నేడు టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి | today g.vithal reddy joining in trs party | Sakshi
Sakshi News home page

నేడు టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

Published Wed, Aug 6 2014 12:37 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

today g.vithal reddy joining in trs party

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్న ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అధికారికంగా ఆ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్  కండువా కప్పుకోనున్నారు. విఠల్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

నియోజకవర్గంలోని పలువురు మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఇతర నేతలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గత ఎన్నికల్లో విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో ఒకే ఒక ముథోల్ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది. బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలు ఇప్పటికే పార్టీలో చేరగా.. ఇప్పుడు విఠల్‌రెడ్డి కూడా గులాబీ దళంలో చేరనుండటంతో జిల్లాలో అసలు ప్రతిపక్షమే లేకుండా పోయింది. విఠల్‌రెడ్డి కొంత కాలంగా టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ కండువా వేసుకోవాలని నిర్ణయించారు.

 చారీతో విభేదాలు
 విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రానుండటంతో స్థానికంగా వేణుగోపాలాచారికి చెక్ పడినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన చారితో విఠల్‌రెడ్డికి విబేధాలున్నాయి. ఈ విభేదాలు ఇటీవల బహిర్గత మయ్యాయి. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరితే స్వాగతిస్తామని, తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఇటీవల వేణుగోపాలాచారి ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చకు దారితీసాయి. గతంలో టీడీపీలో ఉన్న వేణుగోపాలాచారి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయాలేదని విఠల్‌రెడ్డి వర్గీయులు ఎదురుదాడి చేశారు. ఎట్టకేలకు విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ముథోల్ నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement