సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనతో ఆ పదవులను ఆశిస్తున్న జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో ఆశలు చిగురించినట్లయ్యింది. ఇదిగో.. అదిగో.. అంటూ నాలుగు నెలలుగా ఊరిస్తున్న ఈ పదవుల విషయంలో ఎట్టకేలకు అధినేత ప్రకటన ఈ నాయకుల్లో ఉత్సాహం నింపినట్లయింది.
మార్కెట్ కమిటీలు, దేవాలయ, ఈస్‌గాం కమిటీలతోపాటు, వివిధ స్థాయిల్లో సుమారు నాలుగువేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, జిల్లాకు సుమారు నాలుగు వం దల వరకు ఈ పదవులు వస్తాయని సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఈ పదవుల కోసం అధికార పార్టీలో గట్టి పోటీ నెలకొంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరికి వారే తమ ముఖ్యనేతల ద్వారా ప్రయత్నాలు ము మ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం గట్టి పోటీ నెలకొంది.
ఆయా నియోజకవర్గాల్లో బలమైన సామాజి క వర్గాలకు చెందిన నేతలు ఈ పదవులు ఆశిస్తుండటంతో ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కత్తిమీద సా ములా తయారవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గా ల నియామకంలో రిజర్వేషన్లను అమలు చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించడంతో ఎవరికి కలిసివస్తాయనేది ఆసక్తిగా మారింది.
ఎవరికి వారే ప్రయత్నాలు..
అధికార టీఆర్‌ఎస్ పార్టీలో వర్గపోరు ఇప్పటికే అంతర్గతంగా రాజుకుని ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రెండు మూడు వర్గాలు గా విడిపోయి ఉన్నారు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. నిర్మల్‌లోనే పరిశీలిస్తే.. ఇక్కడ పార్టీ శ్రేణులు మూడు వర్గాలుగా విడిపోయారు.
స్థానిక ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కె.శ్రీహరిరావు వర్గాలుండగా, ఇటీవల జెడ్పీ చైర్‌పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్ అనుచరవర్గం కూడా ఈ పదవుల రేసులో ఉంటారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముథోల్‌లో అయితే ఈ వర్గపోరు బహిరంగంగానే ఉంది. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వర్గీయులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి అనుచరులు కూడా ఆశిస్తుండటంతో ఈ పదవులు ఎవరిని వరిస్తాయనేది ఆసక్తిగా మారింది. బోథ్‌లో కూడా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో పాటు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ రాములునాయక్ వర్గీయులుగా ఉన్నారు.
ఇంద్రకరణ్‌రెడ్డి అనుచర వర్గం కూడా ఈ నియోజకవర్గంలో ఉండటంతో ఆయా నేతల ద్వారా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తూర్పు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిర్పూర్‌లో ఎమ్మెల్యే కోనప్ప అనుచరులతోపాటు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మ య్య వర్గం కూడా ఈ పదవుల రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొం టున్నాయి. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు వర్గీయులతోపాటు, బాల్కసుమన్ అనుచరవర్గం కూడా ఈ పదవులను ఆశిస్తోంది. చివరకు ఈ పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే..!
‘నామినేటెడ్’ జాతర
Published Mon, Oct 6 2014 1:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement