- 13 ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ అధికారులు
- సహకరించిన స్థానికులు
ఇసుక అక్రమ రవాణాపై అధికారుల కొరడా
Published Fri, Sep 2 2016 7:27 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
బసంత్‌నగర్ : రామగుండం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మైనింగ్, విజిలెన్స్ అధికారులు కొరడా∙ఝలిపించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 13 ట్రాక్టర్లను శుక్రవారం సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండల పరిధిలోని గోదావరి పరీవాహాక ప్రాంతమైన ముర్‌మూర్ గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్ల యజమానులు కొంతకాలంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మైనింగ్, విజిలెన్స్ టెక్నికల్ అసిస్టెంట్ పరమేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ ధనుంజయ్, వీఆర్‌ఏ శంకర్‌తో కూడిన బృందం కుక్కలగూడుర్ ఎస్సీకాలనీ శివారులో ఇసుక లోడుతో వెళుతున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే ఇసుక మాఫియా మాత్రం అధికారులతో వాగ్వాదానికి దిగి ట్రాక్టర్లను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన కుక్కలగూడుర్ గ్రామస్తులు వాహనాలకు అడ్డుకుని అధికారులకు మద్దతుగా నిలవడంతో ఇసుక మాఫియా నివ్వెరపోయింది. స్పందించిన అధికారులు ట్రాక్టర్లను దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.
అక్రమ వ్యాపారానికి దారి కొనుగోలు
గోదావరినది పరివాహాక ప్రాంతాలైన ముర్‌మూర్, గోలివాడ, అంతర్గాం నుండి మద్దిర్యాల, కుక్కలగూడుర్ మీదుగా ధర్మారం, వెల్గటూర్ మండలాల పరిధిలోని గ్రామాలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కుక్కలగూడుర్ గ్రామ శివారు వరకు చేరుకోవడంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఇసుక రవాణాదారులు బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి గ్రామాల మీదుగా తమ దందాను కొనసాగించారు. అయితే ఇటీవల ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకున్న నేపథ్యంలో ఇసుక మాఫియా తిరిగి పాత రహదారి మార్గాన్నే ఎంచుకుంది. అయితే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఉన్న నేపథ్యంలో సమీపంలోని పంటపొలాల గుండా ప్రత్యామ్నయ రహదారిని ఎంచుకున్నారు. ఇందుకు ఇసుక మాఫియా సదరు భూమి యజమానులకు రూ.50 వేలు చెల్లించినట్లు తెలిసింది.
Advertisement
Advertisement