ఇంగ్లండ్‌ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని | Delhi Capitals Co Owner GMR Group Buy Majority Share England County Hampshire | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని

Published Tue, Oct 1 2024 10:37 AM | Last Updated on Tue, Oct 1 2024 12:48 PM

Delhi Capitals Co Owner GMR Group Buy Majority Share England County Hampshire

PC: BCCI

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని జీఎంఆర్‌ గ్రూప్‌... ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్‌షైర్‌ క్లబ్‌లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్‌ సంస్థ ప్రకటించింది. 

విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టు
దీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్‌షైర్‌ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్‌ గ్రూప్‌... వచ్చే రెండేళ్లలో హాంప్‌షైర్‌ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్‌షైర్‌ క్లబ్‌కు జీఎంఆర్‌ గ్రూప్‌ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు
‘హాంప్‌షైర్‌ క్లబ్‌ యజమాని, జీఎంఆర్‌ గ్రూప్‌ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్‌ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్‌ గ్రూప్‌కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్‌షైర్‌ క్లబ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్‌షైర్‌ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ చైర్మన్‌ గ్రంథి కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

మా లక్ష్యం అదే
‘భారత్‌తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్‌ ప్రపంచ చాంపియన్‌లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్‌ కుమార్‌ అన్నారు. 

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌నకు ఐఎల్‌టి20 లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్, ఎస్‌ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్‌లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లోనూ జీఎంఆర్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టింది. 

చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement