భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.
ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్‌పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.
ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment