వాయుసేన కేంద్రం ఏర్పాటుపై సందిగ్ధం | ambi to form on air force center | Sakshi
Sakshi News home page

వాయుసేన కేంద్రం ఏర్పాటుపై సందిగ్ధం

Published Fri, Sep 26 2014 1:42 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ambi to form  on air force center

 ఆదిలాబాద్ అర్బన్ : భారత వాయుసేన కార్యకలాపాల విస్తరణ కేంద్రం (ఎయిర్ స్ట్రిఫ్) ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ఈ కేంద్రా న్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌తోపాటు, పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో స్థలాలను పరిశీలించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

 మంగళవారం భారత వాయుసేన ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్ సీఎం కేసీఆర్‌ను కలిసింది. సానుకూలంగా స్పందించిన సీఎం రెండు జిల్లాల్లో భూముల లభ్యతకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. దీంతో అం దరూ అనుకుంటున్నట్లు ఈ కేంద్రం ఆదిలాబాద్ శివారులో ఏర్పాటవుతుందా? లేదా పక్క జిల్లాకు తరలిపోనుందా? అనే అయోమయం నెలకొంది.

 నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో కూడా ఎయిర్ స్ట్రిఫ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. అక్కడ కూడా రెవెన్యూ అధికారులు పలుమార్లు స్థలాలను పరిశీలించారు.  వాయుసేన  కార్యకలాపాల విస్తరణ కేంద్రానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం ఆ స్థలంలో నీటి సరఫరా, విద్యుత్, తదితర సౌకర్యాల కల్పనకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపింది.

 1,591 ఎకరాల భూమి గుర్తింపు
 జిల్లా కేంద్రంలో ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణానికి 1591.45 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి ఉంది. ఖానాపూర్, అనుకుంట, కచ్‌కంటి, తంతోలి గ్రామాల శివార్లలో ఈ భూమి ఉంది. ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణంలో కోల్పోయే భూముల్లో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమే అధికంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 అయితే ఖానాపూర్ శివారులోని 50.20 ఎకరాల ప్రభుత్వ భూమి, అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 5.20 ఎకరాలు, ఖానాపూర్ గ్రామ శివారులో 431.36 ఎకరాల వ్యవసాయ భూమి, అనుకుంట గ్రామ శివారులో 501.34 ఎకరాలు, కచ్‌కంటి గ్రామ శివారులో 313.24 ఎకరాల భూమిని అధికారులు అవసరమని గుర్తించారు. దీంతోపాటు తంతోలి గ్రామ శివారులో 256.07 ఎకరాల భూమిని గుర్తించారు.

 ఆందోళనలో శివారు ప్రజలు
 ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణం విషయమై ప్రజల్లో ఆనందం కన్పిస్తున్నా.. నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోవడంతో శివారు గ్రామాల ప్రజలు ఆందోళనలో పడుతున్నారు. నిర్మాణానికి 1,600 ఎకరాలు అవసరం కావడంతో పంట భూములు కోల్పోవాల్సి వస్తుంది. తంతోలి, అనుకుంట, కచ్‌కంటి గ్రామాల శివారుల్లో సుమారు 1200 ఎకరాల భూమి సాగులో ఉంది. అయితే ఏర్పాటుకు గుర్తించినంత మాత్రం భూమి కోల్పోయినట్లు కాదని, ఏర్పాటుకు ఏ భూమి అవసరమో అదే ఇవ్వ డం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

 అధికారులను కలిసిన కచ్‌కంటి గ్రామస్తులు
 ఈ కేంద్రం నిర్మాణంతో ఏఏ భూములను సేకరిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్ మండలంలోని కచ్‌కంటి గ్రామస్తులు బుధవారం ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని కలిశారు. ఇంత వరకు ఏ రెవెన్యూ అధికారి కూ డా సంప్రదించ లేదని, తక్షణమే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులలో ఉన్న అపోహలను తొలగించాలని ఆర్డీవోను కోరారు.

గురువారం కలెక్టర్ ను కలువడానికి రాగా, ఆయన లేకపోవడంతో డీఆర్వో ప్రసాదరావుకు కలిసి వినతిపత్రం అందించారు. ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులు ఈ వారంలో వచ్చి విమానాశ్రయ స్థల పరిశీలన చేయనున్నారు. స్థల పరిశీలన, బెక్ మార్కింగ్, రూట్ మ్యాప్, సదుపాయాల కల్పన, తదితర విషయాలను తెలుసుకోనున్నారని 22న మన జిల్లా అధికారులకు సమాచారం అందింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement