‘ఉడాన్’కు నేడు శ్రీకారం
► ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలు
► ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
► కడప, నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలకు ఊతమిచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమును అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తొలుత సిమ్లా నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే కడప– హైదరాబాద్, నాందేడ్– హైదరాబాద్ రూట్లలో కూడా విమానాలను ప్రారంభించనున్నారు. ఈ స్కీము కింద విమానయాన టికెట్ల ధరల గరిష్ట పరిమితి రూ. 2,500గా ఉంటుంది.
మార్కెట్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంచే దిశగా చేపట్టిన ఉడాన్ ప్రాజెక్టు... ప్రపంచంలోనే మొట్టమొదటిదని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ట్వీటర్‌లో ట్వీట్ చేసింది. ‘ఫిక్స్‌డ్ వింగ్ విమానంలో సుమారు 500 కి.మీ. దూరం .. 1 గంట ప్రయాణానికి లేదా హెలికాప్టర్‌లో 30 నిమిషాల ప్రయాణానికి ఈ స్కీము కింద గరిష్టంగా చార్జీలు రూ. 2,500కి పరిమితమవుతాయి‘ అని తెలిపింది. గతేడాది జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానంలో ఉడాన్ స్కీముకు ప్రాధాన్యమిచ్చారు. కీలకమైన ప్రాంతాల మధ్య విమానయానాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉడాన్ ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని 2016 అక్టోబర్‌లో ప్రకటించారు.
128 రూట్లు... అయిదు ఎయిర్‌లైన్స్ ...
అధికారిక ప్రకటన ప్రకారం దక్షిణాదిలో 11 ఎయిర్‌పోర్టులు, తూర్పు రాష్ట్రాల్లో 12, పశ్చిమంలో 24, ఉత్తరాదిలో 17, ఈశాన్య రాష్ట్రాల్లో 6 ఎయిర్‌పోర్టులను ఈ స్కీము కింద అనుసంధానించనున్నారు. అంతంత మాత్రంగా సర్వీసులున్న, అస్సలు సర్వీసులు లేని 45 విమానాశ్రయాలకు కూడా కనెక్టివిటీ కల్పిస్తారు.
బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం ఈ స్కీము కింద గత నెలలో అయిదు ఎయిర్‌లైన్స్‌కి 128 రూట్స్‌ను కేటాయించారు. ఉడాన్ స్కీము కింద ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో కొంత భాగాన్ని భరిస్తాయి. 19 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.