udan
-
ఉడాన్‌లో కీలక పరిణామం..ఇంటర్ గ్లోబ్ సీఈఓగా ఆదిత్య పాండే
ప్రముఖ బీ2బీ ఈకామర్స్ కంపెనీ ఉడాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా పాండే ఏవియేషన్ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓ నియమితులయ్యారు. మార్చి 1, 2024 నుండి విధులు నిర్వహించనున్నారు. గతంలో ఇండిగోలో పనిచేసిన అనుభవం కారణంగా ఇంటర్‌గ్లోబ్ యాజమాన్యం సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించింది. వ్యూహాత్మక వ్యాపారం, కార్పొరేట్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి బాధ్యతలు చూసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాండే ప్రొడక్టివీటీ, ప్రాఫిట్ వంటి విభాగాల్లో దృష్టిసారిస్తూ వివిధ కంపెనీలలో వ్యాపార వ్యూహం, ఆర్ధిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. గతంలో పాండే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఉడాన్‌లో చేరారు. తాజాగా ఉడాన్ నుంచి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సీఈఓగా పదోన్నతి సాధించారు. ఇక,ఉడాన్‌లో పాండే స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా.. బదులుగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఫైనాన్స్ బాధ్యతలను అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
ఉడాన్‌లో విక్రయానికి సిద్దమైన కాంపా డ్రింక్స్ - మరో రెండు నెలల్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ పోర్టల్ ఉడాన్ తాజాగా రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న కాంపా పానీయాలను ఉడాన్ విక్రయించనుంది. తొలుత 50,000 పైచిలుకు రిటైలర్లు, కిరాణా స్టోర్లలో కాంపా ఉత్పత్తులు లభిస్తాయి. వచ్చే రెండు నెలల్లో ఈ కేంద్రాల సంఖ్యను 1 లక్షకు చేరుస్తారు. ప్రాజెక్ట్ విస్తార్లో భాగంగా 3,000 వరకు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను ఉడాన్ చేరవేస్తోంది. 2022లో 1.5 లక్షల టన్నుల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్టు వెల్లడించింది. -
Peddapalli: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. ఇంతకాలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఉంటుందా? ఉండదా? అన్న ఊహాగానాలకు ఇకపై తెరపడనుంది. తాజాగా ఉడాన్ పథకం 5.0లో భాగంగా రాష్ట్రంలోని రెండు పాత విమానాశ్రయాలను గుర్తించగా.. అందులో మొదటిది వరంగల్ కాగా.. రెండోది బసంత్‌నగర్ విమానాశ్రయం కావడం విశేషం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన పథకం ఉడాన్. ఉడాన్ అంటే ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి బసంత్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులను పరిశీలించాలని రాష్ట్రం విన్నవించింది. అంతేకాకుండా పలుమార్లు ఇక్కడి సాధ్యాసాధ్యాలు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, ఆటంకాలు, అందుబాటులో ఉన్న రన్‌వే తదితరాలపై ప్రైవేటు కన్సెల్టెన్సీ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి పంపారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు, పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంత ప్రజలతోపాటు, ఉమ్మడి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఆవశ్యకత, తదితరాలను సైతం వివరించారు. దేశంలో 54 ఎయిర్‌స్ట్రిప్స్ గుర్తింపు పలుమార్లు రాష్ట్ర వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలిసారిగా ఈ విమానాశ్రయం విషయంలో సుముఖత వ్యక్తం చేసింది. ఉడాన్ పథకంలో భాగంగా దేశం మొత్తం మీద 54 పొటెన్షియల్ ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను గుర్తించింది. అందులో మన రాష్ట్రం నుంచి వరంగల్, బసంత్నగర్లను కూడా భవిష్యత్తులో మనగలిగే సామర్థ్యమున్న ఎయిర్స్ట్రిప్లుగా నోటిఫై చేసింది. అసలు దేశంలోని అటవీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ 54 ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను కేంద్రం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే బసంత్‌నగర్‌ను ‘పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల’ జాబితాలో చోటు కలించింది. అంటే దీని ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిసరాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దేశంలోని నలమూలల నుంచి వచ్చే యాత్రికులకు పరిచయం చేయనుంది. ఈ పరిణామం శుభసూచమకమని, దేశంలోని వివిధ నగరాలతో కనెక్టివిటీ పెంచే క్రమంలో ఇది తొలి అడుగు అవుతుందని ఉమ్మడి జిల్లా ప్రముఖులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పర్యాటకానికి పెద్దపీట..! తాజాగా కేంద్రం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకోవడం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి దోహదపడనుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో అభివృద్ధి చేయనున్న ఈ విమానశ్రయానికి కాళేశ్వరం, ధర్మపురి, రామగిరి ఖిల్లా, కొండగట్టు, వేములవాడతోపాటు పక్కనే ఉన్న గోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని టైగర్ రిజర్వ్, గిరిజన తదితర పర్యాటక ప్రాంతాలను పర్యాటకులకు చేరవవుతాయి. దీంతో యాత్రీకులకు ఆధ్మాత్మిక భావనను పంచడంతోపాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందిన ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఉపాధి లభించనుంది. (క్లిక్: RRRకు భూసేకరణ వేగవంతం) ఇదీ.. చరిత్ర..! 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తాను ఇక్కడికి వచ్చేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏరాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబరులో ఇదే ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్ పోర్టుగా 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా.. తరువాత అవి అటకెక్కాయి. తరువాత 2016లో ఉడాన్ పథకం రావడంతో 2020లో ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) ఈ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాను కూడా చేసిన పలు సాంకేతిక, భౌగోళిక సర్వేలను అధ్యయనం చేసింది. (క్లిక్: ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!) -
ఉడాన్ మెగా భారత్ సేల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ టు బిజినెస్ ఆన్లైన్ వేదిక ఉడాన్ మెగా భారత్ సేల్ ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇది కొనసాగనుంది. ఎఫ్ఎంసీజీ, ఆహారోత్తుల విభాగంలో చిన్న వర్తకుల కోసం భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్, ఇన్స్టాంట్ క్యాష్ డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్‌తోపాటు ఇతర ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. 5 లక్షల పైచిలుకు వర్తకులకు ఈ భారీ అమ్మకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. వివిధ వ్యాపార విభాగాల్లో గడిచిన 18 నెలల్లో రూ.4,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు చేసినట్టు ఉడాన్ వెల్లడించింది -
కొత్త మార్గాల్లో... ఉడాన్
ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఉడాన్ మూడో రౌండ్ బిడ్డింగ్‌లో ఎంపిక చేసిన విమాన ప్రయాణ మార్గాల ద్వారా తెలంగాణ, ఏపీ నుంచి మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 235 రూట్లను కేంద్ర పౌర విమానయాన మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈసారి పర్యాటక శాఖ సహకారంతో పలు ప్రాంతాలను ఉడాన్‌లో ఎంపిక చేశారు. 6 వాటర్ ఏరోడ్రమ్స్ ద్వారా కొత్తగా 18 రూట్లలో సీప్లేన్స్కు కూడా అనుమతించారు. వీటిలో తెలంగాణలోని నాగార్జునసాగర్ వాటర్ ఏరో డ్రమ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, విజయవాడకు విమానయాన సౌకర్యం ఏర్పడనుంది. ఈ మార్గాన్ని టర్బో ఏవియేషన్‌కు కేటాయించారు. –సాక్షి, న్యూఢిల్లీ -
ప్రతి మూడు నెలలకి టిక్కెట్ ధరలు ఛేంజ్
విమాన టిక్కెట్లు ధరలు ఇక ప్రతి మూడు నెలలకోసారి మారనున్నాయి. విమాన ఛార్జీలను, విమానసంస్థలకు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలను రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద ప్రతి మూడు నెలలకోసారి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పు రానుంది. ఉడాన్ స్కీమ్ కింద వైబిలిటీ గ్యాఫ్ ఫండింగ్(వైజీఎఫ్), విమాన టిక్కెట్లను క్వార్టర్లీ బేసిస్ లో మార్చనున్నామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ఛార్జీలను ద్రవ్యోల్బణంతో లింక్ చేస్తామని, వీజీఎఫ్ నిర్ణయించడంలో కూడా ద్రవ్యోల్బణం, ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్, రూపీ, డాలర్ ఎక్స్చేంజ్ రేటును పరిగణలోకి నిర్ణయిస్తుంటామని పేర్కొంది. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా ఉడాన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉడాన్ తొలి విమానం గత నెల సిమ్లాలో ఆకాశంలోకి ఎగిరింది. ఉడాన్ కింద విమాన టిక్కెట్ ధర గంటకు రూ.2500. ఈ స్కీమ్ కింద ఎంపికచేసిన సీట్లను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఉడాన్ స్కీమ్ కింద మార్గాలు గ్రాంట్ అయ్యే విమాన సంస్థ ఆపరేటర్లు, ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యంలో 50 శాతం డిస్కౌంట్ ధరలకు పక్కన ఉంచాలని ప్రభుత్వం తెలిపింది. -
‘ఉడాన్’ సర్వీసులు ఎగరేనా?
న్యూఢిల్లీ : దేశంలో హవాయ్ చెప్పులేసుకొని తిరిగే సామాన్యులు కూడా హవా హవాయి అంటూ ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ లేదా ఉడాన్’ విమానాల్లో విహరించాలని ఆకాంక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామాన్యుల కోసం సబ్సిడీ కింద గాల్లో గంట ప్రయాణానికి దాదాపు 2,500 రూపాయలు ఉంటుందని మోదీ స్వయంగా ప్రకటించారు. దూరం పెరుగుతున్నా కొద్ది ఈ సబ్సిడీ టిక్కెట్ ధర కూడా పెరుగుతుంది. దేశంలో గడచిన రెండు దశాబ్దాలుగా దారిద్య్రం తగ్గినప్పటికీ 21.9 శాతం దారిద్య్ర రేఖకు దిగువనే నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 816 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు వెయ్యి రూపాయలకన్నా తక్కువ సంపాదించే వారిని మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. అలాంటిప్పుడు వీరు రెండువేల నుంచి రెండున్నర వేల రూపాయలు పెట్టి ఉడాన్ విమానం ఎక్కే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంచనాల ప్రకారమే దేశంలో 40 శాతం మంది ప్రజలు తాము జీవించడానికి నెలకు సగటున రవాణా ఖర్చులు కలుపుకొని (గ్రామీణ ప్రాంతాల్లో ) 1760 రూపాయలు, పట్టణాల్లో నెలకు సగటున 2,629 రూపాయలను ఖర్చు పెడుతున్నారు. వాటిలో వారి నెలకు సగటు రవాణా ఖర్చులు దాదాపు 200 రూపాయలు ఉంది. రవాణా చార్జీలను కలుపుకొని నెల మొత్తానికి ఖర్పు పెట్టే మొత్తాన్ని సామాన్య మానవుడు కనీసం ఒక్క రోజు ఒక్క గంట ఉడాన్ విమాన ప్రయాణానికి ఖర్చు పెట్టగలరా ? ఢిల్లీ నుంచి సిమ్లాకు అలయెన్స్ ఏర్ నిర్వహిస్తున్న ఉడాన్ సర్వీసులో జూన్ ఒకటవ తేదీకి సబ్సిడీ టిక్కెట్ ధర 2,036 రూపాయలు ఉంది. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సులో ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్లాలంటే కేవలం 415 రూపాయలు అవుతుంది. కాకపోతే సమయం 12 గంటలు పడుతుంది. అదే రైల్లో ఢిల్లీ నుంచి కల్కా వరకు (నేరుగా రైలు సౌకర్యం లేదు) ఏసీబోగీలో వెళితే 590 రూపాయలు, అక్కడి నుంచి సిమ్లా వెళ్లేందుకు మరో 300 రూపాయలు అవుతుంది. ఐదు గంటలు, ఐదు గంటలు మొత్తం పది గంటల ప్రయాణానికి 890 రూపాయలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు బస్సులు, రైళ్లు వదిలేసి ఉడాన్‌లో వెళతారా? ఉడాన్ విమాన సర్వీసులు ఏ నెలకో, సంవత్సరానికో, జీవితంలో ఒక్కసారో ప్రయాణించడానికి ప్రధాని తీసుకరాలేదన్న విషయం అందరికి తెల్సిందే. ఈ ఉడాన్ సర్వీసులు ఇప్పటికే విమాన సర్వీసులు లేని పట్టణాల మధ్య వారానికి కనీసం మూడు, గరిష్టంగా ఏడు సర్వీసులను నడపాల్సి ఉంటుంది. అంటే సామాన్యులు తరచుగా ఈ విమాన సర్వీసుల్లో ప్రయాణిస్తారన్నది ప్రభుత్వం అంచనా. ఉడాన్ సర్వీసులను నిర్వహించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు కనీస బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్‌లు దక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఉంటారో, లేదో తెలియకుండా తక్కువ రేట్‌కు విమానయాన సంస్థలు బిడ్డింగ్ వేస్తాయా? అన్నది ఒక ప్రశ్నయితే, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ సమన్వయంతో నడవాల్సిన ఉడాన్ సర్వీసులకు ప్రాక్టిగల్గా ఎన్ని చిక్కులు వస్తోయో చెప్పలేమని విమానయాన సలహా సంస్థ ‘మార్టిన్ కన్సల్టింగ్’ వ్యవస్థాపకులు మార్క్ మార్టిన్ లాంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం విమానాల ఇంధనం ధర తక్కువగానే ఉంది. భవిష్యత్తులో పెరగదన్న గ్యారెంటీ లేదు. పెరిగినప్పుడు ఛార్జిలు పెంచరా? భారత దేశంలో సామాన్యులకు విమానం ఎక్కే స్థోమత లేనందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ సర్వీసులు ప్రధానంగా మధ్యస్థాయి వ్యాపారస్థులకు ఉపయోగపడుతుందని ఏరోస్పేస్, డిఫెన్స్‌కు చెందిన గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ భారతీయ భాగస్వామి అంబర్ దూబే తెలిపారు. సామాన్యులు కాకుండా విహార యాత్రల కోసం విమానాల్లో రెండున్నర వేల రూపాయలను ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారు దేశంలో కోట్ల మందే ఉన్నారని, ఈ ఉడాన్ పథకాన్ని పర్యాటక రంగానికి మళ్లీస్తే ఆ రంగం ఎంతో అభివద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయయపడ్డారు. -
విమానయానరంగంలో భారీ అవకాశాలు
సిమ్లా: విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకూ అందుబాటులో కితీసుకొచ్చే ప్రణాళిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉడాన్ విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా మొట్టమొదటి ‘ఉడాన్’ ప్రాంతీయ విమానాలను హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ఇక విమాన ప్రయాణాలు కేవలం ధనికులకు మాత్రమే కాదు, పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్యానించారు. దేశీయ విమానయారంగం భారీ అవకాశాలతో నిండి ఉందని తెలిపారు. చండీగడ్ విమానాశ్రయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ గవర్నర్ వి.పి. బడ్నోర్ హర్యానా గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకి, ఇతర ముఖ్య అధికారులు మోదీకి స్వాగతం పలికారు. సిమ్లా-ఢిల్లీ మార్గంతో సహా, కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మార్గాల్లోనూ ఉడాన్ విమాన సర్వీసులను మోదీ ప్రారంభించారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. సిమ్లాలో ప్రధాని చారిత్రాత్మక రిడ్జ్ మైదాన్ లో ఒక ర్యాలీలో ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన అనంతరం సిమ్లాకు రావడం ఇదే మొట్టమొదటి సారి . ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2003 లో హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో పర్యటించారు. కాగా గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతోఅందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. Haryana Governor Kaptan Singh Solanki, Punjab Governor VP Badnore, CM @mlkhattar and other dignitaries welcomed PM to Chandigarh. pic.twitter.com/Uy5l5zFs2n — PMO India (@PMOIndia) April 27, 2017 -
‘ఉడాన్’కు నేడు శ్రీకారం
-
‘ఉడాన్’కు నేడు శ్రీకారం
► ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలు ► ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ► కడప, నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు న్యూఢిల్లీ: ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలకు ఊతమిచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమును అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తొలుత సిమ్లా నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే కడప– హైదరాబాద్, నాందేడ్– హైదరాబాద్ రూట్లలో కూడా విమానాలను ప్రారంభించనున్నారు. ఈ స్కీము కింద విమానయాన టికెట్ల ధరల గరిష్ట పరిమితి రూ. 2,500గా ఉంటుంది. మార్కెట్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంచే దిశగా చేపట్టిన ఉడాన్ ప్రాజెక్టు... ప్రపంచంలోనే మొట్టమొదటిదని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్వీటర్లో ట్వీట్ చేసింది. ‘ఫిక్స్డ్ వింగ్ విమానంలో సుమారు 500 కి.మీ. దూరం .. 1 గంట ప్రయాణానికి లేదా హెలికాప్టర్లో 30 నిమిషాల ప్రయాణానికి ఈ స్కీము కింద గరిష్టంగా చార్జీలు రూ. 2,500కి పరిమితమవుతాయి‘ అని తెలిపింది. గతేడాది జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానంలో ఉడాన్ స్కీముకు ప్రాధాన్యమిచ్చారు. కీలకమైన ప్రాంతాల మధ్య విమానయానాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉడాన్ ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని 2016 అక్టోబర్‌లో ప్రకటించారు. 128 రూట్లు... అయిదు ఎయిర్‌లైన్స్ ... అధికారిక ప్రకటన ప్రకారం దక్షిణాదిలో 11 ఎయిర్‌పోర్టులు, తూర్పు రాష్ట్రాల్లో 12, పశ్చిమంలో 24, ఉత్తరాదిలో 17, ఈశాన్య రాష్ట్రాల్లో 6 ఎయిర్‌పోర్టులను ఈ స్కీము కింద అనుసంధానించనున్నారు. అంతంత మాత్రంగా సర్వీసులున్న, అస్సలు సర్వీసులు లేని 45 విమానాశ్రయాలకు కూడా కనెక్టివిటీ కల్పిస్తారు. బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం ఈ స్కీము కింద గత నెలలో అయిదు ఎయిర్‌లైన్స్‌కి 128 రూట్స్‌ను కేటాయించారు. ఉడాన్ స్కీము కింద ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో కొంత భాగాన్ని భరిస్తాయి. 19 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
ఆమ్ ఆద్మీ ఫ్లైట్ ఎగిరేది రేపే...
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల విమానం రేపే ఎగురబోతుంది. 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పేరుతో సామాన్యుడికి సైతం విమాయయోగం కల్పించాలని ఉద్దేశించి తీసుకొస్తున్న తొలి విమానాన్ని రేపు ప్రధాని ప్రారంభించబోతున్నారు. సిమ్లా నుంచి ఢిల్లీ మధ్య ప్రయాణాలకు ఈ విమాన పథకాన్ని ప్రధాని ప్రారంభించబోతున్నారని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఆర్సీఎస్ కింద తొలి ఉడాన్ విమానాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2017 ఏప్రిల్ 27న ప్రారంభించబోతున్నారని, ఈ కార్యక్రమంలో భాగంగానే కడప-హైదరాబాద్, నందేడ్-హైదరాబాద్ సెక్టార్లలోనూ ఉడాన్ విమానాలకు పచ్చ జెండా ఊపనున్నారని పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విమానంలో గంట జర్నీకి టిక్కెట్ ధర రూ.2500గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూట్లను బట్టి, విమాన ప్రయాణ వ్యవధి బట్టి టిక్కెట్ ధరలు మారుతుంటాయని పీఎంఓ పేర్కొంది. మార్కెట్ ఆధారిత మెకానిజంతో స్థానిక ప్రాంతాలకు కనెక్టివిటీ అందజేయడానికి గ్లోబల్ గా ప్రారంభించన తొలి విమానం ఉడానేనని పీఎంఓ ట్వీట్ చేసింది. 2016 అక్టోబర్ లో ఈ స్కీమ్ ను ఏవియేషన్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. 2016 జూన్ 15న విడుదల చేసిన నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో ఉడాన్ స్కీమ్ ఓ కీలక కాంపొనెంట్ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కీమ్ ను సిమ్లాలో మోదీ ప్రారంభిస్తారు. సిమ్లా పర్యటనలో భాగంగా చారిత్రక రిట్జ్ మైదాన్‌లో ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి సిమ్లాలో పర్యటించనున్నారు. 2003లో హిమాచల్ ప్రదేశ్ ను మోదీ పర్యటించినప్పటికీ, అప్పుడు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నారు. -
ఇక ‘ఉడాన్’కు రెక్కలు
♦ 5 ఎయిర్‌లైన్స్, 128 రూట్లు ఎంపిక... ♦ మొత్తం 70 ఎయిర్‌పోర్టుల అనుసంధానం ♦ బిడ్డింగ్‌లో విజేతలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ♦ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టర్బో మేఘ ♦ స్పైస్‌జెట్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, అలైడ్ సర్వీసెస్ ♦ గంట ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.2,500 మాత్రమే న్యూఢిల్లీ: దేశంలో సామాన్య ప్రజలకు సైతం విమానయానాన్ని చేరువ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్ ఇక రెక్కలు విప్పుకోనుంది. ఈ స్కీమ్ పరిధిలో విమాన సర్వీసులను అందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్‌లైన్స్ సంస్థలను, 128 రూట్లను కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 70 ఎయిర్‌పోర్టులను దీనిద్వారా అనుసంధానం చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 31 ఎయిర్‌పోర్టులు నిర్వహణలో లేనివే. మరో 12 అరకొర సర్వీసులున్న ఎయిర్‌పోర్టులను కూడా జాబితాలో చేర్చారు. ఉడాన్ కింద సర్వీసులకు అనుమతులు దక్కిన ఎయిర్‌లైన్స్‌లో ప్రభుత్వ రంగ ఎయిరిండియా అనుబంధ సంస్థ అలైడ్ సర్వీసెస్‌తో పాటు స్పైస్‌జెట్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, టర్బో మేఘ ఉన్నాయి. ట్రూజెట్ పేరుతో సర్వీసులు అందిస్తున్న టర్బో మేఘ తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ కావడం గమనార్హం. ఉడాన్ స్కీమ్ కింద గంట ప్రయాణ సమయం గల టిక్కెట్ ధర రూ.2,500 మించకుండా పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ విమానయానానికి ఊతమివ్వడం, కార్యకలాపాల్లేని ఎయిర్‌పోర్టుల్లో సర్వీసులు తిరిగి ప్రారంభించడం ద్వారా విమానయానాన్ని అందరికీ చేరువయ్యేలా చేయడమే ఈ స్కీమ్ ప్రధానోద్దేశం. వచ్చే నెలలో తొలి విమానం టేకాఫ్... ఉడాన్ స్కీమ్‌లో తొలి విమానం వచ్చే నెల నుంచి సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని గురువారమిక్కడ బిడ్డింగ్ విజేతలను ప్రకటించిన సందర్భంగా పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే పేర్కొన్నారు. బిడ్డింగ్‌లో ఐదు విమానయాన సంస్థలు అనుమతులు దక్కించుకున్నాయని తెలియజేశారు. ఆయా కంపెనీలు 19–78 సీట్ల విమానాలను ఈ 128 రూట్లలో నడుపుతాయని ఆయన వెల్లడించారు. ‘ప్రతి విమాన సర్వీసులో 50 శాతం సీట్లు కచ్చితంగా ఉడాన్ స్కీమ్ కింద కేటాయించాల్సి ఉంటుంది. దీనిలో ఒక్కో సీటు/ఒక్కో గంటకు టిక్కెట్ చార్జీ రూ.2,500కు మించకూడదు’ అని చౌబే పేర్కొన్నారు. కాగా, ఈ స్కీమ్‌లో సర్వీసులు నడిపే ఎయిర్‌లైన్స్‌కు ఒక్కో టికెట్‌పై కేంద్రం సబ్సిడీ రూపంలో కొంత మొత్తాన్ని(వయబిలిటీ గ్యాప్ ఫండింగ్–వీజీఎఫ్) చెల్లిస్తుంది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన రూట్లలో విమాన సర్వీసుల నుంచి పన్ను రూపంలో కేంద్రం దాదాపు రూ.8,500 కోట్ల మేర నిధులను సమకూర్చుకుంటుంది. తొలిరౌండ్ బిడ్డింగ్‌లో ఎంపికైన ఆపరేటర్లకు (ఎయిర్‌లైన్స్) వార్షికంగా రూ.205 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సి రావచ్చని చౌబే వెల్లడించారు. కాగా, ఈ ఫండింగ్ కోసం ప్రధాన రూట్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 చొప్పున అదనపు భారం (పన్ను) విధిస్తామని ఆయన తెలిపారు. టికెట్ ధరపై ఇది 1 శాతం కంటే తక్కువేనన్నారు. తదుపరి రౌండ్ ఉడాన్ బిడ్డింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని చౌబే పేర్కొన్నారు. ఉడాన్ రూట్లో కార్యకలాపాలు మొదలుపెట్టిన రోజు నుంచి మూడేళ్లపాటు సంబంధిత ఎయిర్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లభిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఒక్కో సీటుకు వీజీఎఫ్ స్థాయి ఆధారంగా తొలి రౌండ్ బిడ్డింగ్‌లో విజేతలను (ఎయిర్‌లైన్స్) ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ స్కీమ్‌లో ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్‌పోర్టు చార్జీల్లో మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. కడప ఎయిర్‌పోర్టుకు చాన్స్... ఉడాన్‌లో స్థానం దక్కించుకున్న వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి కడప ఎయిర్పోర్ట్ నిలిచింది. ఇంకా ఈ జాబితాలో భటిండా, సిమ్లా, బిలాస్పూర్, నైవేలి, కూచ్ బిహార్, నాందేడ్ తదితర ఎయిర్‌పోర్టులున్నాయి. కాగా, మొత్తం 128 రూట్లలో ఎయిర్ ఒడిశాకు అత్యధికంగా 50 దక్కాయి. తర్వాతి స్థానాల్లో ఎయిర్ డెక్కన్(34 రూట్లు), టర్బో మేఘ(18), అలైడ్ సర్వీసెస్(15), స్పైస్ జెట్(11) ఉన్నాయి. ఉడాన్ ఎయిర్‌పోర్టులు 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఉన్నాయి. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్ఛేరి, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటివి స్థానం దక్కించుకున్నాయి. మేం వీజీఎఫ్ వినియోగించుకోం: స్పైస్‌జెట్ ఉడాన్ స్కీమ్‌లో ఉన్నప్పటికీ.. తాము వీజీఎఫ్‌ను వినియోగించుకోబోమని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కాగా, ఉడాన్ సర్వీసులు నిరంతరాయంగా కొనసాగాలంటే ఎయిర్‌లైన్స్‌కు వీజీఎఫ్ చెల్లింపులు క్రమంతప్పకుండా ఇవ్వడం చాలా ప్రధానమైన అంశమని కేపీఎంజీలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం పార్ట్నర్, హెడ్ ఆంబెర్ దూబే పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యాలు లేకుండా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)) ఒక పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూ పొందించాలని ఆయన సూచించారు. ఉడాన్ స్కీమ్ అమలు బాధ్యతలను ఏఏఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అశుభం వద్దు: అశోక్ గజపతిరాజు ఇటీవల కొన్ని విమానయాన కంపెనీలు మూతపడుతుండటంపై (ఎయిర్‌కోస్టాను ఉద్దేశించి) విలేకరులు అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందిస్తూ... ‘కొన్ని క్రాష్ అయ్యాయి.. మరికొన్ని బతికున్నాయి’ అని పేర్కొన్నారు. ఇక ఉడాన్ స్కీమ్‌లో కొత్త ఎయిర్‌లైన్స్ గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘మనం ఏదైనా ఒక పని తలపెట్టినపప్పుడు అశుభ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు కదా. భారత్‌లో విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ అన్నీ ఉత్తమమైన సేవలు అందించాలని కోరుకుందాం’ అని చెప్పారు.