దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు
సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్‌లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది.
అనేక రంగాల్లో వినియోగం..
ఇక డ్రోన్స్ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు.. డ్రోన్స్ రిమోట్ పైలెట్ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో రెండు సంస్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కిసాన్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
రైతుల ఖర్చులు తగ్గించేందుకు..
డ్రోన్ రిమోట్ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్‌ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పాదకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment