ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇరుకు రోడ్డు
ఉప్పల్: ఇరుకైన రోడ్డు.. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ నిర్వహణ..అడ్డూ అదుపులేని వేగం.. ఫలితంగా ప్రమాదాలు.. ప్రాణనష్టం.. ఇదీ ఉప్పల్ – వరంగల్ రహదారి మార్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఈ రోడ్డులో రెండు నెలల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఇరుకుగా ఉన్న ఈ రోడ్డులో వేగంగా వాహనం నడిపే వ్యక్తి దానిని అదుపుచేయలేకపోతే ఎదురుగా ఆటో, బైక్‌పై ఉన్న వారు ప్రాణాలు కోల్పోవలసిందే. సరైన ట్రాఫిక్ నియంత్రణ లేక పోవడం, జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌సిబ్బంది లేక పోవడం తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వీటితో పాటు గత దశాబ్దకాలంగా రోడ్డు వెడల్పు చేయక పోవడం, ఫుట్ ఫాత్‌లు ఆక్రమించడం, లాంటి అనేక కారణాలున్నాయి. ఇరుకు రోడ్లు కావడం వల్ల భారీ వాహనాలు మీదకు వచ్చినా తప్పించుకునే దారి లేక ఆమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు.
పోలీసుల ఫోకస్ అంతా చలాన్లపైనే...
ట్రాఫిక్ పోలీసుల ఫొకస్ అంతా చలాన్లపైనే ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై దృష్టిసారించడం మంచిదే. అయితే భద్రతకు సంబంధించిన ఇతర విషయాలపై కూడా దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. కేవలం యూటర్న్‌లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై ఆక్రమణలు తొలగించకపోవడం, ప్రతి కూడలిలో పోలీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోకపోవడం, భారీ వాహనాలను నియంత్రింంచలేకపోవడం, జంక్షన్ల వద్ద, బస్‌షెల్టర్ల వద్ద ఆటో స్టాండ్‌లను తొలగించకపోవడం లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు :
మార్చి22: ఆర్టీసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోడుప్పల్‌లోని అన్నపూర్ణనగర్ కాలనీకి చెందిన స్నేహ(21) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ద్విచక్రవాహాన్ని ఆర్టీసి బస్సు ఢీకోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది
ఏప్రిల్ 6 : మేడిపల్లి మండలం పర్వాతాపూర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొండవీటి సోనాలి(21) విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఉప్పల్ సబ్ స్టేషన్ ఇరుకు రోడ్డు వద్ద లారీ ఢీకోనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
ఏప్రిల్ 17: ఉదయం గుండారం ఆనంద్, అతని భార్య లావణ్య(38) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా గేటు వద్దకు చేరుకునే సమయంలో మార్గ మధ్యలో గుంత ఉండటంతో సడన్ బ్రేక్ వేసాడు. దీంతో వెనకాల కూర్చున్న లావణ్య కిందపడి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స పోందుతూ గురువారం మృతి చెందింది.
ఏప్రిల్ 18 : ఉదయం 6.30 ప్రాంతంలో హబ్సిగూడకు చెందిన రమావత్ హరినాయక్(38) హబ్సిగూడ నుంచి బోడుప్పల్ వెల్తుండగా మార్గ మద్యలో ఉప్పల్ ఏషియన్ థియేటర్ సమీపంలో ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులకు , బార్యపిల్లలకు తీరని శోకాన్నిమిగిల్చాడు. ప్రైవేట్ ఉద్యోగి మేడిపల్లి చింతల శ్రీనివాస్(50) ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తుండగా లారీ ఢీకొని మృత్యువాత పడ్డాడు
రోడ్డు వెడెల్పులేకపోవడమే కారణం
రోజురోజుకూ ట్రాఫిక్‌పెరుగుతోంది. అందుకు అనుగుణంగా రోడ్లు వెడెల్పు కాలేదు. వాహనాల వేగం కూడా పెంచుతున్నారు. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పెరుగుతుంది అనుగుణంగా రోడ్లు వెడల్పు కాలేదు.. వాహానాల వేగం కూడ పెరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్డు వెడల్పు జరగాలి.. – కాశీవిశ్వనా«థ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment