హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 15 నుంచి పరిస్థితులను బట్టి దశల వారీగా విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిందే ఆలస్యం.. అన్ని దేశీయ విమానయాన కంపెనీలు టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించేశాయి. కానీ, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని కేంద్రం ప్రకటించింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలా? వద్దా?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీస్‌లను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 3 వారాల లాక్‌డౌన్ తర్వాత విమాన సేవల పునరుద్ధ్దరణ నిర్ణయం ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. ఎవరైతే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య టికెట్లను బుకింగ్ చేశారో ఆయా ప్యాసింజర్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్స్‌ను, కొన్ని కంపెనీలైతే ట్రావెల్ ఓచర్లను అందిస్తున్నాయి. ఆయా పీఎన్‌ఆర్ స్టేటస్ రద్దు కాకుండా కస్టమర్లు ఇతరత్రా తేదీల్లో వినియోగించుకునే వీలుంటుందని స్పైస్‌జెట్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం స్సైస్‌జెట్‌లో రోజుకు 600 విమానాలు తిరుగుతుంటాయి. ఇందులో 10 శాతం వాటా అంతర్జాతీయ విమానాలుంటాయి. నెలకు 50 వేల టికెట్లు బుకింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు.
15 నుంచి క్రెడిట్ షెల్‌లోకి..
ఇండిగో, స్పైస్‌జెట్ వంటి అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఆయా వెబ్‌సైట్లలో టికెట్ల బుకింగ్ సమయంలో క్రెడిట్ షెల్ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. ఇదేంటంటే.. ఒకవేళ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కాని పక్షంలో కేంద్రం లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేస్తే.. మీరు బుకింగ్ చేసిన టికెట్ల తాలుకు నగదు మీ ఖాతాలో జమ కాదు. అది క్రెడిట్ షెల్ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు అదే పాసింజర్ ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా వినియోగించుకునే వీలుంటుందన్నమాట. ఒకవేళ కస్టమరే టికెట్లను రద్దు చేసుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం రద్దు చార్జీలను భరించాల్సిందే.
ఫిబ్రవరిలో 1.23 కోట్ల దేశీయ ప్రయాణికులు..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో దేశీయ విమానాల్లో 1.27 కోట్ల మంది, ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణించారు. గతేడాది జనవరిలో 1.25 కోట్లు.. ఫిబ్రవరిలో 1.13 కోట్లుగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో నెలవారీ ట్రాఫిక్ వృద్ధి రేటు 8.98 శాతంగా ఉంది.
రద్దీ తాత్కాలికమే..
ఈ నెల 15 నుంచి ఒకవేళ దేశీయ విమానయాన సేవలు పునఃప్రారంభమైతే మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే వివిధ నగరాల్లో చిక్కుకున్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇది విమానయాన సంస్థలకు మూలధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సామూహిక లే ఆఫ్‌లు కొంత వరకు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుందని.. వైరస్ భయాల కారణంగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా వరకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాలను తగ్గించిన విషయం తెలిసిందే.
విమాన టికెట్లు క్రెడిట్ షెల్‌లోకి!
Published Sat, Apr 4 2020 4:49 AM | Last Updated on Sat, Apr 4 2020 4:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment