aviation services
-
AP: విమానయానం రయ్ రయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయాన రంగం కోవిడ్ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో విమాన ప్రయాణీకుల సంఖ్యలో 159.11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ సర్వీసుల సంఖ్యలో 75.51 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి గడిచిన ఆర్నెల్ల కాలంలో 11,88,673 మంది ప్రయాణించారు. గత ఏడాది ప్రయాణించిన 4,58,738 మందితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో 159 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో విమాన సర్వీసులు సంఖ్య 7,982 నుంచి 14,010కు పెరిగింది. చదవండి: చిరకాల స్వప్నం నెరవేరింది..: ఏపీ టీచర్స్ గిల్డ్ హర్షం అంతర్జాతీయ సర్వీసులపై ఇంకా ఆంక్షలు ఉండటంతో విదేశీ సర్వీసులు సంఖ్య నామమాత్రంగానే ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో దేశీయ సర్వీసులు మాత్రం కోవిడ్ ముందు స్థితికి చేరుకోవడమే కాకుండా కొత్త సర్వీసులు కూడా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్‌కు ముందు విశాఖకు అంతర్జాతీయ సర్వీసులతో కలిపి రోజుకు 80 వరకు విమానాల రాకపోకలు ఉండగా ఇప్పుడిది 62 వరకు చేరుకుందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కేఎస్ రావు ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కసారి అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు తొలగిపోతే ఈ సర్వీసుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తిరుపతికి పెరిగిన డిమాండ్ ఇక రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోకెల్లా తిరుపతికి డిమాండ్ బాగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తిరుపతి ప్రయాణికుల సంఖ్యలో 262.59 శాతం, సర్వీసుల సంఖ్యలో 205.78 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 59,129 మంది ప్రయాణించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా 2,14,400కు చేరింది. ఇదే సమయంలో విమాన సర్వీసుల సంఖ్య 1,002 నుంచి 3,064కు చేరింది. కోవిడ్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాలపై ఆంక్షలు తొలగించడమే ప్రయాణికుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే స్పైస్‌జెట్ ఢిల్లీ నుంచి తిరుపతికి నేరుగా సర్వీసు ప్రారంభించగా ఇండిగో డిసెంబర్ 15 నుంచి విశాఖ–తిరుపతి సర్వీసును ప్రారంభించనుంది. డిమాండ్ పెరుగుతుండడంతో మరిన్ని పట్టణాల నుంచి తిరుపతికి సర్వీసులను పెంచే యోచనలో విమానయాన సంస్థలున్నాయి. మరోవైపు.. తిరుపతి తర్వాత విశాఖ విమాన సర్వీసులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. గడిచిన ఆరు నెలల కాలంలో విశాఖ నుంచి 5,861 సర్వీసుల ద్వారా 2,14,400 మంది ప్రయాణించారు. కొత్తగా ప్రారంభమైన కర్నూలు విమానాశ్రయం ద్వారా ఆరు నెలల్లో 14,224 మంది ప్రయాణించారు. -
సెకండ్ వేవ్‌తో విమానయానానికి కష్టాలు
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 80-85 శాతానికే పరిమితం కానుంది. గతంలో ఇది 130-135 శాతం పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గతేడాది మే 25 తర్వాత విమాన సర్వీసులను పరిమిత స్థాయిలో పునరుద్ధరించాక.. దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి గతేడాది స్థాయిలో 64 శాతానికి చేరింది. కానీ మార్చి ఆఖరు, ఏప్రిల్ నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, వైరస్ కట్టడికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలతో మళ్లీ విమాన ప్రయాణాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలవారీగా చూసినప్పుడు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా 0.7 శాతం మేర క్షీణించింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ప్యాసింజర్ ట్రాఫిక్ 1.4 శాతం పెరిగింది. నెలవారీగా ఏప్రిల్‌లో 28 శాతం డౌన్.. ఇక్రా నివేదిక ప్రకారం 2021 మార్చిలో సగటున రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.49 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో ఇది 28 శాతం క్షీణించి 1.79 లక్షలకు తగ్గిపోయింది. ఇక మే 1 - మే 16 మధ్య కాలంలో మరింతగా 56 శాతం క్షీణించింది. విమాన ప్రయాణాలు చేయాలంటే భయాలు నెలకొనడంతో పాటు గడిచిన రెండు నెలలుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండటం కూడా ఇందుకు కారణమని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రేటింగ్స్) శుభం జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగవచ్చని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 80-85 శాతానికి పరిమితం కావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లుగా డిసెంబర్ నాటికి సింహభాగం జనాభాకు (18 ఏళ్లు పైబడినవారు) టీకాలు వేసే ప్రక్రియ పూర్తయితే .. థర్డ్ వేవ్ ప్రభావం కొంత తగ్గే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. 2023 నాటికి కోవిడ్ పూర్వ స్థాయికి.. తాజా పరిస్థితులను బట్టి చూస్తే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి గానీ దేశీయంగా విమానయానం కోవిడ్–19 పూర్వ స్థాయికి కోలుకోలేదని ఇక్రా తెలిపింది. అదే విదేశాలకు విమాన ప్రయాణాల విభాగానికైతే 2024 ఆర్థిక సంవత్సరం దాకా పట్టేస్తుందని వివరించింది. ప్యాసింజర్ ట్రాఫిక్ తగ్గుదల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నిర్వహణ ఆదాయాలు 12 శాతం క్షీణించి రూ. 12,800 కోట్లకు, నిర్వహణ లాభాలు 40 శాతం క్షీణించి రూ. 2,560 కోట్లకు పరిమితం కావచ్చని పేర్కొంది. వందే భారత్ మిషన్ (వీబీఎం) కింద భారత్‌తో ద్వైపాక్షిక విమాన రవాణా ఒప్పందాలు కుదుర్చుకున్న పలు దేశాలు (అమెరికా, బ్రిటన్ మొదలైనవి).. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కారణంగా తాత్కాలికంగా భారత్ నుంచి ఫ్లయిట్స్‌ను రద్దు చేశాయని తెలిపింది. భారీ స్థాయిలో వేక్సినేషన్, లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత, బిజినెస్ ట్రావెల్, పర్యాటక సంబంధ ప్రయాణాలు మొదలైనవి పుంజుకోవడంపైనే సమీప భవిష్యత్తులో ఏవియేషన్ రంగం కోలుకోవడం ఆధారపడి ఉంటుందని ఇక్రా వివరించింది. ప్రైవేట్ విమానాలకు భలే గిరాకీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీ సంపన్నులు తమ విమాన ప్రయాణాలకు.. కమర్షియల్ ఎయిర్‌లైన్స్ కన్నా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ జెట్ ఆపరేటర్లు నడిపే ఫ్లయిట్ సరీ్వసులు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం .. జనరల్ ఏవియేషన్ ఫ్లయిట్ సేవలు గతేడాది మార్చిలో 37.7 శాతం క్షీణించగా .. తాజాగా మార్చిలో ఏకంగా 71.8 శాతం వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు, కమర్షియల్ విమానయాన సంస్థలు తిరిగి కోవిడ్-19 పూర్వ స్థాయికి తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం రికవరీ మొదలైనట్లు కనిపించినా.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో మళ్లీ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది విదేశాలకు, దేశీయంగా ఇతర ప్రాంతాలకు తొలిసారిగా ప్రయాణిస్తున్న వారు ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య గతంతో పోలిస్తే సుమారు 25 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయాణించాల్సిన వారు కూడా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకుంటున్నట్లు వివరించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక టెర్మినల్.. ప్రైవేట్ విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఫ్లైట్స్ కోసం ఢిల్లీ అంతర్జాతీయ విమాశ్రయంలో గతేడాది సెప్టెంబర్‌లో ప్రత్యేకంగా జనరల్ ఏవియేషన్ టెర్మినల్(జీఏటీ)ని ప్రారంభించారు. గణాంకాల ప్రకారం .. ఈ టెర్మినల్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తొలినాళ్లలో రోజుకు 96 మంది దాకా ఉండగా.. మార్చి నాటికి సుమారు 25 శాతం వృద్ధి చెంది 120కి పైగా పెరిగింది. దేశీయంగా తొలి జీఏటీ అయిన ఈ టెర్మినల్‌ను బర్డ్ గ్రూప్, ఎగ్జిక్యూజెట్ ఏవియేషన్ గ్రూప్ కలిసి దాదాపు రూ.150 కోట్లతో నిర్మించాయి. గంటకు 50 మంది ప్రయాణికులు, రోజుకు 150 జెట్స్ నిర్వహణ సామర్థ్యంతో దీన్ని రూపొందించాయి. చదవండి: పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్రమాద బీమా -
ఆరంభమైన గగనయానం
సాక్షి, మధురపూడి: కరోనా మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యంతో విధించిన లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన పౌరవిమాన సేవలు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌కు దశలవారీగా సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి దేశీయ విమాన సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చెన్నై నుంచి సాయంత్రం 5.10 గంటలకు ఒక విమానం వచ్చింది. ఇండిగో సంస్థ నడిపిన ఈ విమానంలో 78 మంది ప్రయాణించేందుకు అనుమతి ఉండగా 54 మంది వచ్చారు. ఈ విమానం తిరిగి 5.45 గంటలకు 48 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి చెన్నైకి పయనమైంది. పౌరవిమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్టులో సందడి నెలకొంది. అయితే అనుకున్నన్ని విమాన సరీ్వసులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చదవండి: ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు ప్రయాణికుల బ్యాగేజిని శానిటైజ్ చేస్తున్న సిబ్బంది ‘స్పందన’లో నమోదు చేసుకుంటేనే అనుమతి ►విమానంలో ప్రయాణించాలనకునేవారు రాష్ట్ర ప్రభుత్వ ‘స్పందన’ వెబ్సైట్లో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి మాత్రమే విమానయాన సంస్థలు టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ►రాష్ట్రానికి చేరిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానిత లక్షణాలుంటే వారం రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచుతారు. ►వారం తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ వచ్చిన వారికి మరో వారం రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంచుతారు. ►తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. వైద్య పరీక్షలకు స్వాబ్ ఇచ్చిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. హైదరాబాద్ సర్వీసు రద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం రావల్సిన విమాన సర్వీసు రద్దయ్యింది. మామూలుగా ఈ సర్వీసు ప్రతి రోజూ రాత్రి 8.55 గంటలకు వచ్చి, 9.25 గంటలకు తిరుగు పయనమవుతుంది. కట్టుదిట్టంగా నిబంధనల అమలు ►విమాన సేవలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిర్దేశించిన నిబంధనలను పక్కాగా అమలు చేశారు. ►ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు. మాసు్కలు తప్పనిసరిగా ధరించేలా చూశారు. ►సింగిల్ బ్యాగేజీని మాత్రమే వెంట అనుమతించారు. ►అన్ని తనిఖీలు, పరిశీలనల అనంతరం ప్రయాణికులను విమానం వద్దకు పంపారు. ►ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో లేదో పరిశీలించారు. హైదరాబాద్, చెన్నైకి సేవలు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సేవలున్నాయి. అయితే సోమవారం హైదరాబాద్ సర్వీసు రద్దయ్యింది. దేశంలోని ముంబయ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర ఆరు మెట్రో నగరాల్లోని విమానాశ్రయాల నుంచి మిగిలిన నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. ఆ నగరాల నుంచే మూడో వంతు సర్వీసులు నడుస్తాయి. విమానాలు అక్కడి నుంచి వస్తేనే తప్ప, వాటి రాకపోకల వివరాలను కచ్చితంగా తెలియజేసే పరిస్థితి లేదు. – మనోజ్‌కుమార్ నాయక్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్, రాజమహేంద్రవరం -
విమాన టికెట్లు క్రెడిట్ షెల్‌లోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 15 నుంచి పరిస్థితులను బట్టి దశల వారీగా విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిందే ఆలస్యం.. అన్ని దేశీయ విమానయాన కంపెనీలు టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించేశాయి. కానీ, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని కేంద్రం ప్రకటించింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలా? వద్దా? దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీస్‌లను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 3 వారాల లాక్డౌన్ తర్వాత విమాన సేవల పునరుద్ధ్దరణ నిర్ణయం ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. ఎవరైతే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య టికెట్లను బుకింగ్ చేశారో ఆయా ప్యాసింజర్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్స్‌ను, కొన్ని కంపెనీలైతే ట్రావెల్ ఓచర్లను అందిస్తున్నాయి. ఆయా పీఎన్ఆర్ స్టేటస్ రద్దు కాకుండా కస్టమర్లు ఇతరత్రా తేదీల్లో వినియోగించుకునే వీలుంటుందని స్పైస్‌జెట్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం స్సైస్జెట్లో రోజుకు 600 విమానాలు తిరుగుతుంటాయి. ఇందులో 10 శాతం వాటా అంతర్జాతీయ విమానాలుంటాయి. నెలకు 50 వేల టికెట్లు బుకింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. 15 నుంచి క్రెడిట్ షెల్‌లోకి.. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఆయా వెబ్సైట్లలో టికెట్ల బుకింగ్ సమయంలో క్రెడిట్ షెల్ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. ఇదేంటంటే.. ఒకవేళ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కాని పక్షంలో కేంద్రం లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేస్తే.. మీరు బుకింగ్ చేసిన టికెట్ల తాలుకు నగదు మీ ఖాతాలో జమ కాదు. అది క్రెడిట్ షెల్ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు అదే పాసింజర్ ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా వినియోగించుకునే వీలుంటుందన్నమాట. ఒకవేళ కస్టమరే టికెట్లను రద్దు చేసుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం రద్దు చార్జీలను భరించాల్సిందే. ఫిబ్రవరిలో 1.23 కోట్ల దేశీయ ప్రయాణికులు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో దేశీయ విమానాల్లో 1.27 కోట్ల మంది, ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణించారు. గతేడాది జనవరిలో 1.25 కోట్లు.. ఫిబ్రవరిలో 1.13 కోట్లుగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో నెలవారీ ట్రాఫిక్ వృద్ధి రేటు 8.98 శాతంగా ఉంది. రద్దీ తాత్కాలికమే.. ఈ నెల 15 నుంచి ఒకవేళ దేశీయ విమానయాన సేవలు పునఃప్రారంభమైతే మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే వివిధ నగరాల్లో చిక్కుకున్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇది విమానయాన సంస్థలకు మూలధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సామూహిక లే ఆఫ్‌లు కొంత వరకు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుందని.. వైరస్ భయాల కారణంగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా వరకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాలను తగ్గించిన విషయం తెలిసిందే. -
‘ఉడాన్’కు నేడు శ్రీకారం
-
‘ఉడాన్’కు నేడు శ్రీకారం
► ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలు ► ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ► కడప, నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు న్యూఢిల్లీ: ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలకు ఊతమిచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమును అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తొలుత సిమ్లా నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే కడప– హైదరాబాద్, నాందేడ్– హైదరాబాద్ రూట్లలో కూడా విమానాలను ప్రారంభించనున్నారు. ఈ స్కీము కింద విమానయాన టికెట్ల ధరల గరిష్ట పరిమితి రూ. 2,500గా ఉంటుంది. మార్కెట్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంచే దిశగా చేపట్టిన ఉడాన్ ప్రాజెక్టు... ప్రపంచంలోనే మొట్టమొదటిదని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్వీటర్లో ట్వీట్ చేసింది. ‘ఫిక్స్డ్ వింగ్ విమానంలో సుమారు 500 కి.మీ. దూరం .. 1 గంట ప్రయాణానికి లేదా హెలికాప్టర్లో 30 నిమిషాల ప్రయాణానికి ఈ స్కీము కింద గరిష్టంగా చార్జీలు రూ. 2,500కి పరిమితమవుతాయి‘ అని తెలిపింది. గతేడాది జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానంలో ఉడాన్ స్కీముకు ప్రాధాన్యమిచ్చారు. కీలకమైన ప్రాంతాల మధ్య విమానయానాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉడాన్ ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని 2016 అక్టోబర్‌లో ప్రకటించారు. 128 రూట్లు... అయిదు ఎయిర్‌లైన్స్ ... అధికారిక ప్రకటన ప్రకారం దక్షిణాదిలో 11 ఎయిర్‌పోర్టులు, తూర్పు రాష్ట్రాల్లో 12, పశ్చిమంలో 24, ఉత్తరాదిలో 17, ఈశాన్య రాష్ట్రాల్లో 6 ఎయిర్‌పోర్టులను ఈ స్కీము కింద అనుసంధానించనున్నారు. అంతంత మాత్రంగా సర్వీసులున్న, అస్సలు సర్వీసులు లేని 45 విమానాశ్రయాలకు కూడా కనెక్టివిటీ కల్పిస్తారు. బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం ఈ స్కీము కింద గత నెలలో అయిదు ఎయిర్‌లైన్స్‌కి 128 రూట్స్‌ను కేటాయించారు. ఉడాన్ స్కీము కింద ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో కొంత భాగాన్ని భరిస్తాయి. 19 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
త్వరలో హైదరాబాద్‌కు విమాన సర్వీసులు
కలెక్టర్ కేవీ రమణ కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా విమానయాన సేవలు అందుబాటులో తెస్తామని కలెక్టర్ కేవీ రమణ అన్నారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాలులో పారిశ్రామికవేత్తలు, జిల్లా అధికారులతో ఈ అంశంపై ఆయన సమీక్షించారు. ఈనెల 7న సీఎం చంద్రబాబు కడప-బెంగుళూరు విమాన సర్వీసులు ప్రారంభించారన్నారు. ఎయిర్ పెగాసెస్ సంస్థ వారంలో మూడు రోజులు కడప-బెంగుళూరు మధ్య సర్వీసులు నడుపుతోందని పేర్కొన్నారు. ఈ విమానయాన సర్వీసులను ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్ పెగాసెస్ సంస్థ త్వరలోనే కడప నుంచి హైదరాబాదుకు విమాన సర్వీసు నడపనుందని వెల్లడించారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు రామ్మూర్తి మాట్లాడుతూ ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న వారు జిల్లాలో అధికంగా ఉన్నందువల్ల కడప-బెంగుళూరు-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు. కడప నుంచి విమాన సర్వీసులు శనివారం ఉదయం, సోమవారం ఉదయం ఏర్పాటు చేస్తే ఐటీ ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కడప నుంచి చెన్నైకి కూడా విమాన సర్వీసు నడిపితే డిమాండ్ ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎయిర్ పెగాసెస్ యాజమాన్యంతో మాట్లాడి చెన్నైకి కూడా సర్వీసులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఎయిర్ ట్రావెల్ పెరిగేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి వసతులు కల్పిస్తామని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కొండారెడ్డి తెలిపారు. ఈ సమావేశ ప్రారంభంలో పర్యాటకశాఖ జిల్లా అధికారి గోపాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, ఏపీఎండీసీ అధికారి కేదార్‌నాథ్‌రెడ్డి, ప్యాప్సీ, రాయలసీమ థర్మల్ పవర్, ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు, పలువురు చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.