హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కేయొచ్చు. టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది.
ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని, ఆధార్ లేని వారి కోసం బోర్డింగ్ పాస్‌లు, సెల్ఫ్ చెకిన్స్ ఉంటాయని తెలియజేశారు.
జనవరిలో విస్తరణ పనులు షురూ..
ఇటీవలే జీఎంఆర్ సంస్థ 4.5 శాతం వడ్డీకి అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2,250 కోట్ల రుణం తీసుకుంది. దీన్లో రూ.450 కోట్లు (70 మిలియన్ డాలర్లు) హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణ పనుల కోసం వెచ్చిస్తారు. రన్‌వే–2, టెర్మినల్–2 నిర్మాణ పనులను జనవరిలో ప్రారంభించి.. ఏడాదిన్నరలో అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ తెలియజేసింది.ప్రస్తుతం ఒకే రన్‌వే ఉండగా గంటకు 32 విమానాలు ల్యాండ్ అవుతున్నాయి.
విమానాశ్రయ విస్తరణ తర్వాత వీటి సంఖ్య 50కి చేరుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రానున్న ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ వంటి వాటి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించిందని, మెట్రో రైల్‌ను విమానాశ్రయం వరకూ విస్తరించడం, బెంగళూరు జాతీయ రహదారిలోని అరాంఘడ్ నుంచి విమానాశ్రయం వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రహదారిని 6 లైన్లకు విస్తరించనుండటం దీన్లో భాగమేనని జీఎంఆర్ తెలియజేసింది.
జీఎంఆర్, ఎంఏహెచ్‌బీ సంయుక్తంగా 1.5 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు..
జీఎంఆర్ గ్రూప్‌తో తమకు పదేళ్లకు పైగా భాగస్వామ్యం ఉందని మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) ఎండీ దతుక్ మహ్మద్ బాదిల్‌షామ్ ఘాజిల్ చెప్పారు. ప్రస్తుతం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంస్థకు 11 శాతం వాటా ఉంది.
గతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తమకు 10 శాతం వాటాలుండేదని, సరైన ఫలితాలు రాలేదని విరమించుకున్నామని, మళ్లీ అందులో వాటా కొనే ఆలోచన లేదని ఘాజిల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టును కూడా జీఎంఆర్ సంస్థే నిర్వహిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం.
‘‘ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల విభాగంలో అపారమైన అవకాశాలున్నాయి. అందుకే జీఎంఆర్‌తో కలసి 1.5 బిలియన్ డాలర్లతో స్పెషల్ పర్పస్ ఫండ్‌ను (ఎస్‌పీఎఫ్) ఏర్పాటు చేశాం. కొన్ని కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కన్సాలిడేషన్ గురించి చర్చిస్తున్నాం. ఈక్విటీ లేదా జాయింట్ వెంచర్‌గా ఆయా ప్రాజెక్ట్‌లను చేపడతాం’’ అని చెప్పారాయన.
హైదరాబాద్ నుంచి 10 లక్షల పర్యాటకులు లక్ష్యం
జీహెచ్‌ఐఏఎల్, ఎంఏహెచ్‌బీ, ఎంటీపీబీ మధ్య ఒప్పందం
ఏటా హైదరాబాద్ నుంచి మలేషియాకు లక్ష మంది పర్యాటకులు వస్తున్నారని మలేషియా టూరిజం బోర్డ్ (ప్రమోషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖనీదౌద్ చెప్పారు. గతేడాది దేశం నుంచి 6.38 లక్షల మంది పర్యాటకులు వచ్చారని తెలియజేశారాయన.
తెలంగాణలో మలేషియా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి తొలిసారిగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్), మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ), మలేషియా టూరిజం ప్రమోషన్స్ బోర్డ్ (ఎంటీపీబీ) ఒప్పందం చేసుకున్నాయి. మూడేళ్ల కాలపరిమితి ఉండే ఈ ఎంవోయూపై ఆయా సంస్థల అధికారులు గురువారమిక్కడ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దేశంలో మలేషియా టూరిజం ప్రమోషన్‌కు రూ.16 కోట్లు వెచ్చించనున్నట్లు ఖనీద్ తెలిపారు. చైనా, టర్కీ దేశాల్లోని పలు విమానాశ్రయాలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment