ఇక ‘ఉడాన్’కు రెక్కలు
♦ 5 ఎయిర్‌లైన్స్, 128 రూట్లు ఎంపిక...
♦ మొత్తం 70 ఎయిర్‌పోర్టుల అనుసంధానం
♦ బిడ్డింగ్‌లో విజేతలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం...
♦ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టర్బో మేఘ
♦ స్పైస్‌జెట్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, అలైడ్ సర్వీసెస్
♦ గంట ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.2,500 మాత్రమే
న్యూఢిల్లీ: దేశంలో సామాన్య ప్రజలకు సైతం విమానయానాన్ని చేరువ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్ ఇక రెక్కలు విప్పుకోనుంది. ఈ స్కీమ్ పరిధిలో విమాన సర్వీసులను అందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్‌లైన్స్ సంస్థలను, 128 రూట్లను కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 70 ఎయిర్‌పోర్టులను దీనిద్వారా అనుసంధానం చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 31 ఎయిర్‌పోర్టులు నిర్వహణలో లేనివే. మరో 12 అరకొర సర్వీసులున్న ఎయిర్‌పోర్టులను కూడా జాబితాలో చేర్చారు.
ఉడాన్ కింద సర్వీసులకు అనుమతులు దక్కిన ఎయిర్‌లైన్స్‌లో ప్రభుత్వ రంగ ఎయిరిండియా అనుబంధ సంస్థ అలైడ్ సర్వీసెస్‌తో పాటు స్పైస్‌జెట్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, టర్బో మేఘ ఉన్నాయి. ట్రూజెట్ పేరుతో సర్వీసులు అందిస్తున్న టర్బో మేఘ తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ కావడం గమనార్హం. ఉడాన్ స్కీమ్ కింద గంట ప్రయాణ సమయం గల టిక్కెట్ ధర రూ.2,500 మించకుండా పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ విమానయానానికి ఊతమివ్వడం, కార్యకలాపాల్లేని ఎయిర్‌పోర్టుల్లో సర్వీసులు తిరిగి ప్రారంభించడం ద్వారా విమానయానాన్ని అందరికీ చేరువయ్యేలా చేయడమే ఈ స్కీమ్ ప్రధానోద్దేశం.
వచ్చే నెలలో తొలి విమానం టేకాఫ్...
ఉడాన్ స్కీమ్‌లో తొలి విమానం వచ్చే నెల నుంచి సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని గురువారమిక్కడ బిడ్డింగ్ విజేతలను ప్రకటించిన సందర్భంగా పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే పేర్కొన్నారు. బిడ్డింగ్‌లో ఐదు విమానయాన సంస్థలు అనుమతులు దక్కించుకున్నాయని తెలియజేశారు. ఆయా కంపెనీలు 19–78 సీట్ల విమానాలను ఈ 128 రూట్లలో నడుపుతాయని ఆయన వెల్లడించారు. ‘ప్రతి విమాన సర్వీసులో 50 శాతం సీట్లు కచ్చితంగా ఉడాన్ స్కీమ్ కింద కేటాయించాల్సి ఉంటుంది. దీనిలో ఒక్కో సీటు/ఒక్కో గంటకు టిక్కెట్ చార్జీ రూ.2,500కు మించకూడదు’ అని చౌబే పేర్కొన్నారు. కాగా, ఈ స్కీమ్‌లో సర్వీసులు నడిపే ఎయిర్‌లైన్స్‌కు ఒక్కో టికెట్‌పై కేంద్రం సబ్సిడీ రూపంలో కొంత మొత్తాన్ని(వయబిలిటీ గ్యాప్ ఫండింగ్–వీజీఎఫ్) చెల్లిస్తుంది.
ఇందుకోసం ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన రూట్లలో విమాన సర్వీసుల నుంచి పన్ను రూపంలో కేంద్రం దాదాపు రూ.8,500 కోట్ల మేర నిధులను సమకూర్చుకుంటుంది. తొలిరౌండ్ బిడ్డింగ్‌లో ఎంపికైన ఆపరేటర్లకు (ఎయిర్‌లైన్స్) వార్షికంగా రూ.205 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సి రావచ్చని చౌబే వెల్లడించారు. కాగా, ఈ ఫండింగ్ కోసం ప్రధాన రూట్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 చొప్పున అదనపు భారం (పన్ను) విధిస్తామని ఆయన తెలిపారు. టికెట్ ధరపై ఇది 1 శాతం కంటే తక్కువేనన్నారు.
తదుపరి రౌండ్ ఉడాన్ బిడ్డింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని చౌబే పేర్కొన్నారు. ఉడాన్ రూట్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టిన రోజు నుంచి మూడేళ్లపాటు సంబంధిత ఎయిర్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లభిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఒక్కో సీటుకు వీజీఎఫ్ స్థాయి ఆధారంగా తొలి రౌండ్ బిడ్డింగ్‌లో విజేతలను (ఎయిర్‌లైన్స్) ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ స్కీమ్‌లో ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్‌పోర్టు చార్జీల్లో మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి.
కడప ఎయిర్‌పోర్టుకు చాన్స్...
ఉడాన్‌లో స్థానం దక్కించుకున్న వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి కడప ఎయిర్‌పోర్ట్ నిలిచింది. ఇంకా ఈ జాబితాలో భటిండా, సిమ్లా, బిలాస్‌పూర్, నైవేలి, కూచ్ బిహార్, నాందేడ్ తదితర ఎయిర్‌పోర్టులున్నాయి. కాగా, మొత్తం 128 రూట్లలో ఎయిర్ ఒడిశాకు అత్యధికంగా 50 దక్కాయి. తర్వాతి స్థానాల్లో ఎయిర్ డెక్కన్(34 రూట్లు), టర్బో మేఘ(18), అలైడ్ సర్వీసెస్(15), స్పైస్ జెట్(11) ఉన్నాయి. ఉడాన్ ఎయిర్‌పోర్టులు 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఉన్నాయి. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్ఛేరి, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటివి స్థానం దక్కించుకున్నాయి.
మేం వీజీఎఫ్ వినియోగించుకోం: స్పైస్‌జెట్
ఉడాన్ స్కీమ్‌లో ఉన్నప్పటికీ.. తాము వీజీఎఫ్‌ను వినియోగించుకోబోమని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కాగా, ఉడాన్ సర్వీసులు నిరంతరాయంగా కొనసాగాలంటే ఎయిర్‌లైన్స్‌కు వీజీఎఫ్ చెల్లింపులు క్రమంతప్పకుండా ఇవ్వడం చాలా ప్రధానమైన అంశమని కేపీఎంజీలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం పార్ట్‌నర్, హెడ్ ఆంబెర్ దూబే పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యాలు లేకుండా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)) ఒక పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూ పొందించాలని ఆయన సూచించారు. ఉడాన్ స్కీమ్ అమలు బాధ్యతలను ఏఏఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.
అశుభం వద్దు: అశోక్ గజపతిరాజు
ఇటీవల కొన్ని విమానయాన కంపెనీలు మూతపడుతుండటంపై (ఎయిర్‌కోస్టాను ఉద్దేశించి) విలేకరులు అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందిస్తూ... ‘కొన్ని క్రాష్ అయ్యాయి.. మరికొన్ని బతికున్నాయి’ అని పేర్కొన్నారు. ఇక ఉడాన్ స్కీమ్‌లో కొత్త ఎయిర్‌లైన్స్ గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘మనం ఏదైనా ఒక పని తలపెట్టినపప్పుడు అశుభ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు కదా. భారత్‌లో విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ అన్నీ ఉత్తమమైన సేవలు అందించాలని కోరుకుందాం’ అని చెప్పారు.