సమ్మర్ సీజన్.. చలో టూర్..
♦ 39 శాతం పెరిగిన ట్రావెల్ బుకింగ్స్
♦ మేక్‌మైట్రిప్ నివేదిక
ముంబై: ఎండలు కాస్త ఎక్కువైతే చాలు మనం బయట తిరగడం తగ్గించేస్తాం. అలాంటిది ఒకవైపు భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తోన్న కూడా ఈ సమ్మర్ సీజన్‌కి (ఏప్రిల్–జూన్) సంబంధించి ట్రావెల్ బుకింగ్స్ 39 శాతం మేర పెరిగాయి. ఈ విషయం మేక్‌మైట్రిప్ ‘సమ్మర్ ట్రావెల్ ట్రెం డ్స్’ నివేదికలో వెల్లడయ్యింది. ‘సమ్మర్ సీజన్‌లో ప్రయాణాలపై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్యలో ఇప్పుడు దాదాపు 39 శాతం వృద్ధి నమోదయ్యింది. వీరందరూ ఈ వేసవిలో వివిధ ప్రాంతాలను చుట్టిరావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు’ అని మేక్‌మైట్రిప్ సీఈవో (హోటల్స్ అండ్ హాలిడేస్) మోహిత్ గుప్తా తెలి పారు. మేక్‌మైట్రిప్ ప్లాట్‌ఫామ్‌లో ఫిబ్రవరి 28 వరకు జరిగిన బుకింగ్స్ వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని చెప్పారు.
యాప్ లావాదేవీలు 49 శాతం అప్
స్మార్ట్‌ఫోన్స్ ద్వారా జరిగే బుకింగ్స్‌లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందని మోహిత్ గుప్తా తెలిపారు. దీనికి స్మార్ట్‌ఫోన్స్ వినియోగం, యువ పర్యాటకుల సంఖ్య పెరుగుదల వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతేడాది సమ్మర్ సీజన్ నుంచి చేస్తే మొబైల్ యాప్ లావాదేవీలు 49 శాతం పెరిగాయని తెలిపారు. ఈ సమ్మర్‌లో ప్రయాణించే వారిలో 18–24 ఏళ్ల వయసున్న వారు 12 శాతంగా ఉన్నారని, వీరి సంఖ్య గతేడాది 9 శాతంగా ఉందని వివరించారు. అలాగే ఒంటరిగా ప్రయాణించేవారి సంఖ్య కూడా 32 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందని తెలిపారు.
గోవానే టాప్
దేశీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారిలో చాలా మంది గోవా, మనాలీ (హిమాచల్ ప్రదేశ్), ఊటీ (తమిళనాడు), గ్యాంగ్‌టక్ (సిక్కిం) ప్రదేశాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ ప్రదేశాలు చూడటానికి వెళ్లే వారిలో చాలా మంది కౌలాలంపూర్, దుబాయ్, థాయ్‌లాండ్, సింగపూర్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే సుదూర ప్రయాణాలు చేసేవారికి లండన్, పారిస్, మసాయి మారా సఫారీ (కెన్యా) ప్రాంతాలు గమ్యస్థానాలుగా ఉన్నాయి.
కార్డు ద్వారా జరిగే బుకింగ్సే ఎక్కువ
ముంబై: డీమోనిటైజేషన్ తర్వాత దాదాపు 90 శాతానికిపైగా భారతీయ పర్యాటకులు వారి టూర్ల బుకింగ్స్‌కి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. యాత్రా.కామ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టూర్ ప్రణాళికలపై నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 80 శాతానికి పైగా భారతీయులు వారి ట్రావెల్ డేస్‌ను తగ్గించుకుంటున్నారని, అలాగే వసతి విషయాల్లో రాజీపడుతున్నారని యాత్రా.కామ్ ప్రెసిడెంట్ శరత్ ఢాల్ తెలిపారు. టూర్ ప్లానింగ్ సమయంలో 50 శాతానికిపైగా భారతీయ పర్యాటకులు ఆన్‌లైన్ రివ్యూలను చదువుతున్నారని, 30 శాతం మంది స్నేహితుల సూచనలు తీసుకుంటున్నారని వివరించారు.
ఇండిగో సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: దిగ్గజ విమానయాన కంపెనీ ‘ఇండిగో’ తాజాగా సమ్మర్ స్పెషల్ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్లను రూ.999ల ప్రారంభ ధరతో ప్రయాణికులు అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే వర్తించే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఏప్రిల్ 12 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు మే 1 నుంచి జూన్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఒకసారి టికెట్‌ను బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్లీ రిఫండ్ అంటూ ఏమీ ఉండదని పేర్కొంది.