సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది.
డ్రోన్ టెక్నాలజీ దేశానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు డ్రోన్స్ వినియోగ నిబంధనలను సరళీకృతం చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. డ్రోన్స్ డిమాండ్‌కు తగినట్లు నైపుణ్య శిక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 48 డ్రోన్ శిక్షణ పాఠశాలలకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇంకా ఈ పాఠశాలల అనుమతికోసం పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంది.
116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులు
డ్రోన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 12 రాష్ట్రాల్లో 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఇప్పటికే అనుమతించింది. ఈ ఐటీఐలు డ్రోన్ సర్వీస్ టెక్నిíÙయన్, డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో సహా ఆరు స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అనుమతించింది.
వ్యవసాయరంగంలో ప్రోత్సాహం
ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. వ్యవసాయరంగంలో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా స్థానిక యువతకు డ్రోన్స్ వినియోగంలో అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే ఐటీఐల్లో డ్రోన్స్‌పై నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా రాష్ట్రంలో 10 ఐటీఐల్లో డ్రోన్స్ రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణకు అనుమతి మంజూరు చేసింది. మరో పక్క కిసాన్ డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు వ్యక్తిగతంగాను లేదా ఎఫ్‌పీవోకు బ్యాంకులు అవసరమైన రుణాలను మంజూరు చేయాల్సిందిగా నాబార్డు సూచించింది.
పది లీటర్ల సామర్థ్యం గల కిసాన్ డ్రోన్ యూనిట్ వ్యయం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలుగా ఖరారు చేసినట్లు నాబార్డు పేర్కొంది. ఆ మేరకు రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులకు నాబార్డు సూచించింది.
డ్రోన్ల తయారీకి ప్రోత్సాహం
డ్రోన్స్ ప్రాముఖ్యత నేపథ్యంలో దేశంలోనే వాటి తయారీ, విడి భాగాలు తయారీని ప్రోత్సహించడానికి మూడేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ. 120 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. డ్రోన్లు, విడిభాగాలు తయారీలో దేశం స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచంతో పోటీ పడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment