‘ఉడాన్’ సర్వీసులు ఎగరేనా?
న్యూఢిల్లీ : దేశంలో హవాయ్ చెప్పులేసుకొని తిరిగే సామాన్యులు కూడా హవా హవాయి అంటూ ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ లేదా ఉడాన్’ విమానాల్లో విహరించాలని ఆకాంక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామాన్యుల కోసం సబ్సిడీ కింద గాల్లో గంట ప్రయాణానికి దాదాపు 2,500 రూపాయలు ఉంటుందని మోదీ స్వయంగా ప్రకటించారు. దూరం పెరుగుతున్నా కొద్ది ఈ సబ్సిడీ టిక్కెట్ ధర కూడా పెరుగుతుంది.
దేశంలో గడచిన రెండు దశాబ్దాలుగా దారిద్య్రం తగ్గినప్పటికీ 21.9 శాతం దారిద్య్ర రేఖకు దిగువనే నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 816 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు వెయ్యి రూపాయలకన్నా తక్కువ సంపాదించే వారిని మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. అలాంటిప్పుడు వీరు రెండువేల నుంచి రెండున్నర వేల రూపాయలు పెట్టి ఉడాన్ విమానం ఎక్కే ప్రసక్తే లేదు.
కేంద్ర ప్రభుత్వం నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంచనాల ప్రకారమే దేశంలో 40 శాతం మంది ప్రజలు తాము జీవించడానికి నెలకు సగటున రవాణా ఖర్చులు కలుపుకొని (గ్రామీణ ప్రాంతాల్లో ) 1760 రూపాయలు, పట్టణాల్లో నెలకు సగటున 2,629 రూపాయలను ఖర్చు పెడుతున్నారు. వాటిలో వారి నెలకు సగటు రవాణా ఖర్చులు దాదాపు 200 రూపాయలు ఉంది. రవాణా చార్జీలను కలుపుకొని నెల మొత్తానికి ఖర్పు పెట్టే మొత్తాన్ని సామాన్య మానవుడు కనీసం ఒక్క రోజు ఒక్క గంట ఉడాన్ విమాన ప్రయాణానికి ఖర్చు పెట్టగలరా ? ఢిల్లీ నుంచి సిమ్లాకు అలయెన్స్ ఏర్ నిర్వహిస్తున్న ఉడాన్ సర్వీసులో జూన్ ఒకటవ తేదీకి సబ్సిడీ టిక్కెట్ ధర 2,036 రూపాయలు ఉంది.
హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సులో ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్లాలంటే కేవలం 415 రూపాయలు అవుతుంది. కాకపోతే సమయం 12 గంటలు పడుతుంది. అదే రైల్లో ఢిల్లీ నుంచి కల్కా వరకు (నేరుగా రైలు సౌకర్యం లేదు) ఏసీబోగీలో వెళితే 590 రూపాయలు, అక్కడి నుంచి సిమ్లా వెళ్లేందుకు మరో 300 రూపాయలు అవుతుంది. ఐదు గంటలు, ఐదు గంటలు మొత్తం పది గంటల ప్రయాణానికి 890 రూపాయలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు బస్సులు, రైళ్లు వదిలేసి ఉడాన్‌లో వెళతారా?
ఉడాన్ విమాన సర్వీసులు ఏ నెలకో, సంవత్సరానికో, జీవితంలో ఒక్కసారో ప్రయాణించడానికి ప్రధాని తీసుకరాలేదన్న విషయం అందరికి తెల్సిందే. ఈ ఉడాన్ సర్వీసులు ఇప్పటికే విమాన సర్వీసులు లేని పట్టణాల మధ్య వారానికి కనీసం మూడు, గరిష్టంగా ఏడు సర్వీసులను నడపాల్సి ఉంటుంది. అంటే సామాన్యులు తరచుగా ఈ విమాన సర్వీసుల్లో ప్రయాణిస్తారన్నది ప్రభుత్వం అంచనా. ఉడాన్ సర్వీసులను నిర్వహించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు కనీస బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్‌లు దక్కించుకోవాల్సి ఉంటుంది.
ప్రయాణికులు ఉంటారో, లేదో తెలియకుండా తక్కువ రేట్‌కు విమానయాన సంస్థలు బిడ్డింగ్ వేస్తాయా? అన్నది ఒక ప్రశ్నయితే, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ సమన్వయంతో నడవాల్సిన ఉడాన్ సర్వీసులకు ప్రాక్టిగల్‌గా ఎన్ని చిక్కులు వస్తోయో చెప్పలేమని విమానయాన సలహా సంస్థ ‘మార్టిన్ కన్సల్టింగ్’ వ్యవస్థాపకులు మార్క్ మార్టిన్ లాంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం విమానాల ఇంధనం ధర తక్కువగానే ఉంది. భవిష్యత్తులో పెరగదన్న గ్యారెంటీ లేదు. పెరిగినప్పుడు ఛార్జిలు పెంచరా?
భారత దేశంలో సామాన్యులకు విమానం ఎక్కే స్థోమత లేనందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ సర్వీసులు ప్రధానంగా మధ్యస్థాయి వ్యాపారస్థులకు ఉపయోగపడుతుందని ఏరోస్పేస్, డిఫెన్స్‌కు చెందిన గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ భారతీయ భాగస్వామి అంబర్ దూబే తెలిపారు. సామాన్యులు కాకుండా విహార యాత్రల కోసం విమానాల్లో రెండున్నర వేల రూపాయలను ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారు దేశంలో కోట్ల మందే ఉన్నారని, ఈ ఉడాన్ పథకాన్ని పర్యాటక రంగానికి మళ్లీస్తే ఆ రంగం ఎంతో అభివద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయయపడ్డారు.