట్లున్నాయి.
►రాయదుర్గంలోని రాఘవ ఐరిస్ ప్రాజెక్ట్‌లో 5,425– 6,605 చదరపు అడుగులమధ్య 4, 6 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
►ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఎటెర్నా ప్రాజెక్ట్‌లో రాజపుష్ప 2,360–4,340 చ.అడుగుల మధ్య 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.
కోవిడ్‌కు ముందు.. తర్వాత..
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (హెచ్1) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1.84 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. అందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే. అదే కోవిడ్ కంటే ముందు 2019 ఏడాదిని చూస్తే.. మొత్తంగా విక్రయమైన 2.61 లక్షల యూనిట్లలో కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలు ఉండటం గమనార్హం. ఇటీవలికాలంలో డెవలపర్లు కూడా ప్రాజెక్టుల లాంచింగ్‌లో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 28వేల లగ్జరీ గృహాలను లాంచ్ చేశారు.
అత్యధికంగా ముంబైలో..
2022 తొలి అర్ధభాగంలో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. అక్కడ 13,670 యూనిట్లు విక్రయమయ్యాయి. ఆ తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో 4,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ రెండు చోట్ల కలిపి 11,890 విలాసమైన ఇళ్లు అమ్ముడవగా.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే 17,830 యూనిట్లు విక్రయించడం గమనార్హం. 2019 నాటితో పోలిస్తే.. 2022 తొలి ఆరు నెలల కాలంలో ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం నుంచి 25 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో ఎన్‌సీఆర్‌లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 11,730 లగ్జరీ గృహాలు అమ్మకానికి ఉండగా.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే 2,420 యూనిట్లు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్‌పై 22% ఎన్నారైల ఆసక్తి
స్థిరాస్తి రంగంలో ప్రవాసుల పెట్టుబడులు పెరుగుతున్నాయి. కరోనా కంటే ముందు 55 శాతం మంది ఎన్నారైలు దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉండగా.. ప్రస్తుతం 71 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరప్, గల్ఫ్ దేశాల్లోని సుమారు 5,500 మంది ప్రవాసులతో ఈ సర్వే నిర్వహించారు. అందులో 60శాతం మంది ఎన్నారైలు ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్‌లలో గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తేలింది. అత్యధికంగా 22 శాతం మంది ప్రవాసులు హైదరాబాద్‌లోని ప్రాపర్టీలకు మొగ్గు చూపిస్తుండగా.. 20శాతం మంది ఎన్‌సీఆర్, 18 శాతం మంది బెంగళూరులోని నివాసాల కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారని సర్వే తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment