డ్రోన్‌ పైలట్లకు అధునాతన శిక్షణ | Advanced training for drone pilots | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ పైలట్లకు అధునాతన శిక్షణ

Published Thu, Feb 8 2024 4:31 AM | Last Updated on Thu, Feb 8 2024 4:31 AM

Advanced training for drone pilots - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రోన్‌ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో అనుబంధ ‘నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)’తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ (టీఎస్‌ఏఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ల సమక్షంలో టీఎస్‌ఏఏ సీఈవో ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ప్రకాశ్‌ చౌహాన్‌లు దీనిపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాస్త్రవేత్తలు డ్రోన్‌ పైలటింగ్, డ్రోన్‌ డేటా మేనేజ్‌మెంట్, డేటా అనాలసిస్, ప్రాసెసింగ్, మ్యాపింగ్‌లపై ఏవియేషన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్‌ పైలట్లకు 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 

ప్రభుత్వ అధికారులకు కూడా శిక్షణ: సీఎం
అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, పొలాల్లో ఎరువులు, పురుగుమందులు చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని ఈ భేటీలో అధికారులు వివరించారు. కొన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయని తెలిపారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కలిగేలా శిక్షణను ఇవ్వాలని రేవంత్‌ సూచించారు.

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో డ్రోన్లపై శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. శాటిలైట్, రిమోట్‌ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్‌ఆర్‌ఎస్‌సీ.. డ్రోన్‌ టెక్నాలజీని సాంకేతికపరంగా మరింత పకడ్బందీగా వినియోగించుకునేందుకు శిక్షణలో భాగస్వామ్యం అవుతోందని వివరించారు. దేశంలో 12సార్లు బెస్ట్‌ ఏవియేషన్‌ అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్‌ అకాడమీ సేవలను కొనియాడారు.
 
శిక్షణకు స్థలం కేటాయించండి 
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లోనే డ్రోన్‌ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, అక్కడ నెలకొన్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్‌ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని ఏవియేషన్‌ అకాడమీ అధికారులు సీఎం రేవంత్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. డ్రోన్‌ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం? ఏమేం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే వివరాలు తెలుసుకున్నారు.

పైలట్ల శిక్షణతోపాటు డ్రోన్‌ తయారీ కంపెనీలు ట్రయల్స్‌ నిర్వహించుకునేందుకు డ్రోన్‌ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్‌ పోర్టుకు అవసరమైన 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు అన్వేíÙంచాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్‌ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని ప్రాంతంలో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. 

వరంగల్‌ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ 
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని.. పాడైన పాత రన్‌వేలను కొత్తగా నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ఏవైనా అడ్డంకులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్‌పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.

సీఎంతో నెదర్లాండ్స్‌ రాయబారి భేటీ  
సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో నెదర్లాండ్స్‌ రాయబారి మెరిసా గెరార్డ్స్‌ బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై మాట్లాడుకున్న ఇద్దరూ తెలంగాణలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధికి అపార అవకాశాలు, అగ్రికల్చర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో నెదర్లాండ్స్‌ భాగస్వామ్యం తదితర అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement