డ్రోన్ల వినియోగంపై నిర్లక్ష్యం
వ్యవసాయంలో యాంత్రీకరణను పట్టించుకోని ప్రభుత్వం
సాగు పెరిగినాయంత్రాలు లేక రైతుల ఇబ్బందులు
కూలీల కొరతతో రైతుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక శైలిలో పంటలు పండించే పద్ధతి పెరుగుతోంది. యంత్రాలకు తోడు డ్రోన్లు వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని రంగాల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందుబాటులో ఉంచాలని ఆగ్రోస్ నిర్ణయించినా, ఆచరణలో మాత్రం అమలుకావడంలేదు.
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా వాటిని అందుబాటులోకి తెచ్చి రైతులకు అద్దెకు ఇవ్వాలని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలుంటే, వాటన్నింటిలోనూ డ్రోన్లు అందుబాటులో ఉంచాలనుకున్నారు. కానీ ఇప్పటికీ డ్రోన్లతోపాటు వ్యవసాయ యంత్రాలను కూడా రైతులకు సబ్సిడీపై ఇవ్వడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై మార్గదర్శకాలను ఖరారు చేయడంలోనే వ్యవసాయశాఖలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి.
దుక్కు యంత్రాలు కూడాఇచ్చే దిక్కులేదా?
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయంలో విస్తీర్ణ పరంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలై రైతులు విత్తనాలు చల్లుతూ, దుక్కులు చేస్తున్నారు. ఈ కీలకమైన సమయంలో రైతులు వ్యవసాయ పనిముట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దుక్కు యంత్రాలు, తైవాన్ స్ప్రేయర్ వంటివి సైతం రైతులకు సబ్సిడీపై ఇచ్చే దిక్కు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో డ్రోన్ రూ.10 లక్షలు...
ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ఇకపై డ్రోన్లను కూడా ఇవ్వాలని నిర్ణయించారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరుతుందని భావిస్తున్నారు. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. అయితే సీజన్ మొదలైనా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాపై స్పష్టత రాలేదు.
కూలీలు దొరక్క రైతుల అవస్థలు
దుక్కు యంత్రాలను బయట మార్కెట్లో కొనాలంటే ధరలు భరించడం కష్టం. మరోవైపు కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
సబ్సిడీపై యంత్రాలను ఇవ్వాలి. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ప్రభుత్వమే ఇచ్చింది. వ్యవసాయ యంత్రాలు తీసుకునే ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఐదేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు.
కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏమయ్యాయి?
వరి సాగు భారీగా ఉండటంతో రాష్ట్రంలో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది. ఒక్కసారే కోతకు రావడంతో మిషిన్లు అందుబాటులో లేక అనేక సార్లు వడగండ్లకు, వర్షాలకు పంట నష్టపోతున్నారు. దీంతో ఓలా, ఊబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత, నాటు మిషిన్లు బుక్ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని గతంలో వ్యవసాయశాఖ చెప్పింది. అయితే ఇంతవరకు కస్టమ్ హైరింగ్‌సెంటర్లు ఎలా ఉండాలి? ఎవరి ఆధ్వర్యంలో నడిపించాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment